సాక్షి, న్యూఢిల్లీ : సీబీఐ తాత్కాలిక డైరెక్టర్‌గా మన్నెం నాగేశ్వరరావును నియమించడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఒడిశా క్యాడర్ ఐపీఎస్ అధికారైన నాగేశ్వరావుపై అనేక అవినీతి ఆరోపణలున్నాయని, ఆయన నియామకాన్ని పలువురు తప్పుబడుతున్నారు. నాగేశ్వరావు నియామకాన్ని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ కేంద్రమంత్రి వీరప్పమెయిలీ వ్యతిరేకించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఒడిశాలో నాగేశ్వరావు ఐపీఎస్ అధికారిగా పనిచేసినప్పుడు ఆయన అనేక అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం సీబీఐని భ్రష్టు పట్టించిందని ధ్వజమెత్తారు. సీబీఐని రాజకీయ అవసరాలకు వాడుకుంటున్నారని, అనుకూలమైన వ్యక్తులను డైరెక్టర్లుగా నియమిస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ ప్రభుత్వ తీరు వల్ల సీబీఐ విశ్వసనీయత కోల్పోయిందన్నారు.
నాగేశ్వరరావు నియామకంపై సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ సైతం కేంద్రం తీరును తప్పుబట్టారు. సీబీఐ స్పెషల్ డైరెక్టర్ రాకేష్ ఆస్థానాను రక్షించేందుకే అలోక్ వర్మ తొలిగించారని ఆయన ఆరోపించారు. నాగేశ్వర రావుపై అనేక అవినీతి ఆరోపణలు, కేసులున్నాయని, అతన్ని సీబీఐ డైరెక్టర్‌గా ఎలా నియమిస్తారని ప్రశ్నించారు. గతంలో నాగేశ్వరరావును తొలగించాలని సీబీఐ తాజా మాజీ డైరెక్టర్ అలోక్‌వర్మ సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ (సీవీసీ)కి సిఫార్సు కూడా చేశారని గుర్తు చేశారు. అప్పుడు నాగేశ్వరరావుపై సీవీసీ చర్యలు చేపట్టలేదని, ఇప్పుడు ఏకంగా డైరెక్టర్‌ను చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment