ఇక ఢిల్లీలోనూ 5కేజీల సిలిండర్
Published Tue, Jan 21 2014 2:54 AM | Last Updated on Sat, Sep 2 2017 2:49 AM
న్యూఢిల్లీ: నగరవాసులకు నేటినుంచి 5 కేజీల సిలిండర్లు అందుబాటులోకి రానున్నాయి. చమురుశాఖ మంత్రి ఎం వీరప్ప మొయిలీ వీటిని నేడు లాంఛనంగా ఆవిష్కరించనున్నారు. దీంతో నగరంలోని అన్ని పెట్రోలు పంపుల్లో మార్కెట్ ధరకే ఈ 5 కేజీల సిలిండర్లు అందుబాటులోకి రానున్నాయి. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో వీటిని అందుబాటులోకి తీసుకురాగా అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఢిల్లీ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలను మినహాయించారు. కాగా నేటి నుంచి ఢిల్లీవాసులకు కూడా ఇవి అందుబాటులోకి రానున్నాయి. వీటిని రూ.543కు పెట్రోలు పంపుల్లో విక్రయించనున్నట్లు సంబంధిత అధికారి ఒకరు
తెలిపారు. నగరంలో 14.2 కిలోల సబ్సిడీ సిలిండర్‌లను రూ.414కే అందజేస్తున్న విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా ప్రభుత్వరంగ సంస్థలకు చెందిన 13,088 మంది ఎల్‌పీజీ డిస్ట్రిబ్యూటర్లు/డీలర్లు మాత్రమే ఇప్పటిదాకా వంటగ్యాస్‌ను విక్రయిస్తున్నారు. ఇకపై దేశవ్యాప్తంగా ఉన్న 50,392 పెట్రోలు పంపుల్లో కూడా వంటగ్యాస్ విక్రయిస్తారు. మొదట ప్రయోగాత్మకంగా ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నై, బెంగళూరులలోని పెట్రోలు పంపుల్లో 5 కేజీల సిలిండర్లను కొన్ని చమురు సంస్థలు విక్రయించాయి. సఫలీకృతం కావడంతో దేశవ్యాప్తంగా విక్రయించుకునేందుకు వాటికి అనుమతి లభించింది. ఇలా 5 కేజీల సిలిండర్లు అందుబాటులోకి రావడం వలస వచ్చినవారికి, చదువుకునే విద్యార్థులకు ఎంతో సౌకర్యంగా ఉంటుంది. అన్ని ఆధారాలు సమర్పించి గ్యాస్ కనెక్షన్‌ను పొందడం ఇలాంటి వారికి సాధ్యం కాదు. దీంతో వారికి ఈ ఐదు కేజీల సిలిండర్‌తో వంటచేసుకోవడం, పూటగడుపు కోవడం సులభమవుతుంది.
Advertisement
Advertisement