మాటలన్నీ తూటాలే! | Sushma Swaraj played A key role from the student stage | Sakshi
Sakshi News home page

మాటలన్నీ తూటాలే!

Published Wed, Aug 7 2019 2:58 AM | Last Updated on Wed, Aug 7 2019 9:41 AM

Sushma Swaraj played A key role from the student stage - Sakshi

సుష్మా స్వరాజ్‌ నిలుచుంటే నిండా ఐదగుడుల ఎత్తు కూడా ఉండరు. ఒక అంగుళం తక్కువే ఉంటారు. కానీ రాజకీయాల్లో, వ్యక్తిత్వంలో ఆమె శిఖరమంత ఎత్తుకు ఎదిగిపోయారు. 67 ఏళ్ల వయసులో... దాదాపు నాలుగున్నర దశాబ్దాలు ప్రజా జీవితంలోనే!!. 1970లలో హరియాణా అసెంబ్లీ నుంచి మొదలైన ప్రజాజీవితం... అంచెలంచెలుగా ఆమెను విదేశాంగ మంత్రి స్థాయికి చేర్చింది. 

సుష్మా రాజకీయ మూలాలు కుటుంబం నుంచే మొదలయ్యాయని చెప్పాలి. తల్లిదండ్రులు వాస్తవంగా పాకిస్థాన్‌లోని లాహోర్‌ ప్రాంతంలో పుట్టినా... దేశ విభజన సమయంలో హరియాణాకు వచ్చేశారు. తండ్రి హర్‌దేవ్‌ శర్మ ఆరెస్సెస్‌ కార్యకర్త. సుష్మ కూడా చదువుకునేటప్పుడే అఖిలభారత విద్యార్థి పరిషత్‌లో చేరారు. ఎమర్జెన్సీ తరవాత పూర్తిస్థాయి రాజకీయాల్లోకి ప్రవేశించారు. 1998లో ఆమె తొలిసారి ఢిల్లీ సీఎంగా పగ్గాలు చేపట్టారు. 52 రోజులు మాత్రమే కొనసాగినా.. ఢిల్లీకి తొలి మహిళా ముఖ్యమంత్రిగా తన ముద్రవేశారు. 

సినిమాలకు ఊపిరి... 
1999లో వాజ్‌పేయి కేబినెట్లో కేంద్ర సమాచార, ప్రసార శాఖల మంత్రిగా ఉన్నపుడు సుష్మా కీలక నిర్ణయం తీసుకున్నారు. సినిమా నిర్మాణానికి పరిశ్రమ స్థాయి కల్పించారు. దీంతో సినిమాలకు బ్యాంకు రుణాలు తీసుకోవటం సులభమయింది. అప్పటిదాకా ఫైనాన్స్‌ కోసం అండర్‌వరల్డ్‌పై భారీగా ఆధారపడిన సినిమా రంగం... ఈ నిర్ణయంతో కొత్త టర్న్‌ తీసుకుంది. ఫైనాన్షియల్‌ కంపెనీలు ఈ రంగంలోకి రావటానికి మార్గం సుగమమయింది.   

‘డిజిటల్‌ డిప్లొమసీ’.... 
2014 నుంచీ సుష్మా స్వరాజ్‌ విదేశాంగ మంత్రిగా కొనసాగుతున్నారు. ఈ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచీ ఆమె సమాచారాన్ని అందరికీ చేరవేయటానికి సామాజిక మాధ్యమం ‘ట్విటర్‌’ను ప్రధాన వేదికగా చేసుకున్నారు. ప్రతి అంశాన్నీ ట్వీట్‌ చేయటంతో ఆమెకు ట్విటర్‌లో ఏకంగా 1.3 కోట్ల మంది ఫాలోవర్లు ఏర్పడ్డారు. ఎవరైనా సహాయం అడిగితే ట్విటర్‌ ద్వారా వెంటనే స్పందించేవారు. ఏ సమయంలోనైనా ట్విటర్లో అందుబాటులో ఉండే నేతగా సామాజిక మాధ్యమాల్లో ఆమెకు పేరుంది. అందుకే వాషింగ్టన్‌ పోస్ట్‌ ఈమెకు ‘సూపర్‌ మామ్‌’ ట్యాగ్‌ కూడా తగిలించింది.

ప్రజా జీవితంలోనే నాలుగు దశాబ్దాలు
పుట్టిన తేదీ: ఫిబ్రవరి 14, 1952 
తల్లిదండ్రులు: హర్దేవ్‌ శర్మ, లక్ష్మీదేవి 
పుట్టినూరు: హరియాణాలోని అంబాలా కంటోన్మెంట్‌ 
చదువు: బీఏ – సనాతన్‌ ధర్మ కాలేజి, అంబాలా 
ఎల్‌ఎల్‌బీ – పంజాబ్‌ యూనివర్సిటీ  
భర్త: స్వరాజ్‌ కౌశల్‌ (1975లో వివాహం) 
సంతానం: ఒక కుమార్తె 
వృత్తి: సుప్రీంకోర్టు లాయర్‌ 
రాజకీయం: మూడుసార్లు ఎమ్మెల్యే. ఏడు సార్లు ఎంపీ (1990, 2000, 2006లో రాజ్యసభ, 1996, 1998, 2009, 2014లో లోక్‌సభ)  
- భర్త స్వరాజ్‌ కౌశల్‌ పిన్న వయస్సులోనే గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టి రికార్డు సృష్టించగా, హరియాణా కేబినెట్‌లో (1977– 82, 1987–90) అతిపిన్న వయస్కురాలైన మంత్రిగా సుష్మా బాధ్యతలు చేపట్టారు. అందుకే ఈ దంపతులు విశిష్ట జంటగా లిమ్కాబుక్‌ రికార్డుల్లో స్థానం సంపాదించారు. 
ఢిల్లీ ముఖ్యమంత్రిగా అక్టోబర్‌ 13, 1998 నుంచి డిసెంబర్‌ 3, 1998 వరకు పనిచేశారు. 
1998లో కేంద్ర సమాచార, ప్రసార, టెలికమ్యూనికేషన్‌ శాఖలకు మంత్రిగా ఉన్నారు. 
2000– 20003 సంవత్సరాల్లో కేంద్ర సమాచార, ప్రసార శాఖలకు మంత్రిగా 
2003–2004 కాలంలో ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. 
2009లో లోక్‌సభలో బీజేపీ పక్ష నేతగా వ్యవహరించారు. 
2014– 2019 వరకు విదేశాంగ శాఖ మంత్రిగా ఉన్నారు. 
పంజాబ్‌ యూనివర్సిటీ నుంచి ఎస్‌సీసీ ఉత్తమ కేడెట్‌గా, ఉత్తమ విద్యార్థినిగా మూడేళ్లపాటు ఎంపికయి గోల్డ్‌ మెడల్‌ సాధించారు. వివిధ స్థాయీసంఘాలు, పార్లమెంట్‌ కమిటీల్లో కీలక సభ్యురాలిగా వ్యవహరించారు. అనేక సామాజిక, సాంస్కృతిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. వివిధ హోదాల్లో ఆమె 18 దేశాల్లో పర్యటించారు. హరియాణా అసెంబ్లీ ఉత్తమ స్పీకర్‌గా మూడుపర్యాయాలు ఎంపికయ్యారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement