ఆప్‌తో కాంగ్రెస్‌ ‘టు బీ నాట్‌ టు బీ’ | Congress Reviewing Possibility Of Alliance With AAP | Sakshi
Sakshi News home page

ఆప్‌తో కాంగ్రెస్‌ ‘టు బీ నాట్‌ టు బీ’

Published Wed, Mar 20 2019 6:48 PM | Last Updated on Wed, Mar 20 2019 6:48 PM

Congress Reviewing Possibility Of Alliance With AAP - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ఢిల్లీలోని ఏడు లోక్‌సభ స్థానాలకు ఆమ్‌ ఆద్మీ పార్టీ, బీజేపీ తమ అభ్యర్థులను ప్రకటించడమే కాకుండా వారి తరఫున ప్రచారాన్ని కూడా ప్రారంభించాయి. ఆప్‌తో పొత్తు పెట్టుకునే విశయమై ‘టు బీ నాట్‌ టు బీ’ అన్న సందిగ్ధంలో కాంగ్రెస్‌ పార్టీ ఇప్పటికీ కొట్టు మిట్టాడుతుండడంతో అన్నింటా వెనకబడి పోయింది. ఒంటరిగా పోటీ చేయాలా, లేదా ఇంక తేలలేదని, ఈ విషయంలో పార్టీ అధిష్టానం నుంచి గ్రీన్‌ సిగ్నల్‌ కోసం నిరీక్షస్తున్నామని ఢిల్లీ కాంగ్రెస్‌ పార్టీ వ్యవహారాలు చూస్తున్న పార్టీ సీనియర్‌ నాయకుడు పీసీ చాకో మీడియాకు తెలిపారు.

ఎన్నికల షెడ్యూల్‌ను ఇప్పటికే ప్రకటించినందున ఈ విషయంలో ఎక్కువ కాలం తాత్సారం చేయలేమని, రెండు, మూడు రోజుల్లోనే కచ్చితమైన నిర్ణయం తీసుకొని ముందుకు సాగుతామని ఆయన చెప్పారు. అయితే ఏ నిర్ణయం తీసుకోవాలన్నా, రాహుల్‌ గాంధీయే తీసుకోవాలని ఆయన అన్నారు. ఢిల్లీకి ఆరవ విడత కింద మే 12వ తేదీన ఎన్నికలు జరుగుతున్న విషయం తెల్సిందే. బీజేపీని ఓడించాలంటూ ఉమ్మడిగా పోలీ చేయాల్సిన అవసరం ఉందంటూ కాంగ్రెస్‌ పార్టీకి చెప్పి, చెప్పి అలసిపోయానని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రివాల్‌ ఫిబ్రవరి 21వ తేదీన స్పష్టం చేశారు. తమతో పొత్తు పెట్టుకునే విషయమై కేజ్రివాల్‌ ఎన్నడూ మాట్లాడలేదని మాజీ ముఖ్యమంత్రి, ఢిల్లీ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు షీలా దీక్షిత్‌ అదే రోజు ప్రకటించారు.

ఆ తర్వాత ఆప్‌ ఢిల్లీలోని ఏడు లోక్‌సభ సీట్లకుగాను ఆరు సీట్లకు అభ్యర్థులను మార్చి 2వ తేదీన ప్రకటించింది. పొత్తు కుదరకపోవడం వల్లనే తాను ఆరు సీట్లకు అభ్యర్థులను ప్రకటించాల్సి వచ్చిందని కేజ్రీవాల్‌ చెప్పుకున్నారు. తాము ఢిల్లీలో ఒంటరిగానే పోటీ చేస్తామని, రాహుల్‌ గాంధీ సమక్షంలోనే ఈ నిర్ణయం తీసుకున్నాం కనుక ఇదే తుది నిర్ణయమంటూ మార్చి ఐదవ లేదీన షీలా దీక్షిత్‌ ప్రకటించారు. అయినప్పటికీ ఆప్‌తో పొత్తు పెట్టుకోవాలా, లేదా ? అన్న అంశంపై మార్చి 9వ తేదీన సోనియా గాంధీని కలసుకొని షీలా దీక్షిత్‌ చర్చలు జరిపారు. ఆ తర్వాత రెండు రోజులకు ఢిల్లీలో పార్టీ కార్యకర్తలు, మద్దతుదారులతో రాహుల్‌ గాంధీ మాట్లాడుతూ కూడా పొత్తు ఉండదని సూచించారు.

ఆప్‌తో పొత్తు పెట్టుకోవాలా, లేదా అన్న విషయంలో ఢిల్లీలోని 52 వేల కార్యకర్తల అభిప్రాయాలను తెలియజేయాలని కోరుతూ ‘శక్తి’ అనే యాప్‌ ద్వారా సందేశాన్ని కాంగ్రెస్‌ పంపించింది. దాని ఫలితం ఏమిటో వెలుగులోకి రాలేదు. మార్చి 17వ తేదీన ఆప్‌ చివరి ఏడో సీటుకు కూడా న్యాయవాది బల్బీర్‌ సింగ్‌ జాఖడ్‌ పేరును ప్రకటించారు. పొత్తు కోసం ఇప్పటికీ చర్చలు కొనసాగుతున్నందున తాము ఎన్నికల ప్రచారాన్ని జరపలేక పోతున్నామని పార్టీ ఎన్నికల ప్రచారం కమిటీ చీఫ్‌ సుమేశ్‌ శౌకీన్‌ తెలిపారు. మార్చి 17వ తేదీ నుంచి ఎన్నికల ప్రచారాన్ని తీవ్రతరం చేస్తామని శౌకీన్‌ చెప్పారు. అంతటి ప్రచార తీవ్రత ఏమీ కనిపించడం లేదు. అభ్యర్థి లేకుండా ప్రచారం చేస్తే అది ఓటర్లను అంతగా ఆకట్టుకోలేదు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement