సంపాదకీయం: మిగిలినవాటి మాటెలా ఉన్నా పాలనలో తీసుకునే విధాన నిర్ణయాలు సహేతుకంగా, అర్ధవంతంగా ఉండాలి. అలాంటి నిర్ణయాలు కోట్లాది మంది పౌరుల జీవితాలతో ముడిపడి ఉంటాయి గనుక అది తప్పనిసరి. కానీ, యూపీఏ ఈమధ్యకాలంలో తీసుకుంటున్న నిర్ణయాలన్నిటికీ ఎన్నికల ప్రయోజనాలే గీటురాయి అవుతున్నాయి. ఆహార భద్రత, భూసేకరణ సవరణ చట్టాలనుంచి ఆంధ్రప్రదేశ్ విభజనవరకూ... అన్నిటి విషయంలోనూ స్వీయలాభాపేక్షను మాత్రమే కాంగ్రెస్ ప్రాతిపదికగా తీసుకున్నదని ఆయా సందర్భాల్లో విమర్శలు చెలరేగాయి. ఆ వరసలోనే కేంద్ర పర్యావరణ మంత్రి జయంతి నటరాజన్‌ను ఉన్నట్టుండి సాగనంపి ఆ శాఖ బాధ్యతలను పెట్రోలియం మంత్రి వీరప్ప మొయిలీకి అప్ప జెప్పారు.
జయంతి మంత్రిగా ఉన్నకాలంలో పర్యావరణ అనుమతుల కారణంగా నిలిచిపోయాయంటున్న పదులకొద్దీ ప్రాజెక్టులకు వీరప్ప మొయిలీ పచ్చజెండా ఊపుతున్నారు. ఇన్నాళ్లూ స్తబ్దుగా ఉండిపోయిన ప్రభుత్వంలో ఎక్కడలేని చైతన్యమూ కనబడుతోంది. ఆమె పాలనా కాలంలో అనుమతుల కోసం వేచిచూసిన ప్రాజెక్టుల విలువ దాదాపు పది లక్షల కోట్ల రూపాయలు కాగా, తాను ఈ శాఖ చేపట్టాక లక్షన్నర కోట్ల విలువైన ప్రాజెక్టులకు అనుమతులు మంజూరు చేశానని స్వయంగా మొయిలీయే చెబుతున్నారు. ఇందులో రూ.53,000 కోట్ల విలువైన పోస్కో ప్రాజెక్టు కూడా ఉంది.
ఆమె రాజీనామాకు దారితీసిన కారణాలపై జయంతి ఏమి చెప్పుకున్నా అటు పార్టీవైపునుంచిగానీ, ఇటు ప్రభుత్వం వైపునుంచిగానీ ఎవరూ నోరు మెదపలేదు. కానీ, ఆ రెండువైపులనుంచీ మీడియాకు మాత్రం పుంఖానుపుంఖాలుగా లీకులిస్తున్నారు. ఆ లీకుల సారాంశం చాలా ముఖ్యమైనది. ఈ దేశ ఆర్ధిక వ్యవస్థతోనూ, అభివృద్ధి తోనూ ముడిపడి ఉన్నది. బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ ఈ లీకులను ఆధారం చేసుకునే ఒక బహిరంగ సభలో ‘జయంతి టాక్స్’ అనే మాట వాడారు. పరిశ్రమలకు అవసరమయ్యే పర్యావరణ అనుమతులు తెచ్చుకునేందుకు పారిశ్రామికవేత్తలు ముడుపులు చెల్లించుకునేవారని ఆయన వ్యాఖ్యల్లోని సారాంశం.
నరేంద్ర మోడీ ఏ మాటన్నా వెనువెంటనే విరుచుకుపడే యూపీఏ సర్కారులోని పెద్దలు ఈసారి పెద్దగా మాట్లాడలేదు. జయంతి స్వయంగా చానెళ్లముందుకొచ్చి తనపై వచ్చిన ఆరోపణలను ఖండించుకున్నారు. ఈ పరస్పర నిందల సంగతెలా ఉన్నా యూపీఏ ప్రభుత్వమూ, కాంగ్రెస్ పార్టీ జవాబివ్వాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. భారత పారిశ్రామిక, వాణిజ్య మండలుల సమాఖ్య (ఫిక్కీ) సమావేశంలో పాల్గొనడానికి కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ వెళ్లినరోజునే, ఆయన ఆ సదస్సులో పాల్గొనడానికి కొన్ని గంటలముందే జయంతి తన పదవి నుంచి తప్పుకోవాల్సివచ్చింది. ఆ సమావేశంలో రాహుల్ చాలా కటువైన విమర్శలు చేశారు. ఇవన్నీ జయంతిని, ఆమె పనితీరుని దృష్టిలో పెట్టుకుని మాట్లాడినవేనని ఆమె రాజీనామా వల్ల అందరికీ ధ్రువపడింది. పైగా, ఆమె పనితీరు గురించి ఇచ్చిన లీకులు అందర్నీ దిగ్భ్రాంతికి గురిచేశాయి. ఉదాహరణకు రాజీనామా చేసేనాటికి ఆమె వద్ద దాదాపు 350 ఫైళ్లు ఉండిపోయాయని మీడియాలో వెల్లడైంది.
ఇందులో ఆమె ఆమోదం తెలుపుతూ సంతకాలు చేసిన 119 ఫైళ్లు, సంతకాలు చేయని మరో 180 ఫైళ్లు ఉన్నాయని ఆ కథనం చెబుతోంది. మరో 50 ఫైళ్లు ఆ మంత్రిత్వశాఖలోని సిబ్బందివద్ద ఉండిపోయాయట. వీటిలో చాలాభాగం మూడేళ్లక్రితానివికాగా, కొన్ని రెండేళ్లక్రితానివి. అంటే పరిశ్రమల స్థాపనకు అనుమతించిన ఫైళ్లు, తిరస్కరించిన ఫైళ్లు కూడా జయంతి నటరాజన్ వద్దే పెట్టుకున్నారని అర్ధమవుతున్నది. అసలు మీ విభాగాల నుంచి ఏఏ ఫైళ్లు పంపారో తెలపండంటూ వివిధ విభాగాధిపతులకు తాఖీదులు పంపారని కూడా ఆ కథనం పేర్కొంది. ఒక మంత్రిత్వశాఖలో ఇన్నేళ్లు ఫైలు ఆగిందంటే అందుకు గల కారణాలేమిటో ఆ శాఖ కార్యదర్శి కేబినెట్ కార్యదర్శికి సంజాయిషీ ఇచ్చుకోవాల్సి ఉంటుంది. కానీ, కేంద్ర ప్రభుత్వం గుడ్డి దర్బారుగా తయారైందని ఈ ఉదంతం వెల్లడిస్తోంది.
ఈ కథనం చూస్తే పర్యావరణ శాఖ పెద్ద కుంభకోణాలమయంగా మారిందన్న అభిప్రాయం కలుగుతుంది. జయంతి ఖండనల మాటెలా ఉన్నా ప్రభుత్వం నుంచి నోరు పెగలడంలేదు. ఆమె మంత్రిగా ఉన్నప్పుడు కదలిక లేకపోవడానికి, ఇప్పుడు లేడికి లేచిందే పరుగన్నట్టు వ్యవహరించడానికి కారణాలేమిటో తెలుసుకునే హక్కు దేశ ప్రజలకు ఉంది. కానీ, యూపీఏ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ఇదేదో తమ సొంత వ్యవహారమన్నట్టు ప్రవర్తిస్తున్నాయి. మొయిలీ అనుమతి మంజూరు చేసిన ప్రాజెక్టుల్లో చాలా భాగం పర్యావరణ వినాశనానికి దారితీస్తాయని పర్యావరణ ఉద్యమకారులు ఆరోపిస్తున్నారు. పోస్కో ప్రాజెక్టునుంచి గోరఖ్‌పూర్ అణు విద్యుత్ ప్రాజెక్టు వరకూ ఇచ్చిన అనుమతుల్లో తొందపాటేతప్ప మరేది కనబడటంలేదని వారి అభియోగం. దక్షిణ కొరియా అధ్యక్షుడు పర్యటనకొచ్చేనాటికి పోస్కో పెండింగ్‌లో ఉండ రాదన్న తహతహను మొయిలీ ప్రదర్శించారు.
అటు జయంతి వైదొలగ డానికి కారణాలు చెప్పక, ఇటు ఎడాపెడా ఇస్తున్న అనుమతుల్లోని మతలబేమిటో వివరించక యూపీఏ ప్రభుత్వం బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నది. ఇల్లు ఖాళీచేసేవాడు అన్నీ సర్దుకున్నట్టు సర్కారు ఒక్కొక్క పనే మెరుపువేగంతో చేసుకుపోతోంది. తమపై కినుకవహించి ఉన్న కార్పొరేట్లను మంచిచేసుకోవడం, తద్వారా రాబోయే ఎన్నికల్లో ఆర్ధికంగా, హార్ధికంగా లాభపడటమే ఈ చర్యల సారాంశమని కొందరు చేస్తున్న విమర్శల్లో నిజం ఉన్నదేమోనన్న సంశయానికి చోటు కల్పిస్తోంది. ఈ క్రమంలో ప్రాణప్రదమైన పర్యావరణ పరిరక్షణ అంశాన్ని విస్మరిస్తున్న భావన మాత్రం అందరిలోనూ కలుగుతున్నది. ఇప్పటికైనా యూపీఏ సర్కారు సంజాయిషీకి సిద్ధపడుతుందా?
ఈ పరుగులో మర్మమేమిటి?
Published Fri, Jan 17 2014 3:25 AM | Last Updated on Sat, Jun 2 2018 4:41 PM
Advertisement
Advertisement