నాటకాలాడటంలో సుష్మా నేర్పరి: సోనియా గాంధీ
న్యూఢిల్లీ: తమ పార్టీకి చెందిన 25 మంది ఎంపీల సస్పెన్షన్లను నిరసిస్తూ గడిచిన నాలుగు రోజులుగా ఆందోళనలు నిర్వహిస్తోన్న కాంగ్రెస్ పార్టీ శుక్రవారం మరింత దూకుడు పెంచింది. ఈ రోజు ఉదయం పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద ఆ పార్టీ ఎంపీలు మరోసారి నిరసన దీక్షకు దిగారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ.. కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ పై తీవ్ర స్వరంతో, అనూహ్యరీతిలో విరుచుకుపడ్డారు.
సుష్మా స్వరాజ్ నాటకాలాడటంలో నేర్పరి అని దుయ్యబట్టారు. 'ఒకవేళ నేనే గనుక సుష్మా స్థానంలో ఉండి ఉండేదుంటే ఆపదలో ఉన్నవారికి తప్పక సహాయం చేసేదాన్ని.. అయితే చట్టపరిధిని మాత్రం మీరేదాన్ని కాదు' అని సోనియా అన్నారు. కేవలం మానవతా దృక్పథంతోనే లలిత్ మోదీకి సహాయం చేశానని, నా స్థానంలో మీరున్నా ఇలానే చేసేవారన్న సుష్మా వ్యాఖ్యలకు కౌంటర్గా సోనియా ఈ కామెంట్లు చేయడం గమనార్హం.
లలిత్ గేట్, వ్యాపం కుంభకోణంలో ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర మంత్రి సుష్మాస్వరాజ్, బీజేపీ మంత్రులు వసుంధర రాజే, శివారాజ్ సింగ్ చౌహాన్ లు రాజీనామా చేయాల్సిందేనని పట్టుబట్టిన కాంగ్రెస్ పార్లమెంట్ సమావేశాలను అడ్డుకోవడం, ప్రతిగా స్పీకర్ సుమిత్రా మహాజన్ 25 మంది కాంగ్రెస్ సభ్యులను సస్సెండ్ చేయడం తెలిసిందే. సదరు ఆరోపితులు రాజీనామాలు చేసేంతవరకు తమ నిరసన కొనసాగిస్తునే ఉంటామని కాంగ్రెస్ స్పష్టం చేసింది.