గెలుపోటములతో సంబంధం లేకుండా ఎన్నికల ఫలితాలు వెలువడినప్పుడల్లా కాంగ్రెస్ పుట్టి మునుగుతోంది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన నాటినుంచి కాంగ్రెస్‌లో మళ్లీ భిన్న స్వరాలు కత్తులు దూసుకుంటున్నాయి. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కుమార్తె శర్మిష్ట ముఖర్జీతో మొదలుపెట్టి ఒక్కొక్కరే చేస్తున్న వ్యాఖ్యలు చివరకు పార్టీ అధ్యక్ష పదవి వైపు మళ్లాయి. ఢిల్లీలో కాంగ్రెస్‌కు ఘనమైన చరిత్రే వుంది. అక్కడ షీలా దీక్షిత్ నేతృత్వంలో ఆ పార్టీ వరసగా మూడు దఫాలు పాలించింది. అయితే 2013æనుంచి కాంగ్రెస్ క్షీణ దశ మొదలైంది. అక్కడే కాదు... దేశవ్యాప్తంగానే ఆ పార్టీ పరిస్థితి నానాటికీ తీసికట్టుగా మారింది. తాజాగా ఢిల్లీ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాక, బీజేపీ ఓటమిపై ట్వీట్ చేస్తూ ‘మోసకారులు, డంబాలు పలికేవారూ మట్టికరిచారు’ అనడంతోపాటు ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) విజయాన్ని కీర్తించిన కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి చిదంబరానికి శర్మిష్ట ఊహించని షాక్ ఇచ్చారు.
‘బాగాలేని రాష్ట్రాల్లో పార్టీని రద్దు చేసుకుని బీజేపీకి వ్యతిరేకంగా పోరాడే బాధ్యతను ఔట్ సోర్సింగ్‌కి ఇద్దామా?’అని నిలదీశారు. తనను జైలుపాలు చేసిన బీజేపీని గేలిచేయడానికి అవకాశం దొరికొందన్న సంబరమే తప్ప, పరాజయభారంతో ఖిన్నులైవున్న ఢిల్లీ కాంగ్రెస్ నేతల మనోభావాలను గాయపరుస్తానేమోనన్న ఆలోచన చిదంబరానికి లేకపోయింది. ఢిల్లీ అపజయం సాధారణమైనది కాదు. ఆ పార్టీకి ఇది వరసగా మూడో ఓటమి. ప్రతి ఎన్నికల్లోనూ ఆ పార్టీ అంతకు ముందుకన్నా క్షీణించిపోవడం ప్రస్ఫు టంగా కనబడుతోంది. అసెంబ్లీలో సున్నా చుట్టడం ఇది వరసగా రెండోసారి. ఈసారి ఓట్లు నాలుగు శాతం మించలేదు. కొన్ని పోలింగ్ కేంద్రాల్లో కాంగ్రెస్‌కు పడిన ఓట్లు ఒక శాతం కూడా లేవు! ఢిల్లీ పీసీసీకి లోగడ ఇన్‌చార్జిగా వున్న పీసీ చాకో ఢిల్లీ ఓటమికి చనిపోయిన షీలా దీక్షిత్‌ను తప్పుబడితే, మరో అధికార ప్రతినిధి పవన్ ఖేరా ఆమె హయాంలో ఎన్నడూ ఇంత హీన స్థితిలో లేదని జవాబిచ్చారు. ఇదంతా సద్దుమణగక ముందే ముంబై పీసీసీ చీఫ్ మిలింద్ దేవరా ఆప్‌ను, అరవింద్ కేజ్రీవాల్‌ను ఆకాశానికెత్తుతూ ట్వీట్ చేశారు. ఆ వెంటనే ఆయనకు అజయ్ మాకెన్ నిష్టూరంగా జవాబిచ్చారు.
కేవలం ఎన్నికల్లో ఓటమి సంభవించినప్పుడు మాత్రమే కాంగ్రెస్ ఇలా పరస్పర కలహాలతో బజారున పడుతున్నదని అనుకోవడానికి లేదు. ఎన్నికల్లో ఘన విజయం సాధించిన మధ్యప్రదేశ్‌లో కూడా పార్టీ పరిస్థితి బాగులేదు. అక్కడ ముఖ్యమంత్రి కమల్‌నాథ్‌కూ, ఆ పదవి ఆశించి భంగపడిన జ్యోతిరాదిత్య సింధియాకూ మధ్య పచ్చగడ్డేస్తే భగ్గుమంటోంది. ఎన్నికల్లో ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చకపోతే నిరసన ఉద్యమం ప్రారంభిస్తానని జ్యోతిరాదిత్య హెచ్చరించడం, అలా చేయమ నండి చూద్దామంటూ కమల్‌నాథ్ స్పందించడం ఆసక్తిదాయకంగా మారింది. వారిద్దరిమధ్యా రాజీ కుదర్చడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని చెబుతున్నారు. పంజాబ్‌లో గత నెల పుట్టిన తుపాను పర్యవసానంగా పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ పీసీసీని, జిల్లా కమిటీలను రద్దు చేశారు. ప్రభుత్వానికీ, పార్టీకీ మధ్య సమన్వయం కోసం 11మందితో ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఇలా సమస్య తలెత్తినప్పుడల్లా ఏదో ఒకటి చేశామని చెప్పుకోవడానికి తప్ప, మొత్తంగా పార్టీని ఏకతాటిపై నడిపించగల సామర్థ్యం అధినాయకత్వానికి లేకుండాపోయింది. కనుకనే ఈ వివాదం చివరకు కాంగ్రెస్ అధ్యక్ష పదవివైపు మళ్లింది. నాయకత్వ లేమిని పార్టీ సరిదిద్దుకోవాలంటూ ఎంపీ శశి థరూర్ ఇచ్చిన పిలుపు పెను ప్రకంపనలు సృష్టించింది.
అంతక్రితం నాయకత్వం తలెత్తిన ప్రశ్నకు సరైన జవాబును అన్వేషించడం పార్టీకున్న పెద్ద సవాలని షీలా దీక్షిత్ కుమారుడు సందీప్ దీక్షిత్ చేసిన ప్రకటనపై ఆయన స్పందించారు. మరో సీనియర్ నాయకుడు వీరప్ప మొయిలీ వీరితో గొంతు కలిపి పార్టీ ‘చింతన్ బైఠక్’ జరపాలని, సంస్థాగత జడత్వాన్ని వదిలించుకోవాలని పిలుపు నిచ్చారు. అయితే కాంగ్రెస్‌కు రాహుల్‌గాంధీ తిరుగులేని నాయకుడని, ఎవరినో ఎన్నుకోవాల్సిన అవసరం పార్టీకి లేదని ఆయన మద్దతుదార్లు ఒకటికి రెండుసార్లు చెబుతున్నారంటే పార్టీలో నెలకొన్న పరిస్థితేమిటో అర్థం చేసుకోవచ్చు. కాంగ్రెస్ అధ్యక్ష పదవి ప్రస్తుతానికి ఖాళీగా లేదని, సోనియా గాంధీ తాత్కాలిక అధ్యక్షురాలిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారని వీరందరూ మరిచిపోతు న్నారు. పైగా ఫలానా సమయం వరకే ఈ పదవిలో ఉంటానని ఆమె గడువేమీ విధించలేదు కూడా. అయినా అధ్యక్ష పదవి గురించి బాహాటంగా అందరూ మాట్లాడుతుంటే, ఎవరికి వారుగా ఇష్టాను సారం వ్యాఖ్యలు చేస్తుంటే వారిని బతిమాలి నోరు మూయించడం తప్ప పార్టీ నాయకత్వం మరేమీ చేయలేకపోతోంది.
కాంగ్రెస్‌కు గెలుపోటములు కొత్తేమీ కాదు. అధికారానికి దూరంగా ఉండటం గతంలోనూ జరిగింది. వేరే నేతలు పార్టీకి సారథ్యం వహించినప్పుడు అప్పుడప్పుడు సమస్యలు తలెత్తినా, గాంధీ–నెహ్రూ కుటుంబీకులున్నప్పుడు ఇలా ఎవరికి తోచినట్టు వారు మాట్లాడటం కనబడదు. పార్టీ ఎదుగుదలను కాంక్షించి చిత్తశుద్ధితో పనిచేసేవారిని శంకించి దూరం పెట్టడం, వారికి వ్యతిరేకంగా తమ భజనపరులతో ముఠాలు కట్టించి కలహాలు రేపడం పార్టీ నాయకత్వానికి అలవాటుగా మారాక పార్టీ క్షీణ దశ మొదలైంది. ఒకదాని వెనక ఒకటిగా వచ్చే వివిధ రాష్ట్రాల ఎన్నికలతో పార్టీ మరింత బలహీనపడుతోంది. ఈ ఏడాది రెండు ప్రధాన రాష్ట్రాలైన పశ్చిమ బెంగాల్, బిహార్‌లలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఆ రెండుచోట్లా పార్టీ స్థితి అంతంతమాత్రమే. బిహార్‌లో ఆర్జేడీతో కూటమి కడితే కొద్దో గొప్పో వస్తాయనుకున్నా, బెంగాల్‌లో నిరాశ తప్పదు. ఇప్పటికైనా వైఫల్యాలు ఎందుకొచ్చిపడుతున్నాయో చిత్తశుద్ధితో సమీక్షించుకుని, సమర్థులైనవారికి బాధ్యతలు అప్పగిస్తే పార్టీ సంస్థాగతంగా బలపడుతుంది. ఆ తర్వాత ప్రజల విశ్వాసాన్ని పొందడం ఏదో మేర సాధ్యమవుతుంది.
Comments
Please login to add a commentAdd a comment