న్యూఢిల్లీ: డీజిల్ ధరను లీటర్‌కు ఏకంగా రూ.5 చొప్పున తక్షణమే పెంచాలని కిరీట్ ఎస్.పారిఖ్ కమిటీ సిఫారసు చేసింది. కిరోసిన్ రేటును కూడా లీటర్‌కు రూ.4 చొప్పున పెంచాలని సూచించింది. అంతేకాదు గృహావసరాలకు సబ్సిడీపై ఇచ్చే ఎల్పీజీ సిలిండర్ ధరను రూ.250 పెంచాలని సిఫారసు చేసింది. ప్రస్తుతం ఒక్కో కుటుంబానికి ఏడాదికి 9 చొప్పున సిలిండర్లను సబ్సిడీ ధరకు సరఫరా చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా వీటిని 6కు తగ్గించాలని సూచించింది. తద్వారా సబ్సిడీ బిల్లు రూ.72 వేల కోట్ల మేరకు తగ్గుతుందని అంచనా. ఈ మేరకు బుధ వారం చమురుశాఖ మంత్రి వీరప్ప మొయిలీకి నివేదికను సమర్పించిన పారిఖ్ వివరాలను విలేకరులకు వెల్లడించారు. ధరలు పెంచిన తర్వాత చమురు కం పెనీలకు డీజిల్‌పై లీటర్‌కు కేవలం రూ.6 చొప్పున మాత్రమే సబ్సిడీ ఇవ్వాలని కమిటీ సూచించింది.