సాక్షి, తిరుపతి : వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్.జగన్‌మోహన్ రెడ్డి మూడో విడత ఆరవ రోజు చేపట్టిన ఓదార్పు, సమైక్య శంఖారావం యాత్రలో చేసిన ప్రసంగాలు ప్రజలను ఆకట్టుకున్నాయి. శుక్రవారం ఆయన పాకాల, పూతలపట్టు ప్రాంతాల్లో ప్రసంగించారు. ఆయన తన ప్రసంగంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్‌రెడ్డి, ప్రతిపక్షనాయకుడు చంద్రబాబునాయుడుపై ధ్వజమెత్తారు. ఆయన ప్రతిమాటకు ప్రజల నుంచి భారీ స్పందన లభించింది.
ముఖ్యమం త్రి కిరణ్ కుమార్‌రెడ్డి సోనియాగాంధీ గీసిన గీటు దాటరని, ఆయన సమైక్యానికి అనుకూలంగా ఉంటూ, రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నారని అన్నారు. ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు ప్యాకేజీలు కోరుతూ మరో ముందడుగు వేస్తున్నారని తెలిపారు. సీమాంధ్రులకు సమైక్యమని, తెలంగాణ వారికి విభజన చేయాలని పేర్కొంటూ సొంత పార్టీ నాయకులను మోసం చేస్తున్నారని అన్నారు. ఉద్యోగాల కోసం చెన్నై, కర్ణాటక రాష్ట్రాలకు వెళ్లమని చంద్రబాబు అనడం విడ్డూరంగా ఉందన్నారు.
చెన్నైలో ఏపీ రిజిస్ట్రేషన్‌తో వాహనం వెళితే, అక్కడ వారు తెలుగువారిని ఎంత నీచంగా చూస్తున్నారో చంద్రబాబుకు తెలియదా అని ప్రశ్నించారు. దీనికి ప్రజల నుంచి స్పందన లభించింది. జగన్ చెప్పేది నిజమేనని అంటూ నినాదాలు చేశారు. సమైక్యాంధ్రపై తీర్మానం ప్రవేశ పెట్టాలని వైఎస్ విజయమ్మ కోరితే, ఆమెను అరెస్టు చేశారని అన్నారు. దీనికి కూడా సోనియాగాంధీని విమర్శిస్తూ, ప్రజలు నినాదాలు చేశారు.
రాష్ట్రంలో 70 శాతం మంది విభజన వద్దని అంటున్నా సిగ్గు లేకుండా విభజనకు తెగించారని తెలిపారు. త్వరలో ఎన్నికలు వస్తాయని, ఈ ఎన్నికలు ఢిల్లీ అహంకారానికి, తెలుగు వారి ఆత్మగౌరవానికి జరుగుతున్న యుద్దమని అన్నారు. ముఖ్యమంత్రి రైతన్న గురించి పట్టించుకోరని, విభజన కోసం ఆయన ముందుండి చేస్తున్నారని అన్నారు. రాష్ట్రాన్ని విడగొట్టేందుకు చర్చ జరపడానికి ఉత్సాహం చూపిస్తున్నారని అన్నారు. అసెంబ్లీ తీర్మానం చేయకుండా, ఇంత వరకు ఏ రాష్ట్రం విభజించలేదని అన్నారు. అయితే ఒక్క ఆంధ్రప్రదేశ్‌ను మాత్రమే విభజించిన తరువాత, రాష్ట్ర శాసనసభకు పంపారని తెలిపారు.
ఈ విషయాన్ని దేశంలోని అన్ని పార్టీలు గమనిస్తున్నాయని అన్నారు. రైతులకు విద్యుత్తును అందజేయడంలో విఫలమైన ప్రభుత్వం దాని గురించి అసెంబ్లీలో చర్చించడం లేదని అన్నారు. ఇంత వరకు ప్రజలకు ఇళ్లు కట్టించి ఇవ్వలేదని అన్నారు. ఈ బహిరంగ సభల్లో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సమన్వయకర్తలు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, డాక్టర్ సునీల్ కుమార్, మాజీ ఎమ్మెల్యేలు అమరనాథ రెడ్డి, ప్రవీణ్ కుమార్ రెడ్డి, రాజంపేట పార్లమెంటరీ ఇన్‌చార్జి మిథున్ రెడ్డి, పూర్ణం, రవిప్రసాద్, తలుపుల పల్లి బాబు రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఉద్యోగులు విభజన వద్దంటున్నారు
Published Sat, Jan 11 2014 3:46 AM | Last Updated on Mon, Oct 22 2018 9:16 PM
Advertisement