సోనియా! సోనియా...రాహుల్ ఎక్కడ? | Sonia gandhi leads march, Rahul gandhi missing, Congress not amused | Sakshi
Sakshi News home page

సోనియా! సోనియా...రాహుల్ ఎక్కడ?

Published Wed, Mar 18 2015 4:33 PM | Last Updated on Mon, Oct 22 2018 9:16 PM

సోనియా! సోనియా...రాహుల్ ఎక్కడ? - Sakshi

సోనియా! సోనియా...రాహుల్ ఎక్కడ?

న్యూఢిల్లీ: గత లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయంతో నాయకత్వ కాడిని కిందపడేసి రాహుల్ పై భారంవేసి స్వీయ ప్రవాస జీవితంలోకి సోనియా గాంధీ వెళ్లిపోయారు. ఇలాంటి సంక్షోభ సమయంలో కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం వహించి పార్టీకి పునర్జీవం పోయాల్సిన పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సెలవుల పేరిట అడ్రస్ లేకుండా గల్లంతయ్యారు. పార్లమెంట్‌లోనూ, వెలుపల పార్టీకి సారథ్యం వహించేందుకు సరైన నాయకుడెవరంటూ పార్టీ తల్లడిల్లుతున్న సమయంలో హఠాత్తుగా సోనియా గాంధీ మళ్లీ కార్యరంగంలోకి దూకారు. కిందపడేసిన కాడిని భుజానేసుకొని పద..పదండంటూ పార్టీ నేతలను వెంబడేసుకొని పాదయాత్రలు ప్రారంభించారు.
 
బొగ్గు కేటాయింపుల కేసులో మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్‌కు కోర్టు సమన్లు జారీ చేయడంతో సోనియాలో మళ్లీ కదలిక వచ్చింది. ఇంతకాలం తమ తరఫున ప్రధాని పాత్రను పోషించిన మన్మోహన్‌కు అండగా నిలవాలని తలచిన తక్షణమే పార్టీ ప్రధాన కార్యాలయం నుంచి మన్మోహన్ సింగ్ నివాసం వరకు ర్యాలీని నిర్వహించి మన్మోహన్‌కు సంఘీభావం ప్రకటించారు. పార్లమెంట్‌లో భూ సేకరణ బిల్లుకు వ్యతిరేకంగా నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని ముప్పుతిప్పలు పెడుతున్న సోనియా గాంధీ ఆ బిల్లుకు వ్యతిరేకంగా మళ్లీ వీధుల్లోకి వచ్చారు. ఏకంగా సారూప్యతగల లౌకిక పార్టీలను కలుపుకొని రాష్ర్టపతి భవన్‌కు పాదయాత్ర నిర్వహించారు.
 
 కాంగ్రెస్ పార్టీకి అనుబంధంగా నడుస్తున్న ఎన్‌ఎస్‌యూఐ కార్యకర్తలు అత్యంత ఉత్సాహంగా ఈ ర్యాలీలో పాల్గొనడం విశేషం. పతానవస్థలోవున్న పార్టీని ముందుకు నడిపించడం సోనియాకు కొత్తేమి కాదు. 2003లో జరిగిన రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్ గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన ఘోర పరాజయం నుంచి పార్టీని అనతికాలంలోనే మేల్కొలిపారు. లౌకిక పార్టీలతో జతకట్టి 2004లో కేంద్రంలో యూపీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగారు.

పార్లమెంట్ సమావేశాల కీలక ఘట్టంలో పార్టీని ముందుండి నడిపించాల్సిన రాహుల్ గాంధీ కనిపించక కలవరపడుతున్న పార్టీకి మళ్లీ సోనియా గాంధీ పెద్ద దిక్కవడం పట్ల పార్టీ సీనియర్ నేతలతోపాటు జూనియర్ నేతలు సంతోషిస్తున్నారు. సోనియా....సోనియా... మీరే దిక్కు మొక్కు...అంటూ పలవరిస్తున్నారు. ఈ విషయం తెలిస్తే రాహుల్ గాంధీ పార్టీ జన జీవన స్రవంతిలోకి వస్తారా లేక ప్రస్తుతం ఎక్కడున్నారో అక్కడే ఉండిపోతారా ? అన్నది సగటు కాంగ్రెస్‌వాది ప్రశ్న.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement