
'రాష్ట్ర విభజన ప్రక్రియ నిలిచిపోయింది'
సీమాంధ్ర కేంద్ర మంత్రులు, ఎంపీలు బుధవారం కేంద్రమంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వీరప్పమొయిలీని కలిశారు.
న్యూఢిల్లీ : సీమాంధ్ర కేంద్ర మంత్రులు, ఎంపీలు బుధవారం కేంద్రమంత్రి వీరప్పమొయిలీని కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని తాజా పరిణామాలపై ఆయనతో చర్చించినట్లు సమాచారం. భేటీ అనంతరం ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ సీమాంధ్రలో ఉద్యమ ఉధృతిని గమనించామని.... న్యాయం చేస్తామని మొయిలీ హామీ ఇచ్చారన్నారు.
ఆంటోనీ కమిటీ నివేదిక వచ్చేంతవరకూ విభజన ప్రక్రియ ఆగుతుందనే నమ్మకం ఉందన్నారు. విభజన ప్రక్రియ నిలిచిపోయిందనే పూర్తి నమ్మకంతో ఉన్నామన్నారు. సీమాంధ్రలో జరుగుతున్న ఉద్యమాల వివరాలను మొయిలీకి అందచేసినట్లు వెంకట్రామిరెడ్డి తెలిపారు. ఆంటోనీ కమిటీ సభ్యులతో పాటు సోనియాగాంధీని కలుస్తామని ఆయన చెప్పారు. సమైక్యాంధ్ర ఉద్యమాన్ని కొనసాగిస్తామని తెలిపారు.