ప్రీమియం ఇంధనాలపై పన్నులు తగ్గించండి
న్యూఢిల్లీ: ప్రీమియం పెట్రోల్, డీజిల్‌లపై సుంకాలు తగ్గించాలని చమురు శాఖ మంత్రి ఎం. వీరప్ప మొయిలీ ఆర్థిక మంత్రిత్వ శాఖను కోరారు. అధిక మైలేజీ నిచ్చే ఈ ప్రీమియం ఇంధనాలపై సుంకాల కోత కారణంగా, ఈ ప్రీమియం ఇంధనాల వాడకం పెరిగి సాధారణ ఇంధనాల వినియోగం తగ్గుతుందని ఆయన వివరించారు. ఈ ప్రీమియం ఇంధనాలపై ప్రభుత్వం అధికంగా ఎక్సైజ్ సుంకాలను విధిస్తోంది. ఫలితంగా సాధారణ ఇంధనాల కన్నా వీటి ఖరీదు అధికంగా ఉంటోంది. అంతర్జాతీయ పోకడలకనుగుణంగా భారత ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు స్పెషలైజ్‌డ్ పెట్రోల్, డీజిల్ ఇంధనాలను అందిస్తున్నాయి.
ప్రీమియం, సాధారణ ఇంధనాల ధరల మధ్య వ్యత్యాసం రూ.8-14 గా ఉంది. దాదాపు నెల రోజుల పాటు జరిగిన చమురు పరిరక్షణ ఉత్సవాల ముగింపు సందర్భంగా మొయిలీ ఈ విజ్నప్తిని చేశారు. 2009 బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం ప్రీమియం పెట్రోల్, డీజిల్‌లపై కొత్తగా సుంకాలను విధించింది. గత ఏడాది సెప్టెంబర్‌లో ఈ తరహా ఇంధనాలకు సబ్సిడీలనివ్వటాన్ని కూడా ప్రభుత్వం నిలిపేసింది. సాధారణ పెట్రోల్‌పై లీటర్‌కు రూ.1.20, ప్రీమియం పెట్రోల్‌పై రూ.7.50 చొప్పున ప్రభుత్వం సుంకాలను విధిస్తోంది. ఇక సాధారణ డీజిల్‌పై లీటర్‌కు రూ.1.46, ప్రీమియం డీజిల్‌పై రూ.3.75 చొప్పున ప్రభుత్వం సుంకాలను విధిస్తోంది. ప్రీమియం ఇంధనాలపై సుంకాల తగ్గింపుతో ప్రభుత్వ ఆదాయమేమీ గణనీయంగా పడిపోదని, వీటి విక్రయాలు ప్రస్తుతానికి స్వల్పంగా ఉ ండటమే దీనికి కారణమని మొయిలీ అన్నారు.