సీమాంధ్ర కాంగ్రెస్ నేతల సమావేశం
హైదరాబాద్ : తెలంగాణ ప్రక్రియపై కేంద్రం ముందుకు వెళ్తుండడంతో సీమాంధ్ర ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ ఎంపీలు శనివారం మినిస్టర్స్ క్వార్టర్స్లో సమావేశం అయ్యారు. ప్రాంతానికి చెందిన రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ఈ సమావేశం నిర్వహించాలని భావించినా ఎంపీలు, కేంద్రమంత్రులకే పరిమితమైంది.
రాష్ట్ర విభజన వల్ల తలెత్తే సమస్యలు, సీమాంధ్రలో ఉద్యమం, రాజీనామాలు తదితర అంశాలపై భేటీలో చర్చ జరగనుంది. అధిష్టానం విభజనపై వెనక్కు తగ్గేది లేదని చెబుతుండడం, సీమాంధ్రలో ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిపడుతుండడంతో ఎలా ముందుకు వెళ్లాలన్న అంశంపై వీరంతా తర్జనభర్జన పడుతున్నారు.
ఎంపీలు, కేంద్రమంత్రులు రాజీనామా చేస్తే విభజన ప్రక్రియ నిలిచిపోతుందని సమైక్యవాదులు రాజీనామాలు డిమాండ్ చేస్తున్నారు. పార్లమెంటు సమావేశాల నెపంతో కేంద్రమంత్రులు, ఎంపీలు ఢిల్లీలో గడిపారు. సమావేశాలు ముగియడం, ఎన్నికల సంవత్సరం కావడంతో వారు ప్రజల ముందుకు వెళ్లక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో భవిష్యత్ కార్యాచరణను రూపొందించుకొని ప్రజల్లోకి వెళ్లేందుకు ఈ భేటీని ఏర్పాటు చేసుకున్నారు.
సమావేశ నిర్వహణ బాధ్యత కేంద్రమంత్రులు కావూరి సాంబశివరావు, జేడీ శీలం తదితర మంత్రులు తీసుకున్నారు. ఈ సమావేశానికి కేంద్రమంత్రులు కావూరి సాంబశివరావు, పల్లంరాజు, పురందేశ్వరి, ఎంపీలు లగడపాటి రాజగోపాల్, అనంతవెంకట్రామిరెడ్డి, కనుమూరి బాపిరాజు, కేవీపీ రామచంద్రరావు, మాగుంట శ్రీనివాసులు రెడ్డి తదితరులు హాజరయ్యారు.