సోనియా, బాబు ఇళ్ల ఎదుట ధర్నా చేయండి: గడికోట శ్రీకాంత్‌రెడ్డి | Protest to Sonia Gandhi, Chandrababu: Gadikota Srikanth Reddy | Sakshi
Sakshi News home page

సోనియా, బాబు ఇళ్ల ఎదుట ధర్నా చేయండి: గడికోట శ్రీకాంత్‌రెడ్డి

Published Fri, Aug 23 2013 1:05 AM | Last Updated on Mon, Oct 22 2018 9:16 PM

సోనియా, బాబు ఇళ్ల ఎదుట ధర్నా చేయండి: గడికోట శ్రీకాంత్‌రెడ్డి - Sakshi

సోనియా, బాబు ఇళ్ల ఎదుట ధర్నా చేయండి: గడికోట శ్రీకాంత్‌రెడ్డి

 కాంగ్రెస్, టీడీపీ ఎంపీలకు గడికోట శ్రీకాంత్‌రెడ్డి సూచన
తెలుగు ప్రజలను రోడ్డున పడేసింది వారిద్దరే
పార్లమెంట్‌లో డ్రామాలను రాష్ట్ర ప్రజలు విశ్వసించరు
సినిమాలను తలపిస్తున్న కాంగ్రెస్, టీడీపీ ఎంపీల డ్రామాలు
ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఒక లీకు వీరుడు

 
సాక్షి, హైదరాబాద్: తెలుగు ప్రజలను రోడ్డున పడేసి రాష్ట్రాన్ని అన్ని విధాలుగా భ్రష్టుపట్టించిన సోనియాగాంధీ, చంద్రబాబు ఇళ్ల ముందు నిరసనలు, ధర్నాలు చేయకుండా కాంగ్రెస్, టీడీపీ ఎంపీలు ఎందుకు డ్రామాలాడుతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి ప్రశ్నించారు. వారికి చిత్తశుద్ధి ఉంటే పార్లమెంట్‌లో చేస్తున్న డ్రామాలను కట్టిబెట్టి సోనియా, చంద్రబాబు ఇళ్ల ఎదుట ధర్నాలు చేయాలని సూచించారు. విభజనకు అసలు కారకులైన వారిద్దరి ఇళ్ల ముందు నిరసనలు తెలపకుండా.. ఎన్ని డ్రామాలు చేసినా రాష్ట్ర ప్రజలు విశ్వసించరని కాంగ్రెస్, టీడీపీ ఎంపీలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో గురువారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పార్లమెంట్‌లో కాంగ్రెస్, టీడీపీలకు చెందిన ఎంపీలు చేస్తున్న డ్రామాలు సినిమాను తలపిస్తున్నాయని శ్రీకాంత్‌రెడ్డి విమర్శించారు.
 
 చంద్రబాబు వైఖరి చాలా విచిత్రంగా ఉందని, ఒకవైపు తన లేఖ వల్లే తెలంగాణ ప్రకటన వచ్చిందని చెబుతూ.. మరోవైపు ఎంపీల చేత పార్లమెంట్‌లో డ్రామాలు ఆడిస్తున్నారని దుయ్యబట్టారు. ‘నెల రోజులుగా ఢిల్లీ నుంచి అనేక లీకులు ఇస్తూ.. మీడియాలో అనేక కథనాలు వెలువడుతున్నా.. ప్రధాన ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాల్సి ఉన్నా తనకు పట్టనట్లు మౌనం దాల్చారు. నిత్యం కేంద్రమంత్రి చిదంబరంతో ఫోన్‌లో సంప్రదింపులు జరుపుతూ కూడా సీమాంధ్రకు జరిగే అన్యాయాన్ని ప్రస్తావించలేదు. విభజన ప్రకటన వెలువడిన తర్వాత మాత్రం ప్రెస్‌మీట్ పెట్టి రాజధాని కోసం రూ. 4 లక్షల కోట్లు ఇవ్వాలంటారు. ఏపీ ఎన్జీవోలు వెళ్లినప్పుడు బ్లాంక్ చెక్ ఇచ్చాను దాన్ని వెనక్కి తీసుకోలేనంటారు. ఇప్పుడేమో పార్లమెంట్‌లో కొంతమంది చేత డ్రామాలు ఆడిస్తున్నారు’ అని దుయ్యబట్టారు.
 
 ఆయనొక లీకు వీరుడు!
 గతంలో మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ సీడబ్ల్యూసీ సమావేశంలో రాష్ట్రాన్ని విభజించాలని భావించినా, అప్పుడు ఆ నిర్ణయాన్ని గట్టిగా అడ్డుకున్నారని శ్రీకాంత్ చెప్పారు. ప్రస్తుత సీఎం కిరణ్ తానే గొప్ప సమైక్యవాదిగా బిల్డప్ ఇస్తూ.. ఢిల్లీకి యుద్ధవీరునిగా వెళ్లి, లీకుల వీరుడిగా తిరిగొస్తున్నారని ఎద్దేవా చేశారు. సోనియాను నిలదీశానంటూ మీడియాకు లీకులిచ్చుకోవడం తప్పితే, అక్కడ తానేం మాట్లాడాననేది బహిరంగంగా ఒక్కమాట చెప్పడం ఆయనకు చేతకాదన్నారు. అన్ని వర్గాల ప్రజలు రోడ్డు మీదకొచ్చి ఉద్యమాలు చేస్తున్నా.. రాష్ట్రాన్ని కాపాడేందుకు ఉద్యోగులు వారి జీవితాలను త్యాగం చేసేందుకు ముందుకొస్తున్నా కాంగ్రెస్, టీడీపీ నేతలు పదవులు పట్టుకొని వేలాడటం సిగ్గుచేటన్నారు. ఇప్పటికైనా తెలుగువారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టాలనుకుంటే సీఎం కిరణ్, ప్రతిపక్షనేత చంద్రబాబు ఇద్దరూ వారి పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అదే విధంగా చంద్రబాబు కేంద్రానికి బ్లాంక్ చెక్ మాదిరిగా ఇచ్చిన లేఖను ఉపసంహరించుకోవాలని, లేకుంటే ఆయన యాత్రకు ‘ఆత్మవంచనయాత్ర’గా పేరు పెట్టాలన్నారు.
 
 వారి చిత్తశుద్ధి ఏంటో రుజువైంది..
 కాంగ్రెస్, టీడీపీలకు చెందిన ఎంపీల రాజీనామాల్లోని డొల్లతనం మరోసారి బయటపడిందని శ్రీకాంత్ పేర్కొన్నారు. నిబంధనల మేరకు ఫార్మాట్‌లో రాజీనామాలు చేయకుండా ఎవర్ని మభ్యపెట్టాలనుకుంటున్నారని ప్రశ్నించారు. రాజ్యసభలో హరికృష్ణ స్పీకర్ ఫార్మాట్‌లో ఉదయం రాజీనామా చేస్తే సాయంత్రానికి ఆమోదం పొందిందని, మిగతా సభ్యులవి ఎందుకు జరగలేదని ప్రశ్నించారు. టీడీపీ ఎంపీలు సీఎం రమేష్, సుజనాచౌదరి పార్లమెంట్‌లో హాలీవుడ్ స్థాయిలో నటిస్తున్నారన్నారు. వారి రాజీనామాలు దొంగవని ఆ పార్టీకి చెందిన నేతలే బయటకొచ్చి చెబుతున్నారని తెలిపారు.
 
 మా రాజీనామాలు ఆమోదించండి..
 వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలమంతా నిబంధనల మేరకు స్పీకర్ ఫార్మాట్‌లోనే రాజీనామాలు చేశామని, వాటిని ఆమోదించాలని స్పీకర్ నాదెండ్ల మనోహర్‌ను అభ్యర్థిస్తున్నామన్నారు. ‘స్పీకర్ ఎక్కడకు, ఎప్పుడు రమ్మన్నా ఒక్క రోజులో వారి ముందుంటాం. దయచేసి మా రాజీనామాలు ఆమోదించండి’ అని అన్నారు.
 
 తెలుగు ప్రజలకిచ్చే బహుమతి ఇదేనా?
 40 ఏళ్లుగా కాంగ్రెస్‌కు తెలుగు ప్రజలు అండగా నిలిస్తే వారికి ఇచ్చే బహుమతి.. రెండు ప్రాంతాల మధ్య విద్వేషాలు రగిల్చి, ప్రజల మధ్య చిచ్చుపెట్టడమా? అని శ్రీకాంత్‌రెడ్డి ప్రశ్నించారు. ‘దేశవ్యాప్తంగా కాంగ్రెస్ తుడిచి పెట్టుకుపోయినా తెలుగు ప్రజలు మద్దతుగా నిలిచారు. 2004, 2009 ఎన్నికల్లో రెండు సార్లు కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి ముఖ్యకారణం తెలుగు ప్రజలే. ఇక్కడి నుంచే 33 మంది ఎంపీలను పంపినందుకు మీరిచ్చే బహుమానం ప్రజల మధ్య చిచ్చుపెట్టి, రాష్ట్రాన్ని అగ్నిగుండంగా మార్చడమా? ఇలా చేయడం మీకు సబబేనా?’ అని ప్రశ్నించారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement