అధిక ధరతోనే ఉత్పత్తి పెరిగేది... | Veerappa Moily says Higher rates will help increase domestic gas output | Sakshi
Sakshi News home page

అధిక ధరతోనే ఉత్పత్తి పెరిగేది...

Published Sat, Dec 21 2013 4:06 AM | Last Updated on Sat, Sep 2 2017 1:48 AM

అధిక ధరతోనే ఉత్పత్తి పెరిగేది...

అధిక ధరతోనే ఉత్పత్తి పెరిగేది...

న్యూఢిల్లీ: సహజవాయువు(గ్యాస్)కు అధిక ధర  చెల్లించడం వల్ల దే శీయంగా ఉత్పత్తి పుంజుకుంటుందని చమురు శాఖ మంత్రి వీరప్ప మొయిలీ పేర్కొన్నారు. తద్వారా దిగుమతులపై ఆధారపడటం తగ్గుతుందని చెప్పారు. వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి గ్యాస్ ధర రెట్టింపుకానున్న నేపథ్యంలో మొయిలీ వ్యాఖ్యలకు ప్రాధాన్యత ఏర్పడింది. ఈ ఏడాది జూన్‌లో ప్రభుత్వం దేశీయంగా ఉత్పత్తయ్యే గ్యాస్ ధరలకు సంబంధించి కొత్త విధానాన్ని ఆమోదించిన సంగతి తెలిసిందే. కాగా, ప్రైవేట్ రంగ ఆయిల్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ కేజీ డీ6లో ఉత్పత్తి చేసే గ్యాస్‌కు సైతం కొన్ని షరతులతో ఇవే నిబంధనలు అమలయ్యేలా కేంద్ర క్యాబినెట్ ఆమోద ముద్ర కూడా వేసింది. గ్యాస్ ధరను పెంచకపోతే దేశీయంగా ఉత్పత్తి నిలిచిపోతుందని మొయిలీ వ్యాఖ్యానించారు. వెరసి దిగుమతుల భారం పెరుగుతుందని పేర్కొన్నారు. ఏఐఎంఏ ఇక్కడ నిర్వహించిన ప్రభుత్వ రంగ సంస్థల మూడో సదస్సుకు ఆయన హాజరయ్యారు. దేశీయ గ్యాస్ అవసరాల్లో సగభాగాన్ని ప్రస్తుతం దిగుమతుల ద్వారా పూరించుకుంటున్నామని తెలిపారు. గ్యాస్ వెలికితీతకు దేశీయంగా పలు అవకాశాలున్నప్పటికీ ఇందుకు భారీ స్థాయిలో నిధులను వె చ్చించాల్సి ఉంటుందని చెప్పారు.
 
 తక్కువ ధర వల్లే
 ప్రస్తుత తక్కువ ధరల కారణంగా ఇప్పటికే మూడు లక్షల ఘనపు మీటర్ల గ్యాస్ నిల్వలను వెలికితీయడం లాభసాటికాదని డీజీహెచ్ పేర్కొన్నదని మొయిలీ వివరించారు. ప్రస్తుతం ఒక ఎంబీటీయూ గ్యాస్‌కు 4.2 డాలర్లను చెల్లిస్తున్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరం(ఏప్రిల్) నుంచి ఈ ధర 8.4 డాలర్లకు పెరగనుంది.ఇందువల్లనే ఓఎన్‌జీసీ, ఆర్‌ఐఎల్ వంటి సంస్థలకు చెందిన కొన్ని బ్లాకుల్లో గ్యాస్ నిల్వలను వెలికితీయడం లాభసాటికాదని డీజీహెచ్ పేర్కొన్నట్లు తెలిపారు. గ్యాస్‌ను 12-13 డాలర్లకు దిగుమతి చేసుకోవడం లేదా ఇంతకంటే బాగా తక్కువ ధరను చె ల్లించడం ద్వారా దేశీయంగా నిల్వలను వెలికితీయడాన్ని ప్రోత్సహించడమే మనముందున్న ఏకైక అవకాశమని మొయిలీ వ్యాఖ్యానించారు. అయితే దేశీయంగా గ్యాస్ ఉత్పత్తిని ప్రోత్సహించకపోతే పూర్తిగా దిగుమతులపైనే ఆధారపడాల్సి వస్తుందని వివరించారు.
 
 రెండు నెలల్లో డీజిల్‌పై నియంత్రణ ఎత్తివేత
 రానున్న రెండు నెలల్లో డీజిల్ ధరలపై పూర్తిస్థాయిలో నియంత్రణలను ఎత్తివేయనున్నట్లు మొయిలీ చెప్పారు. ఒక మీడియా సంస్థ ఇక్కడ నిర్వహించిన ఆటోకార్ అవార్డుల కార్యక్రమానికి మొయిలీ హాజరయ్యారు. రానున్న కొద్ది రోజుల్లో డీజిల్‌ను పూర్తిస్థాయిలో డీరెగ్యులేట్ చేయగలమని విశ్వసిస్తున్నట్లు తెలిపారు. డాలరుతో మారకంలో రూపాయి భారీగా బలహీనపడకపోయి ఉంటే ఈ పాటికే డీజిల్ ధరలపై నియంత్రణలను ప్రభుత్వం పూర్తిగా ఎత్తివేసి ఉండేదని వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement