
పదవుల పందేరం
కార్పొరేషన్ బోర్డుల అధ్యక్ష, సభ్యుల నియామకానికి కసరత్తు
ఆశావహులు పదివేలకు పైగా
900 మందికి స్థానం
నేడు అధికారిక ప్రకటన వెలువడే అవకాశం
బెంగళూరు : రాష్ట్రంలోని కార్పొరేషన్ బోర్డుల అధ్యక్ష, సభ్యుల స్థానాలను భర్తీ చేసేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమైంది. కార్పొరేషన్ బోర్డుల అధ్యక్షులు, సభ్యుల నియామకానికి సంబంధించిన అధికారిక ప్రకటన మంగళవారం వెలువడనున్నట్లు సమాచారం. కార్పొరేషన్ బోర్డు పదవులకు సంబంధించి అధ్యక్షులు, సభ్యులుగా 900 మందిని నియమించే అవకాశాలుండగా, ఈ పదవుల కోసం దరఖాస్తు చేసుకున్న వారి సంఖ్య మాత్రం 10వేల మందికి పైగా కావడం గమనార్హం. ఇక దరఖాస్తు చేసుకున్న వారిలో 900 మందిని ఎంపిక చేసేందుకు గాను ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, కేపీసీసీ అధ్యక్షుడు డాక్టర్ జి.పరమేశ్వర్‌లు ఇంతకు ముందు చర్చలు జరిపారు. అయితే తుది జాబితాను సిద్ధం చేయాల్సిన తరుణంలో దళిత ముఖ్యమంత్రి డిమాండ్ తెరపైకి వచ్చింది.
ఈ డిమాండ్ వెనక ఉన్నది కేపీసీసీ అధ్యక్షుడు డాక్టర్ జి.పరమేశ్వర్ అన్న వార్తలు రావడంతో సిద్ధు, పరమేశ్వర్‌ల మధ్య సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. దీంతో మరోసారి కార్పొరేషన్ బోర్డుల అధ్యక్ష, సభ్యుల భర్తీ వాయిదా పడవచ్చనే వార్తలు వచ్చాయి. ఇక కార్పొరేషన్ బోర్డులకు అధ్యక్ష, సభ్యుల నియామకం ఎప్పటి కప్పుడు వాయిదా పడుతూ వస్తుండడంతో క్షేత్ర స్థాయి అభిృద్ధి పూర్తిగా కుంటుపడిందనే విమర్శలు ప్రభుత్వంపై వెల్లువెత్తాయి. అంతేకాక చాలా కాలంగా అధికారానికి దూరంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం రాష్ట్రంలో అధికార పగ్గాలు చేపట్టి ప్రభుత్వాన్ని నడుపుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పార్టీకోసం ఇన్నాళ్లు శ్రమించిన ఎంతో మంది క్షేత్రస్థాయి నాయకులు, కార్యకర్తలు కార్పొరేషన్ బోర్డుల అధ్యక్షులు, సభ్యుల నియామకంపై ఎన్నో ఆశలు పెట్టుకొని ఎదురుచూస్తున్నారు. అయితే ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, కేపీసీసీ అధ్యక్షుడు పరమేశ్వర్‌ల మధ్య నెలకొన్న విబేధాలతో ఈ నియామకాలు ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వస్తున్నాయి.
దీంతో సహనం నశించిన కొంతమంది నాయకులు పార్టీ హైకమాండ్‌కు ఈ విషయంపై ఫిర్యాదు చేసినట్లు సమాచారం. దీంతో తక్షణమే కార్పొరేషన్ బోర్డుల అధ్యక్ష, సభ్యుల స్థానాల భర్తీపై ృష్టి సారించాలని, కార్యకర్తల్లో మరింత అసంృప్తి చెలరేగకుండా జాగ్రత్త పడాలని హైకమాండ్ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో పాటు కేపీసీసీ అధ్యక్షుడు పరమేశ్వర్‌లను ఆదేశించింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నేతలైన ఎస్.ఎం.ృష్ణ, మల్లికార్జున ఖర్గే, వీరప్ప మొయిలీ, ఆస్కార్ ఫెర్నాండెజ్, బి.కె.హరిప్రసాద్‌ల సిఫార్సులు, సూచనలను సైతం పరిగణలోకి తీసుకొని తుది జాబితాను రూపొందించినట్లు సమాచారం. కాగా మొత్తం 900 మందితో కూడిన తుది జాబితా మంగళవారం వెలువడే అవకాశాలున్నాయని కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.