
మొయిలీకి మొండి‘చేయి’?
స్థానిక ఎంపీ, కేంద్ర మంత్రి ఎం వీరప్ప మొయిలీకి చిక్కబళ్లాపురం లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయడానికి టికెట్ లభించదనే పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఆది నుంచి ఈయనకు ఈసారి టికెట్ దక్కే విషయమై స్థానికంగానే సొంత పార్టీలో ఉన్న నేతల్లోనే అనుమానాలున్నాయి.
అందుకు బలాన్ని చేకూరుస్తూ కాంగ్రెస్ విడుదల చేసిన తొలిజాబితాలో మొయిలీ పేరు లేక పోవడంతో ఆ అనుమానం మరింత బలపడింది. ఒక మాజీ ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రిగా కావలసినంత అనుభవంతో పాటు, వైఎస్‌ఆర్ హయాంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జిగా పనిచేసిన ‘ఘన త’ కలిగిన మొయిలీ పేరు ప్రకటించేందుకు హైకమాండ్ వెనుకా, ముందూ ఆలోచిస్తోందంటే పరిస్థితి ఇట్టే ఊహించవచ్చు. గత ఎన్నికల్లో మంగళూరు నుంచి చిక్కబళ్లాపురం వలస వచ్చిన ఈయన పై ఇక్కడి ప్రజలు అనేక ఆశలు పెట్టుకుని గెలిపించారు.
మొయిలీ గెలిస్తే కేంద్ర మంత్రి కావడం ఖాయమని, మంత్రి అయితే ఈ ప్రాంత ప్రజలకు ఏదో ఒకటి చేస్తారని గంపెడాశ పెట్టుకున్నారు. అయితే మొయిలీ గెలిచి కేంద్ర మంత్రి అయితే అయ్యారే కానీ.. సమస్యలు చెప్పుకోడానికి స్థానికులకు అందుబాటులో లేరు. ఇది చాలదన్నట్టు అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ సాగునీటి పథకాల అమలుపై పూటకోమాట చెబుతూ కాలం వెళ్లబుచ్చారు. ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తుండడంతో ఆగమేఘాలపై ఎత్తినహొళె పథకానికి వివాదాల నడుమ శంకుస్థాపన చేశారు.
పరమశివయ్య నివేదికను పక్కన పెట్టడం, ఎత్తిన హొళె పథకాన్ని వ్యతిరేకిస్తున్న రైతు సంఘాలు, పోరాట సంఘాలతో చర్చించి ఈ పథకంపై కనీసం అవగాహన కల్పించే దిశగా ఆలోచించకుండా ఒంటెత్తు పోకడలకు పోవడంతో మొయిలీ పట్ల స్థానికంగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. చిక్కబళ్లాపురం లోక్‌సభ పరిధిలో ఉన్న ఎనిమిది తాలూకాల్లో మొయిలీకి వ్యతిరేకంగా పూటకో నిరసన ప్రదర్శన జరిగింది. దీంతో కాంగ్రెస్ నేతలు మొయిలీని సమర్థించుకోవడానికి కష్టంగా తయారైంది. ఒక దశలో కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలే ఈసారికి మొయిలీ కాకుండా మరొకరైతే బాగుంటుందనే అభిప్రాయంతో ఉన్నారని తెలుస్తోంది.
చిరంజీవి పోటీ?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన సమయంలో సీమాంధ్రలో కావలసినంత వ్యతిరేకతను కూడగట్టుకున్న కేంద్ర మంత్రి చిరంజీవి పేరు ప్రస్తుతం జోరుగా వినిపిస్తోంది. చిరంజీవి సీమాంధ్రలో ఎక్కడి న ుంచి పోటీ చేసినా డిపాజిట్లు కూడా దక్కించుకోరనే విషయం జగమెరిగిన సత్యం. దీంతో ఇక్కడ ఆయనపై ఉన్న సినీ అభిమానాన్ని ఓట్లుగా మలచుకొనేలా హైకమాండ్ ఆలోచిస్తోందని తెలుస్తోంది. ఇప్పటికే చిరంజీవి గత అసెంబ్లీ ఎన్నిక సందర్భంగా పలుమార్లు వచ్చి బాగేపల్లి, చిక్కబళ్లాపురం, గౌరిబిదనూరు, దొడ్డబళ్లాపురం, దేవనహళ్లి తదితర తాలూకాల్లో విస్తత ప్రచారం చేశారు.
ఆ సమయంలో ప్రజల్లో మంచి స్పందన కనిపించింది. అయితే చిరంజీవిపై ఉన్న అభిమాన ం ఓట్లుగా మారుతాయా? అనేది కూడా ఇక్కడ ప్రశ్న. ఎందుకుంటే సరిహద్దు ప్రాంతాలైన ఈ ప్రాంతంలో ఉన్నది దాదాపు అందరూ సీమాంధ్ర ప్రాంతాలకు చెందినవారే. స్థానికంగా లేకపోయినా రాష్ట్ర విభజన తతంగం మొత్తం ప్రజలకు తెలుసు. ఒకవేళ చిరంజీవి చిక్కబళ్లాపురం స్థానం నుంచి పోటీ చేసినా రాష్ట్ర విభజన సెగ తగిలే అవకాశముంది. ఎందుకంటే రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ ఈ ప్రాంతంలో అనేక పోరాటాలు జరిగాయి. చిరంజీవికి బాగేపల్లి, గౌరిబిదనూరు, చిక్కబళ్లాపురం ప్రాంతాల్లో మాత్రమే చెప్పుకోదగ్గ అభిమానులున్నారు.
దొడ్డబళ్లాపురం, దేవన హళ్లి, హొసకోట, నెలమంగల తాలూకాల్లో సినీ అభిమానులు మాత్రమే ఉన్నారు. చిరంజీవి పోటీచేస్తే ఆలోచించకుండా ఓటు వేసేంత గుడ్డి అభిమానం అయితే లేదనే చెప్పవచ్చు. కన్నడిగుడైన మొయిలీనే వలస పక్షిగా చిత్రీకరిస్తున్న ప్రతిపక్షాలు, పక్క రాష్ట్రం నుంచి వచ్చి పోటీ చేసే చిరంజీవిపై ఏ స్థాయిలో విమర్శలు గుప్పిస్తారో ఇట్టే ఊహించవచ్చు. ఏది ఏమైనా చిక్కబళ్లాపురం స్థానం అభ్యర్థి ఎన్నిక విషయంలో హైకమాండ్ తర్జనభర్జన పడుతోందని స్పష్టమవుతోంది.