విభజన ప్రక్రియను కొలిక్కితేవడం, జీవోఎంకు చెప్పాల్సిన అంశాలపైనే దృష్టి
తెలంగాణ బిల్లుకు కాంగ్రెస్, టీడీపీ సీమాంధ్ర ఎమ్మెల్యేలూ మద్దతు పలికేలా హైకమాండ్ కార్యాచ రణ!
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 12న కేంద్ర మంత్రుల బృందం (జీవోఎం) ముందు పార్టీ తరఫున చెప్పాల్సిన అంశాలు, విభజన ప్రక్రియను కొలిక్కితేవడం, రాష్ట్రంలో పరిస్థితులను చక్కదిద్దడంపై కాంగ్రెస్ రాష్ట్ర సమన్వయ కమిటీ దృష్టి సారించనుంది. శుక్రవారం ఢిల్లీలో జరగనున్న ఈ భేటీలో పూర్తిగా తదుపరి రాజకీయ కార్యాచరణపైనే నేతలు చర్చలు కొనసాగించనున్నారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, కేంద్రమంత్రి చిరంజీవి, డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ ఈ సమావేశ ంలో పాల్గొననున్నారు. విభజనపై జీవోఎం ఈనెల 12, 13 తేదీల్లో రాష్ట్రంలోని 8 పార్టీలతో సమావేశం కావాలని నిర్ణయించిన నేపథ్యంలో.. కమిటీ ముందు వ్యక్తపరచాల్సిన అంశాలపై సమన్వయ కమిటీలో చర్చించనున్నారు. విభజన ప్రక్రియలో తదనంతర చర్యలను అధిష్టానం పెద్దలు రాష్ట్ర నేతలకు వివరించే అవకాశాలున్నాయి.
రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలు, పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభమయ్యే నాటికి పార్టీ అనుసరించాల్సిన వైఖరిపైనే ప్రధానంగా చర్చిస్తారని సమాచారం. అధిష్టానం మార్గనిర్దేశం ప్రకారం నడుచుకోవాల్సిందిగా పెద్దలు సమన్వయ కమిటీ నేతలకు వివరిస్తారని తెలుస్తోంది. విభజన బిల్లు అసెంబ్లీకి వచ్చినప్పుడు అనుసరించాల్సిన వ్యూహం, ముఖ్యమంత్రి పరిస్థితి, మార్పుచేర్పులు, రాష్ట్రంలో పార్టీ భవిష్యత్తుపై ఇప్పటికే ఒక అవగాహనకు వచ్చిన హైకమాండ్ పెద్దలు.. ఈ క్రమంలో ఎదురయ్యే సమస్యలను అధిగమించడంపైనా సమావేశంలో ఎక్కువగా దృష్టి సారించేందుకు అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. తెలంగాణ ఏర్పాటు బిల్లు అసెంబ్లీకి వచ్చినప్పుడు సభానాయకుడిగా సీఎం కిరణ్ బిల్లు ప్రవేశపెట్టవచ్చని, దీనికి సీమాంధ్ర పార్టీ ఎమ్మెల్యేలతో పాటు టీడీపీ ఎమ్మెల్యేలు కూడా మద్దతు పలికేలా కాంగ్రెస్ పెద్దలు కార్యాచరణ రూపొందిస్తున్నట్లు చెబుతున్నారు.