సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర విభజన విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తి లేదని ఆంటోనీ కమిటీ సభ్యుడు, కేంద్ర మంత్రి వీరప్ప మొయిలీ తెలంగాణ కాంగ్రెస్ నేతలకు స్పష్టం చేశారు. సోమవారం సాయంత్రం తెలంగాణ ప్రాంత నేతలు వీరప్ప మొయిలీని ఆయన కార్యాలయంలో కలుసుకున్నారు. అత్యున్నత స్థాయిలో నిర్ణయాలు తీసుకున్నాక వాటిని మార్చడం అసాధ్యమని, తెలంగాణ ఏర్పాటుపై కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తసుకున్న నిర్ణయానికే కట్టుబడి ఉన్నామని నొక్కిచెప్పారు. విభజన విషయంలో వెనక్కి వెళ్లలేమని సీమాంధ్ర నేతలకు సైతం ఇదివరకే తేల్చిచెప్పామన్నారు.
అయితే, సీమాంధ్రులు లేవనెత్తిన పలు అంశాలపై స్పష్టత రావాల్సి ఉందన్నారు. ముఖ్యంగా నీళ్లు, నిధులు, హైదరాబాద్‌లోని సీమాంధ్రుల భద్రతపై చర్చించాల్సి ఉందని మొయిలీ చెప్పినట్లు సమాచారం. డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ, మంత్రులు జానారెడ్డి, పొన్నాల, డీకే అరుణ, సునీతారెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, ఎంపీలు సురేశ్ షెట్కార్ పొన్నం ప్రభాకర్, పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి, రాపోలు ఆనందభాస్కర్, రాజయ్య, ఎమ్మెల్యేలు కిష్టారెడ్డి, నర్సారెడ్డి, ముత్యంరెడ్డి, ఎమ్మెల్సీలు షబ్బీర్ అలీ, భూపాల్‌రెడ్డి, పొంగులేటి సుధాకర్‌రెడ్డి నేతలు దయాసాగర్, తదితరులు మొయిలీని కలిశారు.
సీడబ్ల్యూసీ తీసుకున్న నిర్ణయాన్ని తక్షణమే అమలు పరచాలని ఈ సందర్భంగా వారు విజ్ఞప్తి చేశారు. నిర్ణయం అమలు జాప్యంతో తెలంగాణలో లేని అపోహలు తలెత్తుతున్నాయని వివరించారు. తెలంగాణపై నిర్ణయంతో కాంగ్రెస్‌కు మంచి మైలేజీ వచ్చిందని, త్వరగా కేబినెట్ ముందు నోట్ పెడితే మేలని కోరారు. సీమాంధ్ర ఉద్యమాన్ని తెరవెనుక నుంచి కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలతో పాటు ఇతర పార్టీల నేతలు క్రియాశీలంగా నడిపిస్తున్నారని వివరించారు. అనంతరం జానారెడ్డి విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణపై నోట్‌ను వెంటనే కేబినెట్ ముందు పెట్టాలని తామంతా మొయిలీని కోరినట్లు తెలిపారు.
వెనక్కి తగ్గే ప్రసక్తి లేదు : వీరప్ప మొయిలీ
Published Tue, Sep 24 2013 1:32 AM | Last Updated on Thu, Sep 27 2018 5:56 PM
Advertisement
Advertisement