సంపాదకీయం: దశాబ్దాలుగా ఉన్న ఒక సంక్లిష్ట సమస్యను పరిష్కరించడానికి పూనుకునే ముందు ఎలా ప్రవర్తించాలో, ఆ పరిష్కార ప్రక్రియలో అందరి భాగస్వామ్యమూ తీసుకోనట్టయితే ఏమవుతుందో తల వాచిన తర్వాత కాంగ్రెస్ అధిష్టానానికి తెలిసొచ్చినట్టుంది. రక్షణ మంత్రి ఏకే ఆంటోనీ ఆధ్వర్యంలో నలుగురు సభ్యుల హైపవర్ కమిటీని ఏర్పాటుచేస్తున్నట్టు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జనార్దన్ ద్వివేది ప్రకటించారు. కొంపలంటుకున్నాక బావి తవ్వడానికి ప్రయత్నించినట్టున్న ఈ కమిటీ ఏం చేస్తుంది, పరిస్థితిని ఎలా చల్లారుస్తుందన్న సంగతలా ఉంచితే... రాష్ట్రంలో ఆ పార్టీకి ఇప్పుడు ‘నలుగురి’ అవసరం పడిందని స్పష్టంగానే తెలుస్తోంది. గత పది రోజులుగా సీమాంధ్ర ప్రాంతం ఆందోళనలతో అట్టుడుకుతోంది. ప్రజాగ్రహం ఏ స్థాయిలో ఉన్నదంటే కాంగ్రెస్‌కు చెందిన రాష్ట్ర మంత్రులు, ఎంపీలు రాజీనామా డ్రామాకు సిద్ధపడాల్సివచ్చింది. పార్లమెంటులో గళం ఎత్తాల్సివచ్చింది.
తెలంగాణ ఏర్పాటు కావాల్సిందేనని వాదించేవారు సైతం కాంగ్రెస్ అధిష్టానం వ్యవహరించిన తీరును తప్పుబట్టక తప్పడంలేదు. తీసుకున్న నిర్ణయం ఎంత న్యాయబద్ధమైనదనుకున్నా, తమ ప్రయోజనాలకు మరెంతగా ఉపయోగపడుతుందని లెక్కలేసుకున్నా... దాన్ని అమలుచేయడానికి పూనుకునేముందు ఒక పద్ధతిని పాటించాలని, ఆ ప్రక్రియలో అందరి సహాయసహకారాలూ తీసుకోవాలని ఆ పార్టీ పెద్దలు అనుకోలేదు. నిర్ణయాన్ని వ్యతిరేకించగల వర్గాల అభిప్రాయాలేమిటో తెలుసుకోవడానికి లేదా వారి అపార్థాలనూ, అపోహలనూ పోగొట్టడానికి ప్రయత్నించలేదు. ఒక ప్రజాస్వామ్య బద్ధమైన డిమాండుపై తమకు అలవాటైన కుట్రపూరిత మనస్తతత్వంతోనే వారు ఆలోచించారు. ప్రత్యేక రాష్ట్రం డిమాండు చేస్తున్నవారి మనోభావాలతో తమ స్వీయ ప్రయోజనాలను రంగరించి ఎవరూ అడగని ప్రతిపాదనలను కూడా తెరపైకి తీసుకురావడం వెనకున్నది ఈ కుట్ర బుద్ధే.
తెలంగాణ సమస్యపై భిన్న పార్టీలు తమ తమ అభిప్రాయాలు చెప్పాయని, అదేవిధంగా తామూ చెప్పామని అంటున్న కాంగ్రెస్ నేతల వాదన నయవంచన తప్ప మరేమీ కాదు. కాంగ్రెస్ తన అభిప్రాయాన్ని చెప్పి ఊరుకోలేదు. అధికారంలో ఉన్నది గనుక ఆ అభిప్రాయానికి అనుగుణంగా తదుపరి చర్యలకు ఉపక్రమించింది. అసలు అధికారికంగా అభిప్రాయాన్ని వెల్లడించడానికి ముందే తాము ఏం చేయబోతున్నారో వారు లీకులు ఇచ్చారు. తమ అత్యున్నత నిర్ణాయక సంఘం సీడబ్ల్యూసీలో చర్చించకముందే, యూపీఏలో తమ భాగస్వామ్యపక్షాల వారితో మాట్లాడకముందే ఆ పార్టీ పెద్దలు ఒక నిర్ణయానికి వచ్చేశారని... ఆ రెండు సమావేశాలూ లాంఛనప్రాయమైన ముద్రలు వేయించుకోవడానికేనని పత్రికలు చదువుతున్నవారికి, చానెళ్లు చూస్తున్నవారికి అర్ధమైంది.
ఇక్కడి నాయకులకు ఆ మాత్రం విలువైనా ఇవ్వలేదు. ఆత్మగౌరవం ఉన్న నాయకులైతే, అధికారంపై మమకారం లేనివారే అయితే వీరందరూ ఆ క్షణంలోనే పదవులనుంచి వైదొలగేవారు. అలా చేయలేకపోయారు సరిగదా... ఆంటోనీ కమిటీకి అలవిమాలిన ప్రాముఖ్యతనిస్తూ ఇప్పుడు ప్రకటనలు గుప్పిస్తున్నారు. విభజన ప్రక్రియ ఆగిపోయిందట. ఆంటోనీ కమిటీ నివేదిక వచ్చేవరకూ తదుపరి చర్యలు ఉండవట. ఆ కమిటీకి ఎన్జీవోలు, విద్యార్థులు, ఇతర పార్టీలవారూ అభిప్రాయాలు చెప్పవచ్చునట. ఇంతవరకూ వచ్చాక కూడా తమ కబుర్లతో ఇంకా జనాన్ని మభ్యపెట్టగలమని వారనుకుంటున్నారు. ఆంటోనీ కమిటీ మౌలికంగా కాంగ్రెస్ కమిటీ. ఆ కమిటీకి ‘హై పవర్’ అని విశేషణం తగిలించినంతమాత్రాన దానికి అధికార ప్రతిపత్తి రాదు.
విభజనవల్ల సమస్యలున్నాయనుకునేవారు ప్రభుత్వంతో మాట్లాడాలని చూస్తారు. తమ మనోభావాలను అది పట్టించుకోవాలని ఆశిస్తారు. అది వినడం లేదనుకున్నప్పుడు దాని మెడలు వంచడానికి ప్రయత్నిస్తారు. అంతేతప్ప కాంగ్రెస్‌కు చెందిన కమిటీని కలవాల్సిన అవసరం ఉద్యమకారులకు ఏముంటుంది? కలిసి ఏమి మాట్లాడతారు? కొంతవరకూ కాంగ్రెస్ పార్టీకి అది ఉపయోగపడవచ్చు. ఉద్యమాల పర్యవసానంగా పార్టీకి ఉత్పన్నమైన సంకటాన్ని కాంగ్రెస్ శ్రేణులు దానికి వివరించడానికి ప్రయత్నించవచ్చు. లేదా రాయల తెలంగాణ వంటి తమ రహస్య అజెండాకు దీన్ని వేదికగా చేసుకోవచ్చు. ఈ పరిమిత ప్రయోజనాల కోసం పార్టీ పరంగా ఏర్పాటుచేసుకున్న కమిటీని లోకకల్యాణం కోసం ఆవిర్భవించిన సంస్థగా చిత్రించబోవడం నయవంచన.
ఇంతకూ కమిటీలో ఉన్నవారికి విభజనానంతర పరిణామాలపై కొన్ని ప్రాంతాల్లో ఉన్న భయాలపైగానీ, మొత్తంగా ఈ రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యలపైగానీ అవగాహన ఉందనడానికి దాఖలాలు లేవు. అంతటి అవగాహన, శక్తి వీరికుంటే సీడబ్ల్యూసీలోనో, కోర్ కమిటీలోనో విభజన ప్రక్రియకు సంబంధించి మెరుగైన విధానం రూపుదిద్దుకునేది. ముఖ్యంగా గత నాలుగేళ్లలోనూ అన్ని వర్గాల వారితోనూ, అన్ని స్థాయిల్లోనూ చర్చించే ప్రజాస్వామిక ప్రక్రియ అమలయ్యేది. ఇదేమీ లేదు సరిగదా... రాయల తెలంగాణ వంటి ప్రతిపాదనలను తెరపైకి తెస్తూ అసలే ఆగ్రహంతో రగులుతున్న రాష్ట్రాన్ని మరింత అగ్నిగుండంగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నారు.
సుదీర్ఘ చరిత్ర, ప్రత్యేక అస్తిత్వమూ కలిగిన రాయలసీమ ప్రాంత ప్రజలను ఇలాంటి ప్రతిపాదనలతో తాము అపహాస్యం చేస్తున్నామని, వారి మనోభావాలను గాయపరుస్తున్నామని కాంగ్రెస్ పెద్దలు మరిచి పోతున్నారు. అడిగింది తెలంగాణ అయితే, పనిలో పనిగా రాయలసీమను విడదీసేందుకు ఆ పార్టీ ప్రణాళికలు సిద్ధం చేసుకుని, అందులో భాగంగానే ఆంటోనీ కమిటీని ఏర్పాటు చేసిందని కాంగ్రెస్ పోకడలు తెలిసినవారందరూ సరిగానే అంచనా వేస్తున్నారు. ఇలాంటి చేష్టలవల్ల కాంగ్రెస్ మరింత అధోగతిపాలు కావడం తప్ప సాధించేదేమీ ఉండదు. కనీసం అవసానదశలోనైనా ఈ సంగతిని గ్రహించడం ఆ పార్టీ పెద్దల ఆరోగ్యానికి మంచిది.
ఆ నలుగురు...!
Published Fri, Aug 9 2013 12:08 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM
Advertisement
Advertisement