తెలంగాణపై కాంగ్రెస్కు ఎందుకీ తొందర?
రాష్ట్రంలో సగానికి పైగా ప్రజలు వద్దంటున్నా, సొంత పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులు వ్యతిరేకిస్తున్నా, కొంతమంది కేంద్ర మంత్రులు సైతం విభేదిస్తున్నా.. కాంగ్రెస్ అధిష్ఠానం మాత్రం రాష్ట్రాన్ని విభజించకుండా వదిలేది లేదంటూ తాను పట్టిన కుందేటికి మూడే కాళ్లన్నట్లు వ్యవహరిస్తోంది. ఆంటోనీ కమిటీ అంటూ ఒక కమిటీని నియమించి దాంతో సీమాంధ్రుల మనోభావాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తామంటూ కబుర్లు చెప్పినా, ఆ కమిటీ కాస్తా మఖలో పుట్టి పుబ్బలో పోయినట్లు నాలుగు రోజులకే చాప చుట్టేసింది. ఈ కమిటీ అసలు రాష్ట్రంలో పర్యటించిన పాపాన పోలేదు. అసలు రాష్ట్రంలో ప్రజల మనోభావాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేయలేదు. రాష్ట్ర రాజధాని నగరం విషయాన్ని ఏం చేయాలో నిర్ణయించలేదు. కొత్త రాష్ట్రం ఏర్పాటైతే దాని రాజధాని నిర్మాణం ఎలాగో, ఎక్కడో స్పష్టం చేయలేదు. ఇవేమీ లేకుండానే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తామంటూ నిమిషానికో ప్రకటన చేసి పారేస్తున్నారు.
తాజాగా కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే కూడా తనవంతుగా ఓ ప్రకటన చేసి పారేశారు. పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభం అయ్యేలోపే మంత్రుల బృందం తన నివేదికను అందజేస్తుందని చెబుతున్నారు. దీన్ని బట్టి తెలంగాణ విషయంలో తాము వెనకడుగు వేసే ప్రసక్తే లేదని చెబుతున్నట్లయింది. విభజనకు వ్యతిరేకంగా ఉన్నట్లు పైకి కనిపిస్తున్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గానీ, రాష్ట్రపతిని కలిసి విభజనకు వ్యతిరేకంగా తాము తమ వాదన వినిపించినట్లు చెబుతున్న దాదాపు 60 మంది సీమాంధ్ర కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు గానీ.. తాము ఏం సాధించామన్న విషయాన్ని మాత్రం బయట పెట్టడంలేదు.
అసలు ముఖ్యమంత్రిని కాంగ్రెస్ అధిష్ఠానం విశ్వాసంలోకి తీసుకుందన్న నమ్మకం ఎవరికీ కలగడంలేదు. గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ఇప్పటికే ఢిల్లీలో గత కొన్ని రోజులుగా హల్చల్ చేస్తున్నారు. రాష్ట్రంతో అధికారికంగా ఎలాంటి సంబంధం లేని దిగ్విజయ్ సింగ్ సహా, రాజకీయ పెద్దలందరినీ ఆయన కలుస్తున్నారు. రాష్ట్ర శాంతి భద్రతల పరిస్థితి గురించి, పరిపాలనా తీరు గురించి కూడా నివేదికలు ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఉత్తరాఖండ్ రాష్ట్రం ఏర్పడినప్పడు కేంద్ర ప్రభుత్వం ఆ రాష్ట్రానికి ఎలాంటి భారీ ప్యాకేజీలు ఇవ్వలేదు. కేవలం 200 కోట్ల రూపాయలు ఇచ్చి చేతులు దులిపేసుకుంది. దాంతో కొత్తగా రాజధాని, ఇతర సదుపాయాలు ఏర్పాటుచేసుకోవాల్సిన 'ఆంధ్రప్రదేశ్'కు ఏం ఇస్తారన్నది అనుమానంగానే కనపడుతోంది. సీమాంధ్రుల సందేహాలను నివృత్తి చేసే కనీస ప్రయత్నం కూడా చేయని కాంగ్రెస్.. ఎందుకింత తొందరపడుతోందో మాత్రం ఎవరికీ అర్థం కావట్లేదు.