జనమే ఆశీర్వదించారు
ఆ రోజున నేను, అమ్మే.. నాయకులెవరూ లేరు
♦ నెల్లూరు బహిరంగసభలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
♦ చంద్రబాబు మోసాలపై నిప్పులు చెరిగిన ప్రతిపక్షనేత
♦ వైఎస్సార్సీపీలోకి ఆనం విజయ్‌కుమార్‌రెడ్డి ప్రభృతుల చేరిక
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: ‘నేను నాయకులను కాదు.. ప్రజలను, దేవుడిని నమ్ముకున్నా.. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి వచ్చిన రోజున నేను, అమ్మ ఇద్దరమే ఉన్నాం. ప్రజల్లోకి వెళ్లాం. ప్రజలు ఆశీర్వదించారు. దేవుడు దయతలిచాడు’ అని ప్రతిపక్షనేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. ‘ప్రతిపక్షం అంటే ప్రజల గొంతు. ఆ గొంతు వినపడకుండా చేయాలని చంద్రబాబు కుట్ర పన్నుతున్నారు. అందుకే అవినీతి సొమ్ముతో ప్రలోభపెట్టి ఎమ్మెల్యేలను కొన్నారు. చంద్రబాబు అవినీతి సొమ్ముకు ఎనిమిది మంది ఎమ్మెల్యేలు అమ్ముడుపోయారు. వారికి ప్రజలే బుద్ధిచెబుతారు’ అని జగన్ ధ్వజమెత్తారు.
నెల్లూరు కస్తూరిదేవి గార్డెన్‌లో బుధవారం రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి అధ్యక్షతన ఆనం విజయకుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగసభలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నెల్లూరు రూరల్ నియోజకవర్గ నాయకుడు ఆనం విజయకుమార్‌రెడ్డి, ఆయన కుమారుడు కార్తికేయరెడ్డి, సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులు, సొసైటీ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరారు. ఈ కార్యక్రమంలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే...
ప్రజలనే నమ్ముకున్నా...
‘‘2014 ఎన్నికల సమయాన్ని ఓసారి గుర్తుకుతెచ్చుకుంటే.. ఆ రోజుల్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి నేను, అమ్మ ప్రజల్లోకి వచ్చాం. ఆ రోజున నేను, అమ్మ ఇద్దరమే ఉన్నాం. ఆ రోజు మొత్తం 175 స్థానాలు ఖాళీగా కనపడ్డాయి. నాయకులు ఎవరూ కనిపించలేదు. కానీ ఆ రోజు భయపడలేదు. అధికారంలో ఉన్న సోనియాగాంధీకీ భయపడలేదు. సోనియాగాంధీతో కుమ్మక్కై చంద్రబాబు నాపై కేసులు పెట్టినప్పుడు కూడా భయపడలేదు. దేవుడిని, ప్రజలను నమ్ముకున్నాను కాబట్టి భయపడలేదు. ప్రజల వద్దకెళ్లాం. వారు ఆశీర్వదించారు. ఆ దేవుడు దయదలచాడు. 67 మంది ఎమ్మెల్యేలు, 9 మంది పార్లమెంటు సభ్యులతో మొత్తం ఢిల్లీ మనవైపు చూసేలా చేశాం. నేను నాయకులను నమ్ముకోలేదు. ప్రజలను, దేవుడిని నమ్ముకున్నా.
వ్యక్తిత్వం.. విశ్వసనీయత ఉండాలి..
విజయన్న మన పార్టీలోకి చేరటం చాలా ఆనందంగా ఉంది. ఇవాళ విజయన్న చేరడం రాష్ట్ర ప్రజల మనోభావాలకు అద్దం పడుతుంది. చంద్రబాబు ప్రలోభాలకు, అవినీతి సొమ్ముకు అమ్ముడుపోయిన 8 మంది ఎమ్మెల్యేలకు బుద్ధివచ్చేకార్యక్రమం ఇది. ప్రతిపక్షం అంటే ప్రజల గొంతు. మాట్లాడలేని ప్రజల గొంతై మాట్లాడేదే ప్రతిపక్షం. చంద్రబాబు పాలనలో ఆయన మోసాలకు అవస్థలు పడుతున్న ప్రజల గొంతు. ప్రజల గొంతు వినబడనీయకుండా చేయాలని చంద్రబాబు ఆరాటపడుతున్నాడు. కష్టజీవుల గొంతు వినబడకూడదు.. వారి గొంతు నొక్కేయాలన్న ఆలోచనతో చంద్రబాబు ఇవాళ ప్రతిపక్షం గొంతు నొక్కుతున్నాడు. ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నాడు. ఆ ఎమ్మెల్యేలు తన పార్టీ టికెట్‌పై గెలవకపోయినా.. ప్రజలు తన పార్టీకి ఓటేయకపోయినా ఆ ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టి తన అవినీతి సొమ్ముతో కొనుగోలు చేస్తున్నారు.
చంద్రబాబుకన్నా అర్ధం కావాలి.. వెళ్లిన ఆ ఎమ్మెల్యేలకన్నా అర్ధం కావాలి. రాజకీయాల్లో ఉన్నప్పుడు ప్రజలు మనవైపు చూస్తారు. రాజకీయాల్లో రోల్‌మోడల్‌గా ఉండాలి. రాజకీయాల్లో ఉన్న వ్యక్తికి రెండు గుణాలు ఉండాలి. ఒకటి వ్యక్తిత్వం.. మరొకటి విశ్వసనీయత. ఈ రెండు లేకపోతే ఇంట్లో భార్య కూడా వెంట నడిచే పరిస్థితి ఉండదు. అధికారం కోసం, కుర్చీకోసం సొంత మామ ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడవడం చంద్రబాబు వ్యక్తిత్వం. ఎన్నికల సమయంలో కుర్చీ కోసం అబద్ధాలు చెప్పటం.. ఆ తర్వాత ప్రజలను మోసం చేయటం చంద్రబాబు విశ్వసనీయత. చంద్రబాబుకే విశ్వసనీయత లేదంటే.. ఇక ఆ వెళ్లిపోయిన ఎనిమిదిమంది ఎమ్మెల్యేల గురించి మాట్లాడుకోవడమే అనవసరం.
ఈ నీచ రాజకీయాలు ఎక్కువరోజులు నిలబడవు..
ఇవాళ చంద్రబాబు నాయుడు చేయాల్సిందేమిటంటే తన పాలనను మెరుగుపరుచుకోవడం. ఎన్నికల ముందు ఇచ్చిన మాటలను, హామీలను నిజం చేయడం. చంద్రబాబు ఎన్నికల ముందు అబద్దాలు చెప్పి రైతులను, డ్వాక్రా అక్కచెల్లెమ్మలను, చివరకు చదువుకుంటున్న పిల్లలను కూడా మోసం చేశాడు. అలాగే కులం పేరు చెప్పి మోసం చేసిన వ్యక్తి కూడా చంద్రబాబే. ఎన్నికల ముందు ఇచ్చిన మాటలను నెరవేర్చాల్సింది పోయి ఎన్నికలు అయిపోయాయి కాబట్టి ఇక ప్రజలతో నాకేం పని అన్నట్లు హామీలను గాలికొదిలేశారు. చేయాల్సింది వదిలేసి నీచమైన రాజకీయాలు చేస్తూ ప్రజల గొంతు వినకూడదని చెప్పి ప్రలోభపెట్టి ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నారు.
ఈ నీచమైన రాజకీయాలు ఎక్కువ రోజులు నిలబడవు. ఎంతటి సామ్రాజ్యమైనా కూలిపోక తప్పదు. బ్రిటిష్‌సామ్రాజ్యమే కూలిపోయింది. హిట్లర్ వంటి మహానాయకుడు కూడా కూలిపోయాడు. అబద్దాలను, మోసాలను నమ్ముకున్న ఏ వ్యక్తి అయినా ప్రజల కోపాగ్నికి బంగాళాఖాతంలో కలిసే రోజు త్వరలోనే వస్తుంది. చంద్రబాబు చేస్తున్న తప్పులు దేవుడు చూస్తున్నాడు. ప్రజలు చూస్తున్నారు. చంద్రబాబు మోసాలకు, అన్యాయాలకు గట్టిగా మొట్టికాయలు వేసే రోజు వస్తుంది. చంద్రబాబుకు డిపాజిట్లు కూడా గల్లంతయ్యే పరిస్థితి వస్తుంది. చంద్రబాబు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నా మీ అందరి ఆశీస్సులు, దీవెనలతో ఆయనపై పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నా.’’ అని జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు.
అనంతరం మాగుంట లే అవుట్‌లో నూతనంగా నిర్మించిన పార్టీ జిల్లా కార్యాలయాన్ని వైఎస్ జగన్ ప్రారంభించారు. కార్యక్రమంలో ఒంగోలు ఎంపీ వైవీసుబ్బారెడ్డి, నెల్లూరు, తిరుపతి ఎంపీలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వరప్రసాద్, జిల్లా పార్టీ అధ్యక్షుడు, సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి, నెల్లూరు రూరల్, సూళ్లూరుపేట, గూడూరు ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, కిలివేటి సంజీవయ్య, పాశం సునీల్‌కుమార్, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రసన్నకుమార్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.