![IAF chief lying over Rafale deal, says Veerappa Moily - Sakshi](/styles/webp/s3/article_images/2018/12/21/20HYD1-605052.jpg.webp?itok=fKNQ8nUF)
సాక్షి, హైదరాబాద్: రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు వ్యవహారం దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభకోణమని కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి వీరప్ప మొయిలీ ఆరోపించారు. రఫేల్ విమానాల కొనుగోలు కోసం హిందూస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ (హెచ్‌ఏఎల్)ను కాదని ఫ్రాన్స్‌లోని కంపెనీతో ఎందుకు ఒప్పందం కుదుర్చుకున్నారని ప్రశ్నించారు. అనిల్ అంబానీ కంపెనీకి లబ్ధి చేకూర్చేందుకే రూ. 520 కోట్లుగా ఉన్న రఫేల్ యుద్ధవిమానాల కొనుగోలు అంచనాలను రూ. 1,600 కోట్లకు పెంచారని మండిపడ్డారు. గురువారం గాంధీ భవన్‌లో కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొçన్నం ప్రభాకర్, కోశాధికారి గూడూరు నారాయణరెడ్డి, ముఖ్య అధికార ప్రతినిధి మల్లు రవితో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు.
దేశ భద్రతపై ప్రధాని మోదీ రాజీపడి, భద్రతను ప్రమాదంలోకి నెట్టారని విమర్శించారు. ఈ ఒప్పందంపై చాలా అనుమానాలున్నాయని, రోజుకో కొత్త ప్రశ్న తలెత్తుతుందన్నా రు. ఈ వ్యవహారంలో వాస్తవాలు వెలుగులోకి రావాలంటే జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ)తో విచారణ చేయించాలన్నారు. మేకిన్ ఇండియా గురించి చెప్పే మోదీ ఈ ఒప్పందం ఎలా చేసుకున్నారని ప్రశ్నించారు. ఈ విషయంలో కేంద్రం తప్పుడు సమాచారంతో సుప్రీంకో ర్టును సైతం తప్పుదోవ పట్టించి, కోర్టు విశ్వసనీయతను దెబ్బతీసిందని విమర్శించారు. కాగ్ నివేదికను పీఏసీకే సమర్పించలేదని, అలాంటి నివేదిక ఏదీ లేకుండానే సుప్రీంకోర్టు తన తీర్పును వెలువరించిందన్నారు. దీనిపై జేపీసీ వేయాలని డిమాండ్ చేస్తున్నా, ప్రధాని ఎందుకు వణికిపోతున్నారో సమాధానం చెప్పాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment