
మొయిలీతో విజయశాంతి భేటీ
సాక్షి, న్యూఢిల్లీ: టీఆర్‌ఎస్ నుంచి సస్పెన్షన్‌కు గురైన మెదక్ ఎంపీ విజయశాంతి మంగళవారం నాడిక్కడ కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి, ఆంటోనీ కమిటీ సభ్యుడు వీరప్ప మొయిలీతో భేటీ అయ్యారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై ఆమె చర్చించినట్లు సమాచారం. తెలంగాణ నిర్ణయంపై సీమాంధ్రవాసుల నుండి వ్యక్తమౌతున్న అభ్యంతరాలు, విభజన నేపథ్యంలో తలెత్తే సమస్యలను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించి వచ్చే సార్వత్రిక ఎన్నికలకు ముందుగానే అధికారిక విభజన ప్రక్రియ పూర్తయ్యేలా చూడాలని కోరినట్లు తెలిసింది. తాను టీఆర్‌ఎస్ నుండి బయటకు రావడానికి దారితీసిన పరిస్థితులను కూడా ఆమె వివరించారు.
టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖర్‌రావుతో విభేదాల కారణంగా ఆ పార్టీకి దూరమైన విజయశాంతి కాంగ్రెస్‌లో చేరేందుకు రంగం దాదాపు సిద్ధమైంది. ఇలావుండగా టీఆర్‌ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యులుగా ఉంటూ ఇటీవల ఆ పార్టీకి రాజీనామా చేసిన ఇద్దరు మాజీ మంత్రులు డాక్టర్ జి.విజయరామారావు, ఎ.చంద్రశేఖర్‌లతో పాటు ఇటీవల ఆ పార్టీ నుంచి సస్పెన్షన్‌కు గురైన మరో నేత రఘునందన్‌రావు మంగళవారం నాడిక్కడ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తున్నందుకు కృతజ్ఞతగానే తాము ఆ పార్టీలో చేరామని వారు చెప్పారు. తెలంగాణలో పార్టీ పటిష్టతకు కృషి చేయాలని దిగ్విజయ్ వారికి సూచించారు.
టీడీపీ కరపత్రాల పంపిణీకి బ్రేక్: రాజకీయ ప్రయోజనాలను ఆశించే కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించిందని, రాష్ట్ర ప్రజల జీవితాలతో చెలగాటమాడుతోందని పేర్కొంటూ తెలుగుదేశం సీమాంధ్ర ప్రాంత ఎంపీలు ముద్రించిన కరపత్రాల పంపిణీని పార్లమెంట్ భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు. తెలంగాణ నిర్ణయంతో ఎదురయ్యే సమస్యలపై రోజుకో బులెటిన్ విడుదల చేసి ఉభయ సభల సభ్యులకు అందజేయాలని భావించిన టీడీపీ నేతల ప్రయత్నానికి సోమవారం ఎలాంటి ఆటంకం ఎదురుకాలేదు. అయితే మంగళవారం సెంట్రల్ హాల్‌లో కరపత్రాలు పంపిణీ చేస్తున్న టీడీపీపీ కార్యాలయ సిబ్బందిని ఉన్నతాధికారుల ఆదేశాల నేపథ్యంలో భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు. దీంతో ఆ పార్టీ ఎంపీలే స్వయంగా ఇంగ్లిష్‌లో ముద్రించిన కరపత్రాలను సభ్యులకు అందజేశారు.