త్రిముఖ పోరులో పీఠం ఎవరిది..? | Triangular Fight In Delhi Assembly Elections | Sakshi
Sakshi News home page

త్రిముఖ పోరులో పీఠం ఎవరిది..?

Published Mon, Jan 6 2020 4:57 PM | Last Updated on Mon, Jan 6 2020 7:40 PM

Triangular Fight In Delhi Assembly Elections - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీ అసెంబ్లీ పోరుకు షెడ్యూల్‌ విడుదల కావడంతో ఎన్నికలకు ప్రధాన పార్టీలు సమాయత్తం అవుతున్నాయి. మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు ఫిబ్రవరి 8న పోలింగ్‌ జరుగనున్న విషయం తెలిసిందే. దీంతో ఎన్నికల్లో గెలిచేందుకు వ్యూహాలు రచనకు నేతలు కసరత్తులు ప్రారంభించారు. షెడ్యూలు విడుదలైన మరుక్షణమే తామంతా పోరుకు సిద్ధంగా ఉన్నామంటూ ప్రకటించారు. ప్రధాని నరేంద్ర మోదీతో పాటు కీలక పార్టీ నేతలంతా ఇప్పటికే ప్రచారాన్ని ప్రారంభించారు. అధికార ఆమ్‌ఆద్మీ పార్టీ, బీజేపీ, కాంగ్రెస్‌ ఈ ఎన్నికల్లో  ప్రధానంగా పోటీపడుతున్నాయి. అవినీతిరహిత సమాజమే లక్ష్యంగా రాజకీయాల్లోకి అడుగుపెట్టిన ఆప్‌ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ ఎదుర్కొన్న తొలి ఎన్నికల్లోనే సంచలనం సృష్టించారు. 2015లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 70 స్థానాలకు గాను  ఏకంగా 67 స్థానాల్లో విజయం సాధించి చరిత్రలో నిలిచారు. అంతకుముందు ఏకదాటిగా 15 ఏళ్లు అధికారంలో ఉన్న గ్రాండ్‌ ఓల్డ్‌పార్టీ కాంగ్రెస్‌ కనీసం ఒక్కస్థానం కూడా గెలవలేకపోయింది. (మోగిన ఢిల్లీ అసెం‍బ్లీ ఎన్నికల నగారా)

సంక్షేమమా.. సంక్షోభమా?
ఇక అప్పటికే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కేవలం మూడు స్థానాలకే పరిమితమై అప్రతిష్ట మూటగట్టుకుంది. మాజీ ఐపీఎస్‌ అధికారిని కిరణ్‌భేడీని సీఎం అభ్యర్థిగా ప్రకటించినా.. కనీస ప్రభావం చూపలేకపోయింది. అయితే గడిచిన ఐదేళ్ల కాలంలో ఢిల్లీ వేదికగా అనేక రాజకీయ మార్పులు చోటుచేసుకున్నాయి. గత ఎన్నికల సమయంలో కేజ్రీవాల్‌తో ఉన్న పలువురు కీలక నేతలు ప్రభుత్వం ఏర్పడిన కొంత కాలానికే ఆయనతో విభేదించారు. సీఎం వ్యవహారం శైలి నచ్చకనే తామంతా బయటకు వస్తున్నామనీ, బహిరంగ విమర్శలకు సైతం దిగారు. దీంతో ఆప్‌ కొంతకాలంపాటు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంది. సీనియర్‌ మహిళా నేత అల్కాలాంబ కూడా ఆప్‌కు ఇటీవల రాజీనామా చేసి, కాంగ్రెస్‌ గూటికి చేరారు. ఈ నేపథ్యంలోనే గత పార్లమెంట్‌ ఎన్నికల్లో ఆప్‌ తీవ్ర పరాజయం పాలైంది. మొత్తం ఏడు లోక్‌సభ స్థానాలను బీజేపీ క్లీన్‌స్వీప్‌ చేసింది. ఇవన్నీ కేజ్రీవాల్‌కు ఇబ్బందికర అంశాలే. అయితే సంక్షేమ పథకాల విషయంలో ప్రజల నుంచి తమకు పూర్తి మద్దతు ఉందని ఆప్‌ నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. రెండోసారి సైతం తామే అధికారంలోకి వస్తామని ధీమాగా ఉన్నారు.

ఈ సారైనా కాషాయాన్ని కరునిస్తుందా..?
వరుస రెండు పార్లమెంట్‌ ఎన్నికల్లో సంచలన విజయాలను నమోదు చేస్తూ వస్తున్న బీజేపీ ఢిల్లీ పీఠంపై కన్నేసింది. దాదాపు రెండు దశాబ్దాలకు పైగా దేశ రాజధానిలో అధికారానికి దూరంగా ఉన్న కమళనాధులు ఈసారి ఎలాగైనా విజయం సాధించాలని పట్టుదలతో ఉన్నారు. గత లోక్‌సభ ఎన్నికల ఫలితాలు ఇచ్చిన ఉత్సాహంతో దూసుకుపోతున్నారు. అయితే ఇటీవల దేశ వ్యాప్తంగా ఆందోళనకు కేంద్రబిందువులైన పలు వివాదాదస్పద చట్టాలు.. అధికార బీజేపీకి కొంచె ఇబ్బందికరంగా మారే అవకాశం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఎన్‌ఆర్‌సీ, సీఏఏపై ఢిల్లీ వేదికగా పెద్ద ఎత్తున ఆందోళన చోటుచేసుకున్న విషయం తెలిసిందే. అయితే ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్‌ షాల నాయకత్వం బీజేపీ నేతలకు అదనపు బలంగా పనిచేసే అవకాశం ఉంది. 

హస్తంలో ఆమెలేని లోటు..
వరుసగా మూడు సార్లు ఢిల్లీని పాలించిన కాంగ్రెస్‌ పార్టీ గత ఐదేళ్లుగా తీవ్ర గడ్డుపరిస్థితిని ఎదుర్కొంటోంది. నాయకత్వ లేమితో వరుస పరాజయాలను చవిచూస్తోంది. మొన్నటి వరకు ఢిల్లీ కాంగ్రెస్‌కు ప్రధాన దిక్కుగా ఉన్న మాజీ సీఎం షీలా దీక్షిత్‌ గత ఏడాది కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆమెలేని లోటు హస్తం నేతల్లో స్పష్టంగా కనిపిస్తోంది. అయితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలు తమకు అనుకూలంగా మారతాయని కాంగ్రెస్‌ నేతలు భావిస్తున్నారు. ఆప్‌, కాంగ్రెస్‌ కూటమిగా పోటీ చేస్తాయని ‍ బయట ప్రచారం జరుగుతున్నా.. నేతలు మాత్రం వీటికి కొట్టి పారేస్తున్నారు. ఏ పార్టీతోనూ పొత్తు ఉండదని ఇరు పార్టీలు ఇప్పటికే ప్రకటించాయి. దీంతో దేశ రాజధానిలో త్రిముఖ పోటీ తప్పదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే ప్రధాన పోటీ మాత్రం ఆప్‌, బీజేపీ మధ్యనే ఉంటుందని ఢిల్లీ వర్గాల సమాచారం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement