'ఆ విప్లవానికి కాంగ్రెస్ పార్టీ బలైంది'
దేశ సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చవిచూసిన కాంగ్రెస్ పార్టీ పోస్ట్మార్టం చేసుకుంటుంది. అందులోభాగంగా ఆ పార్టీ సీనియర్ నేతలు, కేంద్ర మాజీ మంత్రులు ఒకొక్కరు తమ తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీని బతికించుకోవాలంటే సర్జరీ అనివార్యమని కేంద్ర మాజీ మంత్రి వీరప్ప మొయిలీ అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ పార్టీని సోషల్ మీడియా, అర్బన్ ఓటర్లు ముంచేశారని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ట్విట్టర్, సామాజిక అనుసంధాన వేదిక వంటివి ఉపయోగించి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు. ఓ విధంగా చెప్పాలంటే ఐటీ విప్లవాన్ని తీసుకువచ్చిన కాంగ్రెస్ పార్టీ... ఆ విప్లవానికే బలైందన్ని వ్యాఖ్యానించారు.
సీడబ్ల్యూసీకి ఎన్నికలు నిర్వహించాలని ఆయన అభిప్రాయపడ్డారు. బీజేపీ గెలుపుకోసం ఆర్ఎస్ఎస్ కేడర్ దేశవ్యాప్తంగా 24 గంటలు పని చేసిందన్నారు. ఇటీవల దేశ సార్వత్రిక ఎన్నికలల్లో కాంగ్రెస్ పార్టీ 59 లోక్సభ స్థానాలను మాత్రమే కైవసం చేసుకుంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికలలో ఎందుకు ఓడామన్న దానిపై పార్టీలో సమీక్ష నిర్వహిస్తుంది. బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ దేశవ్యాప్తంగా సూడిగాలి పర్యటనలు చేయడమే కాకుండా, ట్విట్టర్, సామాజిక అనుంధాన వేదికలను తరచుగా ఉపయోగించిన సంగతి తెలిసిందే. బీజేపీ దేశవ్యాప్తంగా 282 స్థానాలను గెలుకున్న సంగతి తెలిసిందే.