
ప్రతిపక్ష హోదా కోసం అడుక్కోవడం లేదు
న్యూఢిల్లీ : లోక్సభలో ప్రతిపక్ష హోదా కోసం తాము అడుక్కోవడం లేదని మాజీ కేంద్రమంత్రి, కాంగ్రెస్ ఎంపీ వీరప్ప మొయిలీ అన్నారు. లోక్సభలో బుధవారం సీబీఐ డైరెక్టర్ నియాయకంలో సవరణలపై చర్చ సందర్బంగా ప్రతిపక్ష పార్టీ గుర్తింపుపై ఆయన పైవిధంగా వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యంలో విధానాలు పాటించాలని, ప్రభుత్వం నియంతృత్వ ధోరణితో వ్యవహరిస్తోందని వీరప్ప మొయిలీ అన్నారు.
కాగా లోక్‌సభలో ప్రతిపక్ష హోదాపై కాంగ్రెస్, బీజేపీల మధ్య మాటల యుద్ధం కొనసాగింది. ప్రతిపక్ష హోదా ఇవ్వాలని డిమాండ్ చేసిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధనను లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ తిరస్కరించిన విషయం తెలిసింది. ప్రతిపక్ష హోదా కావాలంటే మొత్తం లోక్ సభ సీట్లలో పది శాతం సీట్లు ఉండాలి. అంటే లోక్ సభలో కనీసం 55 సీట్లు ఉండాలి. అయితే లోక్ సభలో కాంగ్రెస్కు 44 సీట్లు మాత్రమే ఉన్నాయి. దాంతో సభ నియమ నిబంధనల మేరకు కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వటం కుదరదని స్పీకర్ తేల్చి చెప్పారు.