మొయిలీకి ఐదుగురు సీమాంధ్ర మంత్రుల వినతి
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర విభజన నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవటం సాధ్యం కాని పక్షంలో హైదరాబాద్ నగరాన్ని ఏ ఒక్క రాష్ట్రానికో అప్పగించకుండా జాతీయ రాజధాని ఢిల్లీ రాష్ట్రం తరహాలో ప్రత్యేక పరిపాలనా ప్రాంతంగా ప్రకటించాలని సీమాంధ్ర ప్రాంతానికి చెందిన కేంద్రమంత్రులు.. కొత్తగా ఏర్పడిన ఆంటోనీ కమిటీని కోరినట్లు తెలియవచ్చింది. ఆంధ్రప్రదేశ్ విభజనపై కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నిర్ణయంపై వ్యక్తమౌతున్న అభ్యంతరాలు, సూచనలను పరిశీలించేందుకు రక్షణమంత్రి ఎ.కె.ఆంటోనీ నేతృత్వంలో పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ కమిటీ సభ్యుడిగా నియమితుడైన కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి వీరప్పమొయిలీని సీమాంధ్ర ప్రాంతానికి చెందిన ఐదుగురు కేంద్రమంత్రులు - పల్లంరాజు, జె.డి.శీలం, దగ్గుబాటి పురందేశ్వరి, పనబాక లక్ష్మి, కిల్లి కృపారాణిలు గురువారం ఢిల్లీలో కలిసి తమ వాదన వినిపించారు. ఆరు దశాబ్దాలపాటు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల ప్రజల సమష్టి కృషితో మహా నగరంగా అభివృద్ధి చెందిన రాజధానిపై శాశ్వతంగా హక్కు కోల్పోవటానికి కోస్తా, రాయలసీమ ప్రజలు సిద్ధంగా లేరని పేర్కొన్నట్లు సమాచారం.
ప్రత్యేక ప్రాదేశిక పాలనా మండలిగా మార్చాలి
హైద్రాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించినా ఫలితం ఉండదన్న కేంద్రమంత్రులు రాష్ట్రా న్ని సమైక్యంగా కొనసాగించటానికే తాము ప్రాధాన్యతనిస్తామని.. విభజన అనివార్యమైతే హైదరాబాద్‌ను ఢిల్లీ తరహాలో ప్రత్యేక శాసనసభ, ప్రజాప్రాతినిధ్య ప్రభుత్వం ఉండేలా, శాంతి, భద్రతలు, పోలీసు వ్యవస్థ, పట్టణాభివృద్ధి కేంద్ర ప్రభుత్వ అధీనంలో కొనసాగేలా ప్రత్యేక ఏర్పాటు చేయాలని కోరినట్లు సమాచారం. హైదరాబాద్ వెలుపల కూడా విస్తరించి ఉన్న మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (హెచ్‌ఎండీఏ) పరిధిలోకి వచ్చే మొత్తం ప్రాంతాన్ని ప్రత్యేక ప్రాదేశిక పరిపాలనా మండలిగా మార్చి రెండు రాష్ట్రాలకు రెండు కొత్త రాజధాని నగరాల నిర్మాణానికి కేంద్రం నిధులు సమకూర్చాలని సీమాంధ్ర మంత్రులు ప్రతిపాదించినట్లు తెలిసింది.
మిగతా సభ్యులనూ కలిసే యత్నం...
శని,ఆదివారాల్లో ఆంటోనీ కమిటీ మిగతా సభ్యులు అహ్మద్‌పటేల్, దిగ్విజయ్‌సింగ్, ఆంటోనీలను కూడా కలిసేందుకు కేంద్ర మంత్రులు ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. కేంద్రపాలిత ప్రాంతంగా ఉన్న పుదుచ్చేరి, జాతీయ రాజధాని ప్రాంతంగా భాసిల్లుతున్న ఢిల్లీ మాదిరిగా హైదరాబాద్‌కు కూడా ఒక శాసనసభను ఏర్పాటు చేసి గ్రేటర్ హైద్రాబాద్‌లో స్థిరపడిన సీమాంధ్రులలో అభద్రతా భావాన్ని తొలగించవచ్చునన్నది వారి వాదనగా చెప్తున్నారు. ఆ తర్వాత దాదాపుగా కేంద్రం అధీనంలోనే ఉండే హైదరాబాద్ నగర రాష్ట్రం నుంచే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు రెండూ పరిపాలనను సాగించే అవకాశం కల్పించవచ్చునని, లేదంటే రెండు రాష్ట్రాలూ కొత్త రాజధానులను నిర్మించుకునేందుకు కేంద్రం ప్రత్యేక ఆర్థిక సహాయాన్ని అందించవచ్చునని సీమాంధ్ర మంత్రులు సూచించినట్లు తెలిసింది.
ప్రస్తుతానికి ఆపగలిగాం: సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీలు
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియపై యూపీఏ ముందుకు వెళ్లకుండా ప్రస్తుతానికి ఆపగలిగామని సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీలు పేర్కొన్నారు. సీమాంధ్ర నేతల ఆందోళనల వల్లే గురువారం కేబినెట్ భేటీలో తెలంగాణ అంశం ప్రస్తావనకు రాలేదని చెప్పారు. అయితే విభజన విషయమై కాంగ్రెస్ పార్టీని ముందుకు వెళ్లకుండా తాము ఆపలేమని స్పష్టం చేశారు. ఎంపీలు లగడపాటి రాజగోపాల్, అనంత వెంకట్రామిరెడ్డి, సాయిప్రతాప్, కనుమూరి బాపిరాజు ఢిల్లీలోని విజయ్‌చౌక్‌లో విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో మెజార్టీ పార్టీలు తెలంగాణకు అనుకూలంగా నిర్ణయాన్ని వెల్లడించడం వల్లే విభజనపై కాంగ్రెస్ సానుకూల నిర్ణయం తీసుకుందన్నారు. టీడీపీ, వైఎస్సార్ కాంగ్రెస్, సీపీఐలు వాటి వైఖరిపై పునరాలోచించాలని కోరారు. విభజనతో తలెత్తే సమస్యలను ఆంటోనీ కమిటీకి వివరిస్తామన్నారు.
ఢిల్లీ తరహాలో హైదరాబాద్!
Published Fri, Aug 9 2013 4:02 AM | Last Updated on Mon, Oct 22 2018 9:16 PM
Advertisement
Advertisement