'సోనియా 24 గంటల్లో ప్రధాని కాగలరు'
సోనియా గాంధీపై బీజేపీ నాయకురాలు సుష్మా స్వరాజ్ చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ తోసిపుచ్చింది. సుష్మా వ్యాఖ్యలు అపరిపక్వంగా ఉన్నాయని తిప్పికొట్టింది. తమ పార్టీ నిర్ణయిస్తే సోనియా రేపే ప్రధాని కాగలరని పేర్కొంది. ఆమెకు ఇతరుల ఆమోదం అవసరం లేదని స్పష్టం చేసింది.
సోనియా ప్రధాని మంత్రి కావాలని కోరుకుంటే ఆమెను ఎవరూ ఆపలేరని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి పీసీ చాకో అన్నారు. సోనియా తలచుకుంటే 24 గంటల్లో ప్రధాని కాగలరని చెప్పారు. దీనికి ఎవరి మద్దతు, ఆమోదం అవసరం లేదని ఆయన అన్నారు. ఎన్నోసార్లు ప్రధాని అయ్యే అవకాశం వచ్చినా సోనియా తృణప్రాయంగా వదులుకున్నారని పునరుద్ఘాటించారు.
సోనియా ప్రధాని కావడానికి తానిప్పటికీ వ్యతిరేకమేనని సుష్మా స్వరాజ్ నిన్న వ్యాఖ్యానించారు. ఆమె ప్రధాని అయితే గుండు కొట్టించుకుంటానని 2004 మే నెలలో చేసిన వ్యాఖ్యలకు తాను ఇప్పటికీ చింతించేది లేదని చెప్పారు. సోనియా మన దేశానికి ఇందిరకు కోడలుగాను, రాజీవ్ గాంధీకి భార్యగాను వచ్చారని.. అందువల్ల తమ ప్రేమాభిమానాలు ఆమెపట్ల ఉంటాయని సుష్మా అన్నారు. కాంగ్రెస్ అధినేత్రిగా కూడా ఆమెను గౌరవిస్తామని, కానీ దేశానికి ప్రధాని అవుతానంటే మాత్రం తాను అంగీకరించేది లేదని స్పష్టం చేశారు.