భారీ సంఖ్యలో ఢిల్లీ చేరిన సమైక్యవాదులు
న్యూఢిల్లీ : తెలుగుజాతిని విచ్ఛిన్నం చేసేందుకు కేంద్రం పన్నుతున్న కుయుక్తులను ఎండగట్టేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోమవారం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఢిల్లీలో సమైక్యనాదం వినిపించనుంది. జంతర్‌మంతర్ వద్ద తలపెట్టిన ఈ సమైక్య ధర్నాకు రాష్ట్రం నుంచి భారీగా సమైక్యవాదులు తరలి వచ్చారు. రెండు ప్రత్యేక రైళ్లలో ఢిల్లీ చేరుకున్న సమైక్యవాదులు.. రాష్ట్ర విభజనను ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించేది లేదని స్పష్టం చేశారు.
ఢిల్లీ ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయడం ద్వారా కేంద్రానికి తెలుగువాడి సత్తా చూపిస్తామని పశ్చిమ గోదావరి జిల్లా వైఎస్సార్ సిపి నేతలు తెలిపారు. తెలంగాణ బిల్లుపై కేంద్రం దూకుడుగా వ్యవహరిస్తున్న తరుణంలో సీమాంధ్ర కేంద్రమంత్రులు రాజీనామా చేస్తే యుపిఏ సర్కారు కుప్పకూలుతుందన్నారు. ముఖ్యమంత్రి నిజానికి విభజనవాది అని...కాంగ్రెస్ హైకమాండ్ చెప్పినట్లల్లా ఆడుతూ విభజనకు సహకరిస్తున్నారని ధ్వజమెత్తారు. కిరణ్ ఇపుడు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడం వల్ల ఎటువంటి ఉపయోగం లేదన్నారు. కాగా వైఎస్ఆర్ ధర్నాకు వివిధ సంఘాలు మద్దతు ప్రకటించాయి.