వాడివేడిగా బడ్జెట్ పార్లమెంట్!
కుదిపేయనున్న జేఎన్‌యూ, రోహిత్ ఆత్మహత్య అంశాలు
నేడు అఖిలపక్షంతో వెంకయ్య భేటీ
సాక్షి, న్యూఢిల్లీ: మంగళవారం ప్రారంభం కానున్న పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు వాడివేడిగా జరగనున్నాయి. జేఎన్‌యూ వివాదం, హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో రీసెర్చ్ స్కాలర్ రోహిత్ వేముల ఆత్మహత్య, పఠాన్‌కోట్‌పై ఉగ్రదాడి తదితర అంశాలు పార్లమెంటును కుదిపేయనున్నాయి. జీఎస్‌టీతోపాటు ఇతర కీలక అంశాలపై అధికార, విపక్షాల వాగ్యుద్ధంతో గత రెండు సమావేశాలు పూర్తిగా తుడిచిపెట్టుకొనిపోయిన సంగతి తెలిసిందే. దీంతో సమావేశాలను సజావుగా నిర్వహించేందుకు ప్రధాని మోదీ ఇప్పటికే విపక్షాల నాయకులతో సమావేశమవగా, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ఎం.వెంకయ్యనాయుడు సోమవారం అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించనున్నారు.
అలాగే లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ కూడా అన్ని పార్టీలతో సభలో సంపద్రింపులు జరపనున్నారు. ఈ బడ్జెట్ సమావేశాల్లో ఎలాంటి వ్యూహాన్ని అనుసరించాలనే అంశంపై కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ సోమవారం వర్కింగ్ కమిటీ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. జేఎన్‌యూ వివాదంపైన అయినా లేదా విపక్షాలు కోరిన ఏ అంశాలపైనా అయినా పార్లమెంటులో చర్చించేందుకు సిద్ధమని ప్రభుత్వం స్పష్టంచేసింది. సమావేశాలను పూర్తిస్థాయిలో నిర్వహిస్తామని, ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో సమావేశాలు జరిగే రోజుల్లో కోత వేయబోమని విపక్షాలకు వెంకయ్య చెప్పారు.
ఈ సమావేశాల్లో మొత్తం 74 అంశాలను పార్లమెంటు ముందుకు తేనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. వీటిలో 62 లెజిస్లేటివ్ కాగా, 12 ఆర్థికపరమైనవి. వస్తుసేవల పన్ను (జీఎస్‌టీ) బిల్లుతో సహా 26 బిల్లులకు పార్లమెంట్ ఆమోదం లభించేలా ప్రభుత్వం భారీ ఎజెండాతో సిద్ధమైంది. ఏపీ పునర్విభజన సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పించాలంటూ ప్రభుత్వంపై ఒత్తిడి తేవడానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సిద్ధమైంది. అదేవిధంగా విభజన చట్టాన్ని పూర్తిగా అమలుచేయడంతోపాటు ఏపీకి సంబంధించిన పలు అంశాలను ఆ పార్టీ ఎంపీలు పార్లమెంట్‌లో లేవదీయనున్నారు. ఏపీకి ప్రత్యేక హోదా కల్పించే పక్షంలో తెలంగాణకూ ప్రత్యేక హోదా ఇవ్వాలని పార్లమెంట్‌లో కోరతామని టీఆర్‌ఎస్ ఇప్పటికే స్పష్టం చేసింది. పార్లమెంట్ ఉభయ సభలనుద్దేశించి మంగళవారం రాష్ట్రపతి ప్రసంగిస్తారు. కాగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం దేశ ఆర్థిక స్థితిగతుల్ని వివరించే ఆర్థిక సర్వేను ఈ నెల 26న పార్లమెంటుకు సమర్పిస్తారు. 25న రైల్వే బడ్జెట్‌ను, 29న సాధారణ బడ్జెట్‌ను ప్రవేశపెడతారు.