డీజిల్, గ్యాస్ ధర పెంపు ప్రతిపాదనల్లేవ్: మొయిలీ
న్యూఢిల్లీ: డీజిల్, వంట గ్యాస్ (ఎల్పీజీ) ధర పెంపు ప్రతిపాదనలేవీ కేబినెట్ ముందుకు రాలేదని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి వీరప్ప మొయిలీ వెల్లడించా రు. మంగళవారమిక్కడ ఆయన విలేకరులతో మాట్లాడుతూ, ఈ ఆర్థిక సంవత్సరంలో రూపాయి విలువ పడిపోవడంతో చమురు ఉత్పత్తి వ్యయానికి, చిల్లర విక్రయ ధరకు మధ్య వ్యత్యాసం బాగా పెరిగిందని చెప్పారు.
నష్టాలను పూడ్చుకునేందుకు డీజిల్‌పై లీటర్‌కు రూ. 3-5, కిరోసిన్‌పై రూ.2, అలాగే ఎల్పీజీ సిలిండర్‌పై రూ. 50 చొప్పున ధర పెంచాలని తమ శాఖపై ఒత్తిడి ఉందన్నారు. త్వరలోనే ఢిల్లీ, రాజస్థాన్ సహా ఐదు కీలక రాష్ట్రాల్లో శాసనసభ ఎన్నికల దృష్ట్యా వీటి ధరల పెంపుతో పడే రాజకీయ ప్రభావం దృష్ట్యా ప్రభుత్వం ఆచితూచి నిర్ణయం తీసుకుంటుందన్నారు. ప్రభుత్వరంగ సంస్థలు కూడా మార్కెట్ ధరకే డీజిల్‌ను కొనుగోలు చేయాలని ఇచ్చిన ఆదేశాలను ఉపసంహరించుకునే అంశాన్ని తీవ్రంగా పరిశీలిస్తున్నట్టు మొయిలీ తెలిపారు. త్వరలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరుగనుండడంతోఈ నిర్ణయం తీసుకోనున్నట్టు తెలిసింది.