న్యూఢిల్లీ: కాలం చెల్లిన 90 సవరణ చట్టాల రద్దు విషయంలో కేంద్రం ముందడుగు వేసింది. కాంగ్రెస్, సీపీఎం వ్యతిరేకతల నడుమ సంబంధిత బిల్లుకు సోమవారం లోక్‌సభ ఆమోదం తెలిపింది. ఈ బిల్లును స్టాండింగ్ కమిటీకి పంపకపోవడం ద్వారా కమిటీ వ్యవస్థను కేంద్రం నిర్వీర్యం చేస్తోందని కాంగ్రెస్ ఎంపీ వీరప్పమొయిలీ, సీపీఎం సభ్యుడు సంపత్ విమర్శించారు. చాలా చట్టాలను పునర్నిర్మించుకోవాల్సిన అవసరం ఉందని, దీనిపై ప్రభుత్వం సమగ్ర సమీక్ష జరపాలని మొయిలీ సూచించారు. అయితే, ఈ బిల్లు కేవలం సవరించిన చట్టాల రద్దుకు ఉద్దేశించిందేనని, స్టాండింగ్ కమిటీకి పంపాల్సిన అవసరం లేదని న్యాయ మంత్రి సదానందగౌడ స్పష్టం చేశారు. అస్తిత్వం కోల్పోయిన మరో 700 చట్టాల రద్దు కోసం వేరొక బిల్లును కూడా తీసుకురానున్నట్లు వెల్లడించారు. తాజా బిల్లు ద్వారా రద్దు కానున్న చట్టాల్లో సుప్రీంకోర్టు (జడ్జీలసంఖ్య) సవరణ చట్టం-2008, వక్ఫ్ సవరణ చట్టం-2013, పార్లమెంటు సభ్యుల జీతాలు, పింఛను చట్టం-2010 ఉన్నాయి. ఈ బిల్లుపై లోక్‌సభచర్చలో తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ కల్యాణ్‌బెనర్జీ మాట్లాడుతుండగా మంత్రి రూడీ అడ్డుతగలడంతో వారి మధ్య వివాదానికి దారి తీసింది.
ఎస్సీల జాబితా సవరణ బిల్లుకు ఆమోదం
షెడ్యూల్డ్ కులాల జాబితాలోకి మరిన్ని కులాలను చేర్చేందుకు ఉద్దేశించిన సవరణ బిల్లుకు రాజ్యసభ సోమవారం ఆమోదం తెలిపింది. ఈ బిల్లు ఇంతకుముందే లోక్‌సభలోనూ గట్టెక్కింది. అలాగే, మూతబడిన ఎన్టీసీ టెక్స్‌టైల్ మిల్లుల పునరుద్దరణ బిల్లుకు కూడా రాజ్యసభ ఆమోదం లభించింది. మరోవైపు బొగ్గు గనుల జాతీయకరణ సవరణ బిల్లును కేంద్రం రాజ్యసభ నుంచి ఉపసంహరించుకుంది. 1993 తర్వాత చేసిన 204 బొగ్గు గనుల కేటాయింపులను సుప్రీంకోర్టు రద్దు చేయడంతో అందుకు అనుగుణంగా సవరణలు చేయాల్సి ఉండడంతో ప్రభుత్వం ఈ బిల్లును వెనక్కి తీసుకుంది.
సర్దుమణిగిన సాధ్వి వివాదం: మంత్రి సాధ్వి నిరంజన్ జ్యోతి వ్యాఖ్యలతో వారం రోజులుగా అట్టుడిగిన పెద్దల సభలో సోమవారం వివాదం సర్దుమణిగింది.
90 చట్టాల రద్దుకు లోక్‌సభ ఓకే
Published Tue, Dec 9 2014 1:46 AM | Last Updated on Sat, Mar 9 2019 3:08 PM
Advertisement
Advertisement