ఓటమికి రాహుల్ బాధ్యుడు కాదు: ఆంటోనీ
ఓటమికి రాహుల్ బాధ్యుడు కాదు: ఆంటోనీ
Published Sat, Aug 16 2014 1:24 AM | Last Updated on Mon, Oct 22 2018 9:16 PM
న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో పరాజయానికి రాహుల్‌గాంధీ బాధ్యుడు కాదంటూ తమ పార్టీ ఉపాధ్యక్షుడికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎ.కె. ఆంటోనీ బాసటగా నిలిచారు. రాబోయే రోజుల్లో సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ నేతృత్వంలో పార్టీ మళ్లీ పుంజుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో శుక్రవారం జెండావందనం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. పార్టీ ఓటమి కారణాల పరిశోధనపై తన నేతృత్వంలో ఏర్పాటైన కమిటీ రూపొందించిన నివేదికను ఆంటోనీ...గురువారం సోనియాకు సమర్పించారు. ఈ కమిటీ రాహుల్ నాయకత్వంపై ప్రశ్నలు లేవనెత్తిందని వచ్చిన వార్తలను ఆంటోనీ ఖండించారు.
పార్టీని బలహీనం చేయడానికి ఎవరో దుర్మార్గులు కావాలని పుకార్లు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. తమ పార్టీ ఘోర పరాజయానికి కారణాలు వేరే ఉన్నాయని చెప్పిన ఆయన.. ఆ కారణాలు ఏంటో బహిర్గత పరచలేదు. అయితే ప్రస్తుత నాయకత్వంలోనే కష్టకాలాన్ని అధిగమించి, పార్టీని పటిష్టపరిచి, పునర్వైభవం అందిపుచ్చుకుంటామని ఆంటోనీ ధీమా వ్యక్తం చేశారు. ప్రియాంకా గాంధీ ప్రధాన పాత్రపై మాట్లాడుతూ, ఆ విషయంలో ఇప్పటికే ప్రియాంక స్పష్టతనిచ్చారని, దానిపై తానింక చెప్పేది ఏమీ లేదన్నారు.
పార్టీ సంస్థాగత మార్పులపై తుది నిర్ణయం సోనియాదేనని మరో ప్రశ్నకు సమాధానమిచ్చారు. కమిటీలో మరో సభ్యుడు ముకుల్ వాస్నిక్ మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా 500 మంది నేతల అభిప్రాయాలు తీసుకున్నామని, వారిలో ఏ ఒక్కరు కూడా సోనియా, రాహుల్ నేతృత్వంపై ప్రశ్నలు లేవనెత్తలేదని తెలిపారు. ఆంటోనీ నేతృత్వంలోని ఆ కమిటీలో ముకుల్ వాస్నిక్, ఆర్‌సీ కుంతియా, అవినాశ్ పాండే సభ్యులన్న విషయం తెలిసిందే.
ఓటమిలో మీడియాకు పాత్ర ఉంది
తమ పార్టీ పరాజయంలో మీడియాకు కూడా పాత్ర ఉందని రాజ్యసభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ సీనియర్ నేత గులామ్ నబీ ఆజాద్ అన్నారు. ఆంటోనీ కమిటీ సమర్పించిన నివేదికలో.. మీడియా బీజేపీకి వత్తాసుపలికి, కాంగ్రెస్‌కు తక్కువగా కవరేజి ఇచ్చిందని పేర్కొన్నట్లు సమాచారం. మీడియాపై నిందలెలా వేస్తారని ఆజాద్‌ను ప్రశ్నించగా తమ ఓటమిలో మీడియా కూడా భాగస్వామి అన్నారు. గతంలో తాను మంత్రిగా ఉన్నపుడు గంటసేపు మీడియా సమావేశం ఏర్పాటు చేస్తే ఒక్క నిమిషం కూడా చానళ్లు ప్రసారం చేయలేదన్నారు.
Advertisement
Advertisement