సబ్సిడీపై 12 సిలిండర్లు
కేంద్రంలో మాకు మెజారిటీ రాకుండా కుట్ర
బలహీన ప్రభుత్వం ఏర్పడేలా మాపై అసత్య ఆరోపణలు
బీజేపీ జాతీయ కార్యవర్గ భేటీలో కాంగ్రెస్‌పై రాజ్‌నాథ్ నిప్పులు
సాక్షి, న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో ఓటమి భయంతో కాంగ్రెస్ పార్టీ తమపై కుయుక్తులు పన్నుతోందని బీజేపీ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్ నిప్పులు చెరిగారు. ఎన్నికల తర్వాత కేంద్రంలో నరేంద్ర మోడీ సారథ్యంలో పటిష్టమైన ప్రభుత్వం ఏర్పాటు కాకుండా, కేవలం పేలవ ప్రభుత్వం ఉండాలనే లక్ష్యంతో కాంగ్రెస్ కుట్రపన్నుతోందని ఆరోపించారు. శుక్రవారం ఢిల్లీలో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాన్ని పార్టీ అగ్రనేత ఎల్.కె. అద్వానీ, ప్రధాని అభ్యర్ధి నరేంద్ర మోడీ, పార్లమెంటులో ప్రతిపక్ష నేతలు సుష్మాస్వరాజ్, అరుణ్‌జైట్లీలతో కలసి రాజ్‌నాథ్ జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించి అధ్యక్షోపన్యాసం చేశారు. భేటీలో జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, దత్తాత్రేయ, డాక్టర్ లక్ష్మణ్, ఇంద్రసేనారెడ్డి, హరిబాబు, వీర్రాజు, శాంతారెడ్డి, యెండల లక్ష్మీనారాయణ, ప్రత్యేక ఆహ్వానితుడిగా కృష్ణంరాజు పాల్గొన్నారు. శని, ఆదివారాల్లో పార్టీ జాతీయ కౌన్సిల్ సమావేశాలు రాంలీలా మైదాన్‌లో జరగనున్నాయి.
రాజ్‌నాథ్ ప్రసంగంలోని ముఖ్యాంశాలు:
యూపీఏ పదేళ్ల పాలనపై ప్రజాగ్రహం పెల్లుబుకుతున్న నేపథ్యంలో ఓటమి తప్పదని తెలుసుకున్న కాంగ్రెస్.. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి సంపూర్ణ మెజార్టీ రాకుండా, బలహీన ప్రభుత్వం ఏర్పాటయ్యేలా అసత్య ఆరోపణలతో ప్రజల్లో భయాందోళనలు సృష్టిస్తోంది.
ఓటుబ్యాంకు రాజకీయాలకు మారుపేరైన కాంగ్రెస్...మన వల్ల లౌకిక వాదానికి పెనుముప్పంటూ తప్పుడు ఆరోపణలు చేస్తోంది.
దీన్ని తిప్పికొట్టేందుకు యూపీఏ పాలనలో జరిగిన స్కాంలు, ఆర్థిక వ్యవస్థ పతనం, ఓటుబ్యాం కు రాజకీయాల వంటి వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లాలి.
లోక్‌సభ ఎన్నికల్లో 272 స్థానాల్లో గెలిచి సంపూర్ణ మెజార్టీతో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది.
అధికారంలోకి వస్తే సుపరిపాలన అందిస్తాం.
భేటీలో ఏం చేశారంటే...
272 కన్నా ఎక్కువ సీట్ల సాధనకు రాష్ట్రాల వారీగా పార్టీ పరిస్థితులపై అగ్రనేతల మేధోమథనం.
ఒక ఓటు ఒక నోటు కార్యక్రమం ద్వారా పల్లెపల్లెకు వెళ్లడం, పార్లమెంటరీ నియోజకవర్గస్థాయి, బూత్‌స్థాయిల్లో సమావేశాల నిర్వహణ, ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపర్చాల్సిన అంశాలు, ప్రచార వ్యూహాలపై చర్చ.
ఆర్థిక, రాజకీయ తీర్మానాలకు తుదిరూపు
సిక్కుల ఊచకోత గుర్తులేదా: బీజేపీ
బీజేపీతో లౌకికవాదానికి ముప్పన్న సోనియాగాంధీ వ్యాఖ్యలపై బీజేపీ అధికార ప్రతినిధి ప్రకాశ్ జవదేకర్ ఘాటుగా స్పందించారు. దశాబ్దాలపాటు సాగిన కాం గ్రెస్ పాలనలో 13 వేల అల్లర్లు జరిగాయని, 70 వేల మందికిపైగా మృత్యువాతపడటానికి కాంగ్రెస్ మతఛాందసవాద విధానాలే కారణమన్నారు. ముఖ్యంగా తమ పార్టీపై మతతత్వ ముద్ర వేస్తున్న కాంగ్రెస్‌కు 10 వేల మంది సిక్కుల ఊచకోత ఎవరి హయాంలో జరిగిందో గుర్తులేదా? అని దుయ్యబట్టారు.