PC chacko
-
కేరళ కాంగ్రెస్‌కు భారీ షాక్!
తిరువనంతపురం: అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తోన్న వేళ కేరళలో కాంగ్రెస్‌కు భారీ షాక్ తగిలింది. సీనియర్ నేత పీసీ చాకో బుధవారం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా చాకో కేరళ కాంగ్రెస్‌లో ప్రజాస్వామ్యం లేదని, పార్టీ రెండు వర్గాలుగా చీలిపోయిందని విమర్శించారు. దీని గురించి తాను అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లినా మౌనం వహించిందని అన్నారు. వర్గ విభేదాలతో విసిగిపోయి పార్టీ నుంచి బయటకు వస్తున్నట్టు మాజీ మంత్రి ప్రకటించారు. ఇక తాను బీజేపీలో చేరుతున్నానంటూ జరుగుతోన్న ప్రచారాన్ని ఆయన ఖండించారు. కేరళ కాంగ్రెస్‌లో ఆత్మగౌరవం ఉన్న రాజకీయ నేత ఎవరూ మనుగడ సాగించలేరని చాకో దుయ్యబట్టారు. ‘‘నేను కాంగ్రెస్ పార్టీని వీడుతున్నాను.. రాజీనామా లేఖను తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీకి పంపాను.. గత కొద్దికాలంగా ఈ నిర్ణయంపై నేను పలువురితో చర్చించాను.. అనేక రకాలుగా ఆలోచించాను. నేను కేరళ నుంచి వచ్చాను.. అక్కడ కాంగ్రెస్ పార్టీ లేదు.. కాంగ్రెస్ (ఐ), కాంగ్రెస్ (ఏ)గా విడిపోయింది. ఇది కేరళ కాంగ్రెస్ యూనిట్‌గా పనిచేస్తున్న రెండు పార్టీల సమన్వయ కమిటీ’ అంటూ చాకో సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘ఓ వర్గానికి మాజీ సీఎం ఊమెన్ చాందీ నాయకత్వం వహిస్తుంటే.. మరో వర్గానికి రాష్ట్ర పీసీపీ చీఫ్ రమేశ్ చెన్నితాల నాయకత్వం వహిస్తున్నారు.. చాలా ఏళ్లుగా ఈ రెండు వర్గాలు యాక్టివ్‌గా ఉన్నాయి’ అంటూ చాకో మండిపడ్డారు. ‘కేరళ కీలకమైన ఎన్నికలను ఎదుర్కొంటోంది.. కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నారు. కానీ నాయకులు గ్రూప్‌లను ప్రోత్సహిస్తున్నారు. ఈ అంశంపై హైకమాండ్ ముందు మాట్లాడినా ప్రయోజనం లేకపోయింది’ అని తెలిపారు చాకో. పీసీ చాకో కాంగ్రెస్‌లో కీలక నేతగా ఉన్నారు. ఆ పార్టీ అధికార ప్రతినిధిగా, ఎంపీగా కీలక బాధ్యతలు చేపట్టారు. కేరళ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికపై కూడా చాకో ఆరోపణలు గుప్పించారు. పోటీచేసే అభ్యర్థుల జాబితా గురించి రాష్ట్ర కాంగ్రెస్ కమిటీతో చర్చించలేదని దుయ్యబట్టారు. ‘కాంగ్రెస్‌వాదిగా చెబుతున్నాను. కేరళలో పార్టీ చాలా గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటోంది.. మీరు కాంగ్రెస్‌లో ఏదో ఓ వర్గానికి చెందినవారైతే మాత్రమే మీకు మనుగడ ఉంటుంది... కాంగ్రెస్ నాయకత్వం అంత చురుకుగా లేదు’ అని ఆరోపించారు. చదవండి: అశ్లీలం.. గందరగోళం.. ఆయన మాట వినకుండా తప్పు చేశానన్న ఇందిరాగాంధీ! -
ఢిల్లీ కాంగ్రెస్‌లో కల్లోలం.. పార్టీ ఇన్ఛార్జ్ రిజైన్
సాక్షి, న్యూఢిల్లీ: అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ పార్టీలో అంతర్గత చిచ్చుకు కారణమవుతున్నాయి. తాజా ఎన్నికల్లో పార్టీ ఘోర పరాభవానికి నైతిక బాధ్యత వహిస్తూ ఢిల్లీ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ పీసీ చాకో తన పదవికి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీ, సీనియర్ నేత అయిన చాకో మాట్లాడుతూ.. ఢిల్లీలో కాంగ్రెస్ పతనానికి మాజీ సీఎం షీలా దీక్షిత్ కారణమంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 2013లో షీలా దీక్షిత్ ఢిల్లీ సీఎంగా ఉన్నప్పుడే కాంగ్రెస్ పతనం మొదలయ్యిందని ఆయన వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ఓటు బ్యాంకును పూర్తిగా ఆమ్ ఆద్మీ పార్టీ సొంతం చేసుకుందన్నారు. పోయిన ఓటు బ్యాంకు తిరిగి పార్టీకి రాలేదని, ఆ ఓటు బ్యాంకు ఇప్పటికీ ఆప్‌తో ఉందని ఆయన పేర్కొన్నారు. పీసీ వ్యాఖ్యలపై స్పందించిన మహారాష్ట్ర కాంగ్రెస్ నేత మిలింద్ దేవర చాకో వ్యాఖ్యలతో విభేదించారు. నిజానికి షీలా అధికారంలో ఉండగా కాంగ్రెస్ ఓ వెలుగు వెలిగిందని మిలింద్ దేవర అభిప్రాయపడ్డారు. (ఆమ్ ఆద్మీ అందగాడు గెలిచేశాడు..!) ఆమె మరణాంతరం ఢిల్లీలో పార్టీ ఓటమికి షీలాను నిందించడం సరికాదన్నారు. ఆమె పార్టీకి, ఢిల్లీ ప్రజలకు తన జీవితాన్ని అంకితం చేశారని ఆయన పేర్కొన్నారు. కాగామొత్తం 70 స్థానాలకు జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ 62 స్థానాల్లో విజయం సాధించి మూడో సారి అధికార పగ్గాలు చేపట్టగా.. బీజేపీ 8 స్థానాలతో సరిపెట్టుకుంది. కాంగ్రెస్ పార్టీ 2015 మాదిరిగానే ఖాతా తెరవలేక ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. (హస్తిన తీర్పు : ఆప్ 62.. బీజేపీ 8) -
ఆప్‌తో కాంగ్రెస్ ‘టు బీ నాట్ టు బీ’
సాక్షి, న్యూఢిల్లీ : ఢిల్లీలోని ఏడు లోక్‌సభ స్థానాలకు ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీ తమ అభ్యర్థులను ప్రకటించడమే కాకుండా వారి తరఫున ప్రచారాన్ని కూడా ప్రారంభించాయి. ఆప్‌తో పొత్తు పెట్టుకునే విశయమై ‘టు బీ నాట్ టు బీ’ అన్న సందిగ్ధంలో కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ కొట్టు మిట్టాడుతుండడంతో అన్నింటా వెనకబడి పోయింది. ఒంటరిగా పోటీ చేయాలా, లేదా ఇంక తేలలేదని, ఈ విషయంలో పార్టీ అధిష్టానం నుంచి గ్రీన్ సిగ్నల్ కోసం నిరీక్షస్తున్నామని ఢిల్లీ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలు చూస్తున్న పార్టీ సీనియర్ నాయకుడు పీసీ చాకో మీడియాకు తెలిపారు. ఎన్నికల షెడ్యూల్‌ను ఇప్పటికే ప్రకటించినందున ఈ విషయంలో ఎక్కువ కాలం తాత్సారం చేయలేమని, రెండు, మూడు రోజుల్లోనే కచ్చితమైన నిర్ణయం తీసుకొని ముందుకు సాగుతామని ఆయన చెప్పారు. అయితే ఏ నిర్ణయం తీసుకోవాలన్నా, రాహుల్ గాంధీయే తీసుకోవాలని ఆయన అన్నారు. ఢిల్లీకి ఆరవ విడత కింద మే 12వ తేదీన ఎన్నికలు జరుగుతున్న విషయం తెల్సిందే. బీజేపీని ఓడించాలంటూ ఉమ్మడిగా పోలీ చేయాల్సిన అవసరం ఉందంటూ కాంగ్రెస్ పార్టీకి చెప్పి, చెప్పి అలసిపోయానని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ ఫిబ్రవరి 21వ తేదీన స్పష్టం చేశారు. తమతో పొత్తు పెట్టుకునే విషయమై కేజ్రివాల్ ఎన్నడూ మాట్లాడలేదని మాజీ ముఖ్యమంత్రి, ఢిల్లీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షీలా దీక్షిత్ అదే రోజు ప్రకటించారు. ఆ తర్వాత ఆప్ ఢిల్లీలోని ఏడు లోక్‌సభ సీట్లకుగాను ఆరు సీట్లకు అభ్యర్థులను మార్చి 2వ తేదీన ప్రకటించింది. పొత్తు కుదరకపోవడం వల్లనే తాను ఆరు సీట్లకు అభ్యర్థులను ప్రకటించాల్సి వచ్చిందని కేజ్రీవాల్ చెప్పుకున్నారు. తాము ఢిల్లీలో ఒంటరిగానే పోటీ చేస్తామని, రాహుల్ గాంధీ సమక్షంలోనే ఈ నిర్ణయం తీసుకున్నాం కనుక ఇదే తుది నిర్ణయమంటూ మార్చి ఐదవ లేదీన షీలా దీక్షిత్ ప్రకటించారు. అయినప్పటికీ ఆప్‌తో పొత్తు పెట్టుకోవాలా, లేదా ? అన్న అంశంపై మార్చి 9వ తేదీన సోనియా గాంధీని కలసుకొని షీలా దీక్షిత్ చర్చలు జరిపారు. ఆ తర్వాత రెండు రోజులకు ఢిల్లీలో పార్టీ కార్యకర్తలు, మద్దతుదారులతో రాహుల్ గాంధీ మాట్లాడుతూ కూడా పొత్తు ఉండదని సూచించారు. ఆప్‌తో పొత్తు పెట్టుకోవాలా, లేదా అన్న విషయంలో ఢిల్లీలోని 52 వేల కార్యకర్తల అభిప్రాయాలను తెలియజేయాలని కోరుతూ ‘శక్తి’ అనే యాప్ ద్వారా సందేశాన్ని కాంగ్రెస్ పంపించింది. దాని ఫలితం ఏమిటో వెలుగులోకి రాలేదు. మార్చి 17వ తేదీన ఆప్ చివరి ఏడో సీటుకు కూడా న్యాయవాది బల్బీర్ సింగ్ జాఖడ్ పేరును ప్రకటించారు. పొత్తు కోసం ఇప్పటికీ చర్చలు కొనసాగుతున్నందున తాము ఎన్నికల ప్రచారాన్ని జరపలేక పోతున్నామని పార్టీ ఎన్నికల ప్రచారం కమిటీ చీఫ్ సుమేశ్ శౌకీన్ తెలిపారు. మార్చి 17వ తేదీ నుంచి ఎన్నికల ప్రచారాన్ని తీవ్రతరం చేస్తామని శౌకీన్ చెప్పారు. అంతటి ప్రచార తీవ్రత ఏమీ కనిపించడం లేదు. అభ్యర్థి లేకుండా ప్రచారం చేస్తే అది ఓటర్లను అంతగా ఆకట్టుకోలేదు. -
షకీల్ అహ్మద్ స్థానంలో పీసీ చాకో
న్యూఢిల్లీ: త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఢిల్లీకి కాంగ్రెస్ పార్టీ పర్యవేక్షకుడిని మార్చింది. సీనియర్ నాయకుడు పీసీ చాకోను రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జిగా నియమించింది. ప్రస్తుత్వం ఇన్చార్జిగా వ్యవహరిస్తున్న ఏఐసీసీ కార్యదర్శి షకీల్ అహ్మద్ వ్యక్తిగత కారణాలతో సెలవు కోరడంతో ఈ మార్పు జరిగినట్టు కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. వ్యక్తిగత పనుల నిమిత్తం డిసెంబర్ 28 నుంచి మార్చి 7 వరకు విదేశాలకు వెళుతున్నట్టు అధిష్టానికి షకీల్ అహ్మద్ సమాచారం ఇచ్చినట్టు తెలిపాయి. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జనవరి లేదా ఫిబ్రవరిలో జరిగే అవకాశాలున్నాయి. -
'శీతాకాల సమావేశాలు మాకు చివరివి కావు'
ఢిల్లీ:పార్లమెంట్ శీతాకాల సమావేశాలు తమకు చివరివి కావని ఏఐసీసీ అధికార ప్రతినిధి పీసీ చాకో తెలిపారు.ఈ సమావేశాలు కాంగ్రెస్ పార్టీకి ఆఖరివి కావచ్చన్న వ్యాఖ్యలపై ఆయన పైవిధంగా స్పందించారు. ఇప్పడు జరుగుతున్న పార్లమెంట్ సమావేశాలు కాంగ్రెస్ పార్టీకి చివరివి కావని స్పష్టం చేశారు. రేపు లోక్‌సభకు రానున్న లోక్‌పాల్ బిల్లుకు సహకరించాలని తమ ఎంపీలకు నచ్చచెబుతామన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీలో నెలకొన్నపరిస్థితులు దురదృష్టకరమన్నారు. తెలంగాణ ఏర్పాటుకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందన్నారు. ఇదంతా కాంగ్రెస్ ఆటలో ఒక భాగమని విపక్షాలపై ఆయన మండిపడ్డారు. ప్రజలకు ఎవరేమిటో తెలుసని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. -
'సోనియా 24 గంటల్లో ప్రధాని కాగలరు'
సోనియా గాంధీపై బీజేపీ నాయకురాలు సుష్మా స్వరాజ్ చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ తోసిపుచ్చింది. సుష్మా వ్యాఖ్యలు అపరిపక్వంగా ఉన్నాయని తిప్పికొట్టింది. తమ పార్టీ నిర్ణయిస్తే సోనియా రేపే ప్రధాని కాగలరని పేర్కొంది. ఆమెకు ఇతరుల ఆమోదం అవసరం లేదని స్పష్టం చేసింది. సోనియా ప్రధాని మంత్రి కావాలని కోరుకుంటే ఆమెను ఎవరూ ఆపలేరని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి పీసీ చాకో అన్నారు. సోనియా తలచుకుంటే 24 గంటల్లో ప్రధాని కాగలరని చెప్పారు. దీనికి ఎవరి మద్దతు, ఆమోదం అవసరం లేదని ఆయన అన్నారు. ఎన్నోసార్లు ప్రధాని అయ్యే అవకాశం వచ్చినా సోనియా తృణప్రాయంగా వదులుకున్నారని పునరుద్ఘాటించారు. సోనియా ప్రధాని కావడానికి తానిప్పటికీ వ్యతిరేకమేనని సుష్మా స్వరాజ్ నిన్న వ్యాఖ్యానించారు. ఆమె ప్రధాని అయితే గుండు కొట్టించుకుంటానని 2004 మే నెలలో చేసిన వ్యాఖ్యలకు తాను ఇప్పటికీ చింతించేది లేదని చెప్పారు. సోనియా మన దేశానికి ఇందిరకు కోడలుగాను, రాజీవ్ గాంధీకి భార్యగాను వచ్చారని.. అందువల్ల తమ ప్రేమాభిమానాలు ఆమెపట్ల ఉంటాయని సుష్మా అన్నారు. కాంగ్రెస్ అధినేత్రిగా కూడా ఆమెను గౌరవిస్తామని, కానీ దేశానికి ప్రధాని అవుతానంటే మాత్రం తాను అంగీకరించేది లేదని స్పష్టం చేశారు. -
ఆ నలుగురు...!
సంపాదకీయం: దశాబ్దాలుగా ఉన్న ఒక సంక్లిష్ట సమస్యను పరిష్కరించడానికి పూనుకునే ముందు ఎలా ప్రవర్తించాలో, ఆ పరిష్కార ప్రక్రియలో అందరి భాగస్వామ్యమూ తీసుకోనట్టయితే ఏమవుతుందో తల వాచిన తర్వాత కాంగ్రెస్ అధిష్టానానికి తెలిసొచ్చినట్టుంది. రక్షణ మంత్రి ఏకే ఆంటోనీ ఆధ్వర్యంలో నలుగురు సభ్యుల హైపవర్ కమిటీని ఏర్పాటుచేస్తున్నట్టు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జనార్దన్ ద్వివేది ప్రకటించారు. కొంపలంటుకున్నాక బావి తవ్వడానికి ప్రయత్నించినట్టున్న ఈ కమిటీ ఏం చేస్తుంది, పరిస్థితిని ఎలా చల్లారుస్తుందన్న సంగతలా ఉంచితే... రాష్ట్రంలో ఆ పార్టీకి ఇప్పుడు ‘నలుగురి’ అవసరం పడిందని స్పష్టంగానే తెలుస్తోంది. గత పది రోజులుగా సీమాంధ్ర ప్రాంతం ఆందోళనలతో అట్టుడుకుతోంది. ప్రజాగ్రహం ఏ స్థాయిలో ఉన్నదంటే కాంగ్రెస్‌కు చెందిన రాష్ట్ర మంత్రులు, ఎంపీలు రాజీనామా డ్రామాకు సిద్ధపడాల్సివచ్చింది. పార్లమెంటులో గళం ఎత్తాల్సివచ్చింది. తెలంగాణ ఏర్పాటు కావాల్సిందేనని వాదించేవారు సైతం కాంగ్రెస్ అధిష్టానం వ్యవహరించిన తీరును తప్పుబట్టక తప్పడంలేదు. తీసుకున్న నిర్ణయం ఎంత న్యాయబద్ధమైనదనుకున్నా, తమ ప్రయోజనాలకు మరెంతగా ఉపయోగపడుతుందని లెక్కలేసుకున్నా... దాన్ని అమలుచేయడానికి పూనుకునేముందు ఒక పద్ధతిని పాటించాలని, ఆ ప్రక్రియలో అందరి సహాయసహకారాలూ తీసుకోవాలని ఆ పార్టీ పెద్దలు అనుకోలేదు. నిర్ణయాన్ని వ్యతిరేకించగల వర్గాల అభిప్రాయాలేమిటో తెలుసుకోవడానికి లేదా వారి అపార్థాలనూ, అపోహలనూ పోగొట్టడానికి ప్రయత్నించలేదు. ఒక ప్రజాస్వామ్య బద్ధమైన డిమాండుపై తమకు అలవాటైన కుట్రపూరిత మనస్తతత్వంతోనే వారు ఆలోచించారు. ప్రత్యేక రాష్ట్రం డిమాండు చేస్తున్నవారి మనోభావాలతో తమ స్వీయ ప్రయోజనాలను రంగరించి ఎవరూ అడగని ప్రతిపాదనలను కూడా తెరపైకి తీసుకురావడం వెనకున్నది ఈ కుట్ర బుద్ధే. తెలంగాణ సమస్యపై భిన్న పార్టీలు తమ తమ అభిప్రాయాలు చెప్పాయని, అదేవిధంగా తామూ చెప్పామని అంటున్న కాంగ్రెస్ నేతల వాదన నయవంచన తప్ప మరేమీ కాదు. కాంగ్రెస్ తన అభిప్రాయాన్ని చెప్పి ఊరుకోలేదు. అధికారంలో ఉన్నది గనుక ఆ అభిప్రాయానికి అనుగుణంగా తదుపరి చర్యలకు ఉపక్రమించింది. అసలు అధికారికంగా అభిప్రాయాన్ని వెల్లడించడానికి ముందే తాము ఏం చేయబోతున్నారో వారు లీకులు ఇచ్చారు. తమ అత్యున్నత నిర్ణాయక సంఘం సీడబ్ల్యూసీలో చర్చించకముందే, యూపీఏలో తమ భాగస్వామ్యపక్షాల వారితో మాట్లాడకముందే ఆ పార్టీ పెద్దలు ఒక నిర్ణయానికి వచ్చేశారని... ఆ రెండు సమావేశాలూ లాంఛనప్రాయమైన ముద్రలు వేయించుకోవడానికేనని పత్రికలు చదువుతున్నవారికి, చానెళ్లు చూస్తున్నవారికి అర్ధమైంది. ఇక్కడి నాయకులకు ఆ మాత్రం విలువైనా ఇవ్వలేదు. ఆత్మగౌరవం ఉన్న నాయకులైతే, అధికారంపై మమకారం లేనివారే అయితే వీరందరూ ఆ క్షణంలోనే పదవులనుంచి వైదొలగేవారు. అలా చేయలేకపోయారు సరిగదా... ఆంటోనీ కమిటీకి అలవిమాలిన ప్రాముఖ్యతనిస్తూ ఇప్పుడు ప్రకటనలు గుప్పిస్తున్నారు. విభజన ప్రక్రియ ఆగిపోయిందట. ఆంటోనీ కమిటీ నివేదిక వచ్చేవరకూ తదుపరి చర్యలు ఉండవట. ఆ కమిటీకి ఎన్జీవోలు, విద్యార్థులు, ఇతర పార్టీలవారూ అభిప్రాయాలు చెప్పవచ్చునట. ఇంతవరకూ వచ్చాక కూడా తమ కబుర్లతో ఇంకా జనాన్ని మభ్యపెట్టగలమని వారనుకుంటున్నారు. ఆంటోనీ కమిటీ మౌలికంగా కాంగ్రెస్ కమిటీ. ఆ కమిటీకి ‘హై పవర్’ అని విశేషణం తగిలించినంతమాత్రాన దానికి అధికార ప్రతిపత్తి రాదు. విభజనవల్ల సమస్యలున్నాయనుకునేవారు ప్రభుత్వంతో మాట్లాడాలని చూస్తారు. తమ మనోభావాలను అది పట్టించుకోవాలని ఆశిస్తారు. అది వినడం లేదనుకున్నప్పుడు దాని మెడలు వంచడానికి ప్రయత్నిస్తారు. అంతేతప్ప కాంగ్రెస్‌కు చెందిన కమిటీని కలవాల్సిన అవసరం ఉద్యమకారులకు ఏముంటుంది? కలిసి ఏమి మాట్లాడతారు? కొంతవరకూ కాంగ్రెస్ పార్టీకి అది ఉపయోగపడవచ్చు. ఉద్యమాల పర్యవసానంగా పార్టీకి ఉత్పన్నమైన సంకటాన్ని కాంగ్రెస్ శ్రేణులు దానికి వివరించడానికి ప్రయత్నించవచ్చు. లేదా రాయల తెలంగాణ వంటి తమ రహస్య అజెండాకు దీన్ని వేదికగా చేసుకోవచ్చు. ఈ పరిమిత ప్రయోజనాల కోసం పార్టీ పరంగా ఏర్పాటుచేసుకున్న కమిటీని లోకకల్యాణం కోసం ఆవిర్భవించిన సంస్థగా చిత్రించబోవడం నయవంచన. ఇంతకూ కమిటీలో ఉన్నవారికి విభజనానంతర పరిణామాలపై కొన్ని ప్రాంతాల్లో ఉన్న భయాలపైగానీ, మొత్తంగా ఈ రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యలపైగానీ అవగాహన ఉందనడానికి దాఖలాలు లేవు. అంతటి అవగాహన, శక్తి వీరికుంటే సీడబ్ల్యూసీలోనో, కోర్ కమిటీలోనో విభజన ప్రక్రియకు సంబంధించి మెరుగైన విధానం రూపుదిద్దుకునేది. ముఖ్యంగా గత నాలుగేళ్లలోనూ అన్ని వర్గాల వారితోనూ, అన్ని స్థాయిల్లోనూ చర్చించే ప్రజాస్వామిక ప్రక్రియ అమలయ్యేది. ఇదేమీ లేదు సరిగదా... రాయల తెలంగాణ వంటి ప్రతిపాదనలను తెరపైకి తెస్తూ అసలే ఆగ్రహంతో రగులుతున్న రాష్ట్రాన్ని మరింత అగ్నిగుండంగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నారు. సుదీర్ఘ చరిత్ర, ప్రత్యేక అస్తిత్వమూ కలిగిన రాయలసీమ ప్రాంత ప్రజలను ఇలాంటి ప్రతిపాదనలతో తాము అపహాస్యం చేస్తున్నామని, వారి మనోభావాలను గాయపరుస్తున్నామని కాంగ్రెస్ పెద్దలు మరిచి పోతున్నారు. అడిగింది తెలంగాణ అయితే, పనిలో పనిగా రాయలసీమను విడదీసేందుకు ఆ పార్టీ ప్రణాళికలు సిద్ధం చేసుకుని, అందులో భాగంగానే ఆంటోనీ కమిటీని ఏర్పాటు చేసిందని కాంగ్రెస్ పోకడలు తెలిసినవారందరూ సరిగానే అంచనా వేస్తున్నారు. ఇలాంటి చేష్టలవల్ల కాంగ్రెస్ మరింత అధోగతిపాలు కావడం తప్ప సాధించేదేమీ ఉండదు. కనీసం అవసానదశలోనైనా ఈ సంగతిని గ్రహించడం ఆ పార్టీ పెద్దల ఆరోగ్యానికి మంచిది.