నాటకాలాడడంలో నేర్పరి
సుష్మా స్వరాజ్‌పై సోనియా గాంధీ ధ్వజం
* లలిత్ మోదీ ఎంత డబ్బిచ్చాడో చెప్పాలన్న రాహుల్
న్యూఢిల్లీ: లలిత్ మోదీ వివాదంపై విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ వివరణ ఇచ్చినప్పటికీ ఆమెపై కాంగ్రెస్ తన దాడిని ఆపలేదు. సుష్మ వివరణను కాంగ్రెస్ చీఫ్ సోనియాగాంధీ తోసిపుచ్చారు. ఆమెపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. సుష్మ నాటకాలాడుతున్నారని ధ్వజమెత్తారు. మరోవైపు రాహుల్‌గాంధీ సైతం తల్లి సోనియా బాటలో కొనసాగుతూ సుష్మపె మాటల దాడి కొనసాగించారు. ఒక దొంగతనం విషయంలో ఎలా వ్యవహరిస్తారో, అదేమాదిరిగా ఈ మొత్తం వ్యవహారాన్ని రహస్యంగా ఉంచారని ధ్వజమెత్తారు.
తమ పార్టీ ఎంపీల సస్పెన్షన్‌ను నిరసిస్తూ పార్లమెంటు ఆవరణలో కాంగ్రెస్ నేతలు, ఆ పార్టీ ఎంపీలు శుక్రవారం కూడా పార్లమెంటు ఆవరణలో తమ ఆందోళన కొనసాగించారు. మీడియాతో సోనియా మాట్లాడుతూ సుష్మ నాటకాలాడుతున్నారని, ఆమె అందులో నేర్పరి అంటూ విమర్శించారు. ఒకవేళ తానే కనుక సుష్మ స్థానంలో ఉండి ఉంటే.. ఆపదలో ఉన్న మహిళకు తప్పక సహాయం చేసేదాన్నని, అదే సమయంలో చట్టపరిధిని మాత్రం అతిక్రమించేదాన్ని కాదని అన్నారు.
కేవలం మానవతా దృక్పథంతో లలిత్‌కు సాయం చేశానని, తన స్థానంలో మీరున్నా ఇలాగే చేసేవారన్న సుష్మ వ్యాఖ్యలకు ప్రతిగా సోనియా ఈ వ్యాఖ్యలు చేశారు. రాహుల్ మాట్లాడుతూ.. లలిత్ నుంచి సుష్మ కుటుంబం ఎంత సొమ్ము పొందారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారానికి సంబంధించి తన మంత్రిత్వశాఖలో, తన పేషీలో కూడా సుష్మ ఎవరికీ ఏమీ చెప్పలేదని, అంత గోప్యత ఎందుకని ప్రశ్నించారు.
లలిత్ జైలు పాలవకుండా చూసేందుకోసం తన కుటుంబానికి, తన కుమార్తెకు, తన భర్తకు ఎంత ముట్టజెప్పారో సుష్మ చెప్పాలని డిమాండ్ చేశారు. తన స్థానంలో సోనియా ఉంటే ఏం చేసేవారన్న సుష్మ మాటల్ని రాహుల్ ప్రస్తావిస్తూ.. తన తల్లి ఆమెలా చట్ట వ్యతిరేకమైన పని చేసేవారు కాదన్నారు.
సోనియా, రాహుల్‌ల వ్యాఖ్యలను తిప్పికొట్టిన బీజేపీ..
సుష్మపై సోనియా, రాహుల్ చేసిన వ్యాఖ్యలను బీజేపీ తిప్పికొట్టింది. దీనిపై కేంద్రమంత్రి స్మృతి ఇరానీ ప్రతిస్పందిస్తూ.. సుష్మపై సోనియా చేసిన వ్యాఖ్యలు పార్లమెంటు గౌరవాన్ని తగ్గిస్తాయని ఆమె అన్నారు. లలిత్ మోదీ నుంచి సుష్మ కుటుంబం డబ్బు తీసుకున్నారన్న రాహుల్ ఆరోపణలపై ఆమె మండిపడ్డారు. సామాన్య కుటుంబాలకు చెందినవారిలో కుటుంబ సభ్యులంతా జీవనం కోసం తమ వంతుగా కష్టపడి సంపాదించుకోవాలని, అయితే ఇందుకు గాంధీ కుటుంబం అతీతమని స్మృతి ఇరానీ వ్యాఖ్యానించారు.
‘సాధారణ కుటుంబం నుంచి వచ్చిన ఓ మహిళ సమాజంలోనేగాక, ఆర్థికపరంగా నిలదొక్కుకునేందుకు ఎంతో కష్టపడాల్సి ఉంటుందన్నది దేశ ప్రజలందరికీ తెలుసు. ఆయా మహిళల పిల్లలు సైతం తమ వంతుగా కష్టపడడం అంతా చూస్తున్నదే. అయితే గాంధీ కుటుంబం ఇందుకు అతీతం. తమ జీవనంకోసం వారు కష్టపడాల్సిన అవసరం లేదాయె’ అని ఆమె వ్యాఖ్యానించారు.