
సాక్షి, హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీలో సోనియాగాంధీ పాత్ర మున్ముందు కూడా కొనసాగుతుందని పార్టీ సీనియర్ నేత ఎం.వీరప్పమొయిలీ స్పష్టం చేశారు. ప్రస్తుతం కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఉన్న సోనియాగాంధీ.. త్వరలోనే ఆ బాధ్యతలను ఉపాధ్యక్ష పదవిలో ఉన్న రాహుల్‌గాంధీకి అప్పగించేందుకు రంగం సిద్ధమయిన విషయం విదితమే. దీనిపై మొయిలీ మాట్లాడుతూ.. అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకుంటున్నప్పటికీ సోనియా పార్టీలో క్రియాశీలకంగా ఉంటారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి తల్లిగా కూడా సోనియా గాంధీ దాదాపు 19 ఏళ్లపాటు ఏఐసీసీ అధ్యక్ష బాధ్యతలు మోశారని గుర్తు చేశారు. ఇకపైనా ఆమె పార్టీకి దిశానిర్దేశం చేస్తారని తెలిపారు. దేశ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ మరింత నిర్ణయాత్మకంగా, చురుగ్గా వ్యవహరిస్తుందని పేర్కొన్నారు. 2019 ఎన్నికల్లో రాహుల్‌గాంధీ ప్రధానమంత్రి అభ్యర్థిగా ఉంటారని తెలిపారు.