కర్నూలు, న్యూస్‌లైన్: ఎన్నికలు ఏవైనా.. తీర్పు ఏకపక్షమే. మార్పుతో పాటు యువ నాయకత్వాన్నే తాము కోరుకుంటున్నామని ప్రజలు స్పష్టంగా తెలియజేస్తున్నారు. మున్సిపల్.. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో ఓటర్లు వైఎస్‌ఆర్‌సీపీకే పట్టం కట్టినట్లు సర్వేలు వెల్లడిస్తున్నాయి. ఈ ఉత్సాహంతో సార్వత్రిక ఎన్నికలకు పార్టీ అభ్యర్థులు సర్వసన్నద్ధమవుతున్నారు. ఇదే సమయంలో పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జిల్లాలోని రెండు పార్లమెంట్ స్థానాలకు.. 14 అసెంబ్లీ నియోజకవర్గాలకు సోమవారం ఒకే విడతలో అభ్యర్థులను ప్రకటించడం విశేషం.
అదే ప్రత్యర్థి పార్టీల విషయానికొస్తే టికెట్ల విషయంలో స్పష్టత రాకపోవడం గందరగోళానికి తావిస్తోంది. ఎవరికి టికెట్ వస్తుందో.. ఎవరి రాజకీయ భవిష్యత్ బలి అవుతుందో తెలియని సందిగ్ధం నెలకొంది. విభజనకు కారణమైన కాంగ్రెస్ నేతలను పార్టీలోకి ఆహ్వానించడం ద్వారా పార్టీ బలం పెరిగిందని చాటుకునేందుకు చేసిన ప్రయత్నం టికెట్ల విషయానికొచ్చే సరికి బెడిసికొడుతోంది. నామినేషన్ల దాఖలుకు మరో నాలుగు రోజుల సమయం మాత్రమే ఉండటం.. కొన్ని స్థానాలకు అభ్యర్థులు ఎవరనే విషయంలో సస్పెన్స్ కొనసాగుతుండటంతో కాంగ్రెస్, టీడీపీల్లోని ఆశావహుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి.
కాంగ్రెస్ పార్టీ పాణ్యం, ఎమ్మిగనూరు, మంత్రాలయం అసెంబ్లీ స్థానాలు.. టీడీపీ కర్నూలు ఎంపీ స్థానంతో పాటు ఎమ్మిగనూరు, మంత్రాలయం అసెంబ్లీ స్థానాల విషయంలో ఇప్పటికీ స్పష్టతనివ్వలేకపోయాయి. కర్నూలు ఎంపీ టికెట్ కోసం కేఈ ప్రభాకర్ తన మార్కు రాజకీయం చేస్తున్నారు. ఇదే టికెట్‌ను ఆశిస్తున్న వాల్మీకి సామాజిక వర్గానికి చెందిన డాక్టర్ పార్థసారథిపై అధినేత చంద్రబాబు సమక్షంలోనే ప్రభాకర్ వర్గీయులు దాడి చేయడాన్ని ఆ వర్గీయులు జీర్ణించుకోలేకపోతున్నారు. పార్థసారథికే టికెట్ ఇవ్వాలంటూ వాల్మీకి రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో వాల్మీకులు ఆందోళనలు కొనసాగిస్తున్న నేపథ్యంలో బాబు ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. ఈ పరిస్థితుల్లో ఇరువురినీ కాకుండా భారీ ప్యాకేజీతో మరో అభ్యర్థిని తెరపైకి తీసుకొస్తున్నట్లు చర్చ జరుగుతోంది. పాణ్యం టీడీపీ అభ్యర్థిగా ఏరాసు ప్రతాప్‌రెడ్డి పేరు ఖరారు కావడంతో ఇప్పటికే బాబు హామీతో ప్రచారం చేసుకుంటున్న కేజే రెడ్డి నిరాశకు లోనయ్యారు. తన ఆశలపై నీళ్లు చల్లిన నేపథ్యంలో ఆయన పునరాలోచనలో పడ్డారు.
మొదటి విడతలో ఆదోని, ఆలూరు, బనగానపల్లె, నంద్యాల లోక్‌సభ అభ్యర్థులను ప్రకటించగా.. రెండో విడతలో ఆళ్లగడ్డకు గంగుల ప్రభాకర్‌రెడ్డి, శ్రీశైలానికి శిల్పా చక్రపాణిరెడ్డి, కర్నూలుకు టీజీ వెంకటేష్, నందికొట్కూరుకు లబ్బి వెంకటస్వామి, నంద్యాలకు శిల్పా మోహన్‌రెడ్డి, డోన్‌కు కేఈ ప్రతాప్, పత్తికొండకు కేఈ క్రిష్ణమూర్తి పేర్లు ఖరారయ్యాయి. కోడుమూరును బీజేపీకి కేటాయిస్తున్నట్లు సూచనప్రాయంగా వెల్లడి కావడంతో ఆ నియోజకవర్గంలోని మూడు మండలాల పార్టీ అధ్యక్షులు, నాయకులు పార్టీకి రాంరాం చెప్పేశారు. ఫలితంగా ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థి మణిగాంధీకి ఎదురుండదని తెలుస్తోంది. ఇకపోతే కాంగ్రెస్ పార్టీలో అధిక శాతం కొత్త ముఖాలే కావడంతో సార్వత్రిక ఎన్నికల్లో పోటీ నామమాత్రం కానుంది.
రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా నాలుగు మాసాల పాటు విరామం లేకుండా వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థులు సాగించిన పోరాటం అభ్యర్థుల విజయంలో కీలకపాత్ర పోషించనుంది. ప్రస్తుతం టీడీపీలో ఉన్న అభ్యర్థుల్లో అధిక శాతం విభజనకు కారణమైన కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన వారే కావడంతో ప్రజలు వారిని చీకొట్టక మానరని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కర్నూలులో ఎస్వీ మోహన్‌రెడ్డి సామాజిక సేవా కార్యక్రమాల ద్వారా ప్రజలకు చేరువయ్యారు. కర్నూలు మాజీ మండలాధ్యక్షుడు విష్ణువర్ధన్‌రెడ్డి వైఎస్సార్సీపీలో చేరడం వల్ల కర్నూలు, కోడుమూరు, పాణ్యం నియోజకవర్గ అభ్యర్థుల విజయం మరింత సులువవుతోంది.
కర్నూలు, నంద్యాల, ఆత్మకూరు, ఆదోని నియోజకవర్గాల్లో ముస్లిం మైనార్టీల జనాభా అధికంగా ఉంది. బీజేపీ, టీడీపీల మధ్య పొత్తు ఆ నియోజకవర్గాల తెలుగు తమ్ముళ్ల రాజకీయ భవితవ్యంపై పెనుప్రభావం చూపనుంది. నంద్యాల ఎంపీ అభ్యర్థి ఫరూక్, ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా వర్గీయుల మధ్య విభేదాల కుంపటి రాజుకుంటోంది. వైఎస్సార్‌సీపీ అభ్యర్థికి ఈ పరిస్థితి అనుకూలం కానుంది. దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డి హయాంలో ముస్లిం మైనార్టీలకు 4 శాతం రిజర్వేషన్ కల్పించడంతో వచ్చే ఎన్నికల్లో ఆ వర్గీయులు కృతజ్ఞత చాటుకోవడంలో భాగంగా పార్టీ అభ్యర్థులను అత్యధిక స్థానాల్లో గెలిపించాలని నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.
వైఎస్‌ఆర్‌సీపీలో కదనోత్సాహం
Published Tue, Apr 15 2014 2:08 AM | Last Updated on Wed, Jul 25 2018 4:09 PM
Advertisement
Advertisement