సాక్షి, న్యూఢిల్లీ: అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ పార్టీలో అంతర్గత చిచ్చుకు కారణమవుతున్నాయి. తాజా ఎన్నికల్లో పార్టీ ఘోర పరాభవానికి నైతిక బాధ్యత వహిస్తూ ఢిల్లీ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ పీసీ చాకో తన పదవికి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీ, సీనియర్ నేత అయిన చాకో మాట్లాడుతూ.. ఢిల్లీలో కాంగ్రెస్ పతనానికి మాజీ సీఎం షీలా దీక్షిత్ కారణమంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
2013లో షీలా దీక్షిత్ ఢిల్లీ సీఎంగా ఉన్నప్పుడే కాంగ్రెస్ పతనం మొదలయ్యిందని ఆయన వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ఓటు బ్యాంకును పూర్తిగా ఆమ్ ఆద్మీ పార్టీ సొంతం చేసుకుందన్నారు. పోయిన ఓటు బ్యాంకు తిరిగి పార్టీకి రాలేదని, ఆ ఓటు బ్యాంకు ఇప్పటికీ ఆప్‌తో ఉందని ఆయన పేర్కొన్నారు. పీసీ వ్యాఖ్యలపై స్పందించిన మహారాష్ట్ర కాంగ్రెస్ నేత మిలింద్ దేవర చాకో వ్యాఖ్యలతో విభేదించారు. నిజానికి షీలా అధికారంలో ఉండగా కాంగ్రెస్ ఓ వెలుగు వెలిగిందని మిలింద్ దేవర అభిప్రాయపడ్డారు. (ఆమ్ ఆద్మీ అందగాడు గెలిచేశాడు..!)
ఆమె మరణాంతరం ఢిల్లీలో పార్టీ ఓటమికి షీలాను నిందించడం సరికాదన్నారు. ఆమె పార్టీకి, ఢిల్లీ ప్రజలకు తన జీవితాన్ని అంకితం చేశారని ఆయన పేర్కొన్నారు. కాగామొత్తం 70 స్థానాలకు జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ 62 స్థానాల్లో విజయం సాధించి మూడో సారి అధికార పగ్గాలు చేపట్టగా.. బీజేపీ 8 స్థానాలతో సరిపెట్టుకుంది. కాంగ్రెస్ పార్టీ 2015 మాదిరిగానే ఖాతా తెరవలేక ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది.
Comments
Please login to add a commentAdd a comment