తాకట్టులో తెలుగు ఆత్మగౌరవం | Mortgage Telugu self- esteem | Sakshi
Sakshi News home page

తాకట్టులో తెలుగు ఆత్మగౌరవం

Published Thu, Sep 5 2013 2:54 AM | Last Updated on Mon, Oct 22 2018 9:20 PM

Mortgage Telugu self- esteem

అనంతపురం టౌన్/అర్బన్, న్యూస్‌లైన్: తన కుమారుడిని ప్రధానిని చేసేందుకు సోనియాగాంధీ రాష్ట్ర విభజనకు సాహసించగా, అందుకు అనుగుణంగా లేఖ ఇచ్చిన చంద్రబాబు నాయుడు తెలుగువారి ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టాడని వైఎస్సార్ సీపీ నేతలు విమర్శించారు.  మహానేత తనయ షర్మిల చేపట్టిన సమైక్య శంఖారావం యాత్ర సందర్భంగా జిల్లాలోని కదిరి, హిందూపురం, అనంతపురం ప్రాంతాల్లో పలువురు నాయకుల ప్రసంగించారు.
 
 వైఎస్సార్‌సీపీ పోరాటం
 రాహుల్ ను ప్రధానిని చేయడానికే సోనియాగాంధీ తెలుగు ప్రజల మధ్య చిచ్చు పెడుతోంది. ప్రతిపక్ష హోదాలో ఉన్న చంద్రబాబునాయుడు రెండు కళ్ల సిద్ధాంతంతో రాష్ట్ర విభజనకు సహకరిస్తుండగా,  రాష్ట్ర సమైక్యతను కాపాడేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తోంది. విభజన ప్రకటన రాగానే పార్టీ ఎమ్మెల్యేలు రాజీనామాలు చేశారు. వైఎస్ కుటుంబం ముందుండి పోరాడుతోంది.
 - కాపు రామచంద్రారెడ్డి,
 
 రాయదుర్గం ఎమ్మెల్యే
 ప్రజలే బుద్ధి చెబుతారు
 రాష్ట్ర విభజనకు అనుకూలంగా లేఖ ఇచ్చిన చంద్రబాబు నాయుడు ఏ ముఖం పెట్టుకుని సీమాంధ్రలో బస్సుయాత్ర చేస్తున్నాడు.   ప్రజలే ఆయనకు తగిన బుద్ధి చెబుతారు.ఓట్లు, సీట్ల కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని ముక్కలు చేసింది. రాష్ట్రంలో జగన్‌మోహన్‌రెడ్డి ప్రభంజనంలో కొట్టుకుపోతామేమోనన్న భయంతోనే కాంగ్రెస్, టీడీపీలు  ఇలాంటి తప్పుడు నిర్ణయం తీసుకున్నాయి.
 - కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి,
 ధర్మవరం ఎమ్మెల్యే
 
 వైఎస్‌తోనే అన్ని వర్గాలకు మేలు
 మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి అన్ని వర్గాల వారికి మేలు చేసేలా  సంక్షేమ పథకాలు అమలు చేశారు. ప్రస్తుతం స్వార్థ రాజకీయాల కోసం రాష్ట్రాన్ని చీలుస్తుండగా, సమైక్యత కాపాడేందుకు పోరాడుతున్న వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీకి వెన్నంటి ఉండాలి.
 - తోపుదుర్తి కవిత, వైఎస్సార్‌సీపీ సీఈసీ సభ్యురాలు
 
 వైఎస్ ఉంటే తెలంగాణ అడిగేవారా?
 దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఉన్నన్ని రోజులు తెలంగాణ అడిగే దమ్మున్న నాయకుడే లేడు. పట్టుమని పదిసీట్లు కూడా లేవు, మీరా తెలంగాణా అడిగేది అని అడిగినప్పుడు సమాధానం చెప్పిన నాయకుడే లేరు. అలాంటి వారు ఇప్పుడు తెలంగాణా కావాలని అడుగుతున్నారు. ఈ ధైర్యం వారికి ఎక్కడి నుంచి వచ్చింది.
 -తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి,
 
 రాప్తాడు నియోజకవర్గ సమన్వయకర్త
 కాంగ్రెస్ సింహాసనం తుప్పుపట్టింది
 ముప్పై రోజులుగా సీమాంధ్రలోని 4 లక్షల మంది ఉద్యోగులు రోడ్డుకెక్కారు.  కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల మనోభావాలను ఏమాత్రం లెక్కలోకి తీసుకోకుండా వ్యవహరిస్తోంది. కాంగ్రె స్ సింహాసనం తుప్పుపట్టింది. లౌక్యం ప్రదర్శించకపోతే కొట్టుకుపోతుంది.
 - విశ్వేశ్వర రెడ్డి(వైఎస్సార్ సీపీ కేంద్ర
 కార్యనిర్వాహక సభ్యుడు)
 
 రాహుల్‌ను ప్రధానిని చేసేందుకే
 రాహుల్‌ను ప్రధానిని చేసేందుకు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజనకు తెరతీసింది. విభజనతో సీమాంధ్ర వాసులు తీవ్రంగా నష్టపోతారు. తెలంగాణ విభజనకు మద్దతుగా లేఖ ఇచ్చి చంద్రబాబు నాయుడు తెలుగువారి ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టాడు. కాంగ్రెస్, టీడీపీల కుట్రలను తిప్పి కొట్టేందుకు వైఎస్సార్ సీపీ ముందుండి పోరాడుతోంది. ప్రజలంతా పార్టీకి వెన్నంటి ఉన్నారు.
 - బి. గురునాథ రెడ్డి,
 
 ఎమ్మెల్యే, అనంతపురం.
 విభజన జరిగితే జిల్లాకు నష్టం
 రాయలతెలంగాణ అని ఒకరు, రాష్ట్రాన్ని మూడు ముక్కలు చేయాలని మరొకరు, ఇలా ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. మహానేత వైఎస్సార్ చలువతో హంద్రీనీవా ప్రాజెక్టు ద్వారా శ్రీశైలం నుంచి మిగులు నీరు అనంతపురం జిల్లాకు వస్తోంది. విభజన జరిగితే తెలంగాణ ప్రాంతంలో ఆనకట్టలు వెలసి చుక్కనీరు కూడా కిందకు వదిలే ప్రసక్తి ఉండదు.
 -శంకర నారాయణ, వైఎస్సార్ సీపీ జిల్లా కన్వీనర్
 
 రాజకీయ లబ్ధి కోసమే వేర్పాటు వాదం
 వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిని రాజకీయంగా ఎదుర్కోలేకే వేర్పాటు వాదాన్ని తెరపైకి తెచ్చారు. ఎలాగైనా జననేతను అణగదొక్కాలన్న కుట్రతో రాష్ట్ర విభజనకు కేంద్రం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది.  రాజకీయ లబ్ది కోసం రాష్ట్ర వేర్పాటుకు తెరతీశారు
 - చవ్వా రాజశేఖర్ రెడ్డి,
 వైఎస్సార్ సీపీ నేత,
 
 ఏకైక పార్టీ వైఎస్సార్ సీపీ
 కాంగ్రెస్, టీడీపీలు తెలంగాణ ప్రకటనపై ప్రజల ముందు నాటకాలాడుతున్నాయి. ఆంటోని కమిటీ, సోనియా, దిగ్విజయ్‌లకు విభజన వద్దని చెబుతాం అని అంటున్నాయి. అక్కడికి వెళ్లగానే నోరెత్తకుండా ఊరుకుంటున్నాయి.  సమైక్య రాష్ట్రం కోసం పోరాడుతున్న ఏకైక పార్టీ వైఎస్సార్ సీపీనే.
  - బోయ సుశీలమ్మ,
 
 మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు
 స్వార్థమే విభజనకు కారణం
 విభజన ప్రకటనతో సోనియా రాష్ట్ర ప్రజల్లో చిచ్చు పెట్టింది. ఏళ్ల తరబడి కలిసున్న రాష్ట్రాన్ని ఏవిధంగా వేరు చేస్తారు. మహానేత వైఎస్సార్ తెలంగాణ వాదాన్ని మొదటి నుంచి అడ్డుకున్నారు.
 - ఎర్రిస్వామి రెడ్డి, వైఎస్సార్ సీపీ జిల్లా నేత
 
 అన్ని రంగాలకు దెబ్బే..
 రాష్ట్రం విభజన ప్రభావం అన్ని రంగాలపై ఉంటుంది. ప్రధానంగా వైద్య రంగం నిర్వీర్యం అవుతుంది. ఎన్నో కార్యకలాపాలు స్తంభించిపోతాయ్. కేంద్రం ఇకనైనా విభజన యత్నం విరమించాలి.  సమైక్యాంధ్రప్రదేశ్‌కు మహానేత వైఎస్సార్ కుటుంబం రాజీలేని పోరాటం చేస్తోంది.  
 - డాక్టర్ హరికృష్ణ,
 వైఎస్సార్ సీపీ నాయకుడు, పుట్టపర్తి
 
 కాంగ్రెస్ అడ్రస్ లేకుండా పోతుంది
 ప్రజా వ్యతిరేక విధానాలతో వ్యవహరిస్తున్న కాంగ్రెస్ పార్టీ వైఖరితో  కోట్లాది మంది ప్రజలకు సమస్యలు ఎదురవుతునున్నాయి. రాష్ట్ర విభజన ప్రకటనతో సీమాంధ్ర ప్రజలు ఆగ్రహావేశాలతో ఉడికిపోతున్నారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ అడ్రస్ లేకుండా పోతుంది.
  - బోరంపల్లి ఆంజనేయులు,
 బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement