తెలంగాణ నిర్ణయం నేపథ్యంలో ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు శరవేగంగా మారిపోతున్నాయి. తెలంగాణ, సీమాంధ్ర ప్రాంతాలకు రెండు వేర్వేరు పీసీసీలు ఏర్పాటు చేసేందుకు కాంగ్రెస్ అధిష్ఠానం కసరత్తు చేస్తోంది. అసెంబ్లీకి విభజన బిల్లు వచ్చేలోపే రెండు పీసీసీలు ఏర్పడతాయని కాంగ్రెస్ సీనియర్లు అంటున్నారు. అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించాలంటే ప్రాంతాలవారీగా పీసీసీలు అవసరం అని చెబుతున్నారు. తెలంగాణ పీసీసీ చీఫ్ పదవి కోసం పలువురు టీ కాంగ్రెస్ సీనియర్లు లాబీయింగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. తాజా పరిణామాల నేపథ్యంలో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు హుటాహుటిన ఢిల్లీ వెళ్లారు.
ఇప్పటికే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఢిల్లీలో మకాం వేసి హస్తిన పెద్దలతో వరుస భేటీలు జరుపుతున్నారు. దీంతో మరికొంతమంది నాయకులు కూడా హస్తినబాట పట్టారు. పలువురు మంత్రులు ఢిల్లీలోనే ఉన్నారు. అక్కడే ఉన్న కిరణ్తో మంత్రులు గంటా శ్రీనివాసరావు, పార్థసారథి భేటీ అయ్యారు. మరోవైపు దిగ్విజయ్ సింగ్తో కిరణ్, పితాని సత్యనారాయణ, కేంద్ర మంత్రులు చిరంజీవి, జేడీ శీలం సమావేశమయ్యారు. సీమాంధ్ర నాయకులు వరుసపెట్టి దిగ్విజయ్ని కలవడంతో ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనరసింహ కూడా దిగ్విజయ్ సింగ్ను కలిశారు. ఆయనతో పాటు తెలంగాణ ఉద్యోగ సంఘాల నాయకుడు విఠల్ కూడా ఉన్నారు.
మరోవైపు కాంగ్రెస్ సమన్వయ కమిటీ సమావేశం కూడా ఢిల్లీలో జరుగుతోంది. దీనికి దిగ్విజయ్ సింగ్, కుంతియా కూడా హాజరయ్యారు. రాష్ట్రం నుంచి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనరసింహ, పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ, కేంద్రమంత్రి చిరంజీవి దీనికి వెళ్లారు. రాష్ట్ర విభజనకు సహరించాలని కాంగ్రెస్ అధిష్ఠానం రాష్ట్ర నాయకులను కోరనుందని సమాచారం. హైదరాబాద్ అంశం, జలవనరుల పంపిణీపై చర్చ జరుగుతుందని అంటున్నారు.
ముఖ్యమంత్రిని మార్చే ఉద్దేశ్యం తమకు లేదని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ దిగ్విజయ్ సింగ్ అన్నారు. విభజనపై హైకమాండ్ నిర్ణయమే అంతిమమని ఆయన అన్నారు. సీఎం కిరణ్ కూడా హైకమాండ్ నిర్ణయాన్ని శిరసావహిస్తారని చెప్పారు. ఆయనకు కొన్ని అభ్యంతరాలు ఉన్న మాట వాస్తవమే అని అయితే హైకమాండ్ నిర్ణయాన్ని దిక్కరించని చెప్పారు.
తెలంగాణ, సీమాంధ్రలకు వేర్వేరు పీసీసీలు?
Published Fri, Nov 8 2013 7:36 PM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM
Advertisement
Advertisement