హైదరాబాద్ మాత్రమే అభివృద్ధి చెందింది: జేడీ
న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్లో కేవలం హైదరాబాద్ మాత్రమే అభివృద్ధి చెందిందని కేంద్రమంత్రి జేడీ శీలం అన్నారు. సీమాంధ్ర కేంద్రమంత్రులు గురువారం సహజ వనరుల శాఖ మంత్రి వీరప్ప మొయిలీతో భేటీ అయ్యారు. భేటీ అనంతరం జేడీ శీలం మాట్లాడుతూ హైదరాబాద్తో సమానంగా రాష్ట్రంలో ఏ ప్రాంతం అభివృద్ధి చెందలేదన్నారు.
హైదరాబాద్ అందరిదనీ, గత ఎనిమిదేళ్లలో హైదరాబాద్లో 55వేల కోట్లు ఖర్చు చేశామన్నారు. హైదరాబాద్పై అందరూ ఆధారపడ్డారని, ఇరుప్రాంతాల ప్రజల సమస్యలపై జోవోంఎం సానుకూలంగా స్పందిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. హైదరాబాద్ను శాశ్విత కేంద్రపాలిత ప్రాంతంగా చేయాలని జేడీ శీలం అన్నారు.
సీమాంధ్ర ప్రజల సమస్యలను మొయిలీ దృష్టికి తీసుకు వెళ్లినట్లు జేడీ శీలం తెలిపారు. క్లిష్టమైన సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకోలేకపోతే ప్రజలకు సమాధానం చెప్పుకోలేమన్నారు. అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారం వస్తుందని ఆశిస్తున్నామని జేడీ శీలం తెలిపారు. తెలుగు ప్రాంత ప్రజలందరికీ న్యాయం జరగాలని కోరామన్నారు.
సాగునీరు, రాజధాని, సహజ వనరులు, చమురు కేటాయింపులపై చర్చించినట్లు తెలిపారు. తాను ఎవరికి నివేదిక ఇవ్వలేదని, ప్యాకేజీలపై చర్చించలేదన్నారు. తమ అభ్యంతరాలపై మొయిలీ సానుకూలంగా స్పందించినట్లు జేడీ తెలిపారు. ఈ సమావేశంలో కేంద్ర మంత్రులు పురందేశ్వరి, చిరంజీవి, కావూరి సాంబశివరావు, జేడీ శీలం పాల్గొన్నారు. కాగా హైదరాబాద్లోని సీమాంధ్రల భద్రతకు హామీ ఇవ్వాలని కేంద్రమంత్రులు ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు ప్రధానమంత్రిని కలిసి విజ్ఞప్తి చేయనున్నారు.