
తగ్గేదే లేదు..!
పెట్రోలు, డీజిల్ ధరలు తగ్గిస్తామంటూ ఎన్నికల ముందు హామీలు
ఇంధన ధరలపై ప్రతిపక్షంలో ఉండగా ఆందోళనకు చంద్రబాబు పిలుపు
అధికారంలోకి వచ్చేది మేమే.. తగ్గించేదీ మేమే అంటూ ప్రచారం
లీటరు పెట్రోలుపై రూ.16 తగ్గించాలంటూ నాడు ధర్నాలు
పది నెలలుగా హామీ నెరవేరకపోవడంతో ప్రజలపై ఇంధన చార్జీల భారం
సూపర్ సిక్స్ హామీలను అమలు చేయకపోగా పన్నుల బాదుడే బాదుడు
ఇప్పటికే రూ.15 వేల కోట్లకుపైగా కరెంటు చార్జీల షాక్‌లు.. ఇప్పుడు ఇంధన చార్జీల వంతు
ప్రకృతి వైపరీత్యాల నిధి పేరిట అదనపు సెస్ విధించేందుకు ఫైళ్లు సిద్ధం
రాష్ట్రంలో నిత్యం సగటున 35.66 లక్షల లీటర్ల పెట్రోలు, 86.01 లక్షల లీటర్ల డీజిల్ అమ్మకాలు
బాబు బృందం హామీలను రీ ట్వీట్ చేస్తూ.. మోసాలను సోషల్ మీడియాలో నిలదీస్తున్న ప్రజలు
ఏపీతో పోలిస్తే లీటర్ పెట్రోలు కర్ణాటకలో రూ.6 తక్కువకే దొరుకుతోంది.
మన రాష్ట్రంతో పోలిస్తే లీటర్ పెట్రోలు తమిళనాడులో రూ.8 తక్కువ.
ఏపీతో పోలిస్తే ఒడిశాలో లీటర్ పెట్రోలు రూ.7.50 తక్కువకే లభిస్తోంది.
సాక్షి, అమరావతి: ఒకవైపు సూపర్ సిక్స్ హామీలను ఎగ్గొట్టి అన్ని వర్గాలను మోసం చేసిన చంద్రబాబు సర్కారు మరోవైపు వీలైనన్ని మార్గాల్లో జనం జేబులకు చిల్లు పెడుతోంది. ఎన్నికల వాగ్దానం ప్రకారం సంక్షేమ పథకాల ద్వారా ప్రజలకు మేలు చేకూర్చాల్సింది పోయి పన్నుల బాదుడుతో నిలువు దోపిడీ చేస్తోంది. సంపద సృష్టించి పథకాలను అమలు చేస్తానంటూ నమ్మించిన ప్రభుత్వ పెద్దలు నడ్డి విరిగేలా రూ.వేల కోట్ల భారం వడ్డిస్తున్నారు.
ఇప్పటికే విద్యుత్తు చార్జీలను పెంచి రూ.15 వేల కోట్లకుపైగా భారాన్ని జనం నెత్తిన మోపిన కూటమి సర్కారు పెట్రోలు, డీజిల్ ధరలను తగ్గిస్తామన్న హామీని నెరవేర్చకుండా తొమ్మిది నెలల్లో వాహనదారుల నుంచి ఏకంగా రూ.5,256 కోట్లకుపైగా వసూలు చేసింది. తద్వారా మరో ఎన్నికల హామీకి తిలోదకాలిచ్చింది. తాము అధికారంలోకి వస్తే పెట్రోలుపై లీటర్‌కు రూ.16 చొప్పున ధరలు తగ్గిస్తామని ఎన్నికల ముందు సీఎం చంద్రబాబు, నారా లోకేష్ నమ్మబలికారు.
అనంతపురం, కర్నూలు జిల్లాల్లో యువగళం పాదయాత్ర సందర్భంగా నారా లోకేశ్ పెట్రోలు బంకులు, ఆటో డ్రైవర్లు వద్దకు వెళ్లి అధికారంలోకి రాగానే గ్రీన్‌ట్యాక్స్ రద్దుతో పాటు పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గిస్తామంటూ హామీలిచ్చారు. ఇక 2021 నవంబర్‌లో పెట్రోల్, డీజిల్ ధరలపై టీడీపీ రాష్ట్రవ్యాప్త ఆందోళనలకు పిలుపునిచ్చింది.
పెట్రోలుపై లీటర్‌కు రూ.16 వరకు ధర తగ్గించాలని నాడు చంద్రబాబు డిమాండ్ చేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇంధన ధరలపై గగ్గోలు పెట్టిన ఆయన అధికారంలోకి వచ్చాక ఆ ఊసే మరిచారు. ఇది చాలదన్నట్లు ప్రకృతి వైపరీత్యాల నిధి పేరిట అదనపు సెస్ విధించేందుకు ఫైళ్లను సిద్ధం చేయడం గమనార్హం.
రూ.5,256 కోట్లు తిరిగి కట్టాల్సిందే
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పెట్రోలుపై లీటర్‌కు రూ.16 చొప్పున ధర తగ్గించాలని డిమాండ్ చేసిన చంద్రబాబు.. దాన్ని అమలు చేయాలని ఇప్పుడు వాహనదారులు డిమాండ్ చేస్తున్నారు. మన రాష్ట్రంలో రోజూ సుమారు 35.66 లక్షల లీటర్ల పెట్రోలు, 86.01 లక్షల లీటర్ల డీజిల్ అమ్ముడవుతున్నట్లు ఏపీ పెట్రో డీలర్స్ అసోసియేషన్స్ అంచనాలు వెల్లడిస్తున్నాయి.
ఈ లెక్కన కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టాక 270 రోజుల్లో ప్రజల నుంచి కనీసం రూ.5,256 కోట్లు ముక్కుపిండి వసూలు చేసినట్లు స్పష్టమవుతోంది. ఎన్నికల హామీ అమలులో భాగంగా తక్షణం పెట్రోలు, డీజిల్ ధరలు తగ్గించడంతోపాటు ఈ మొత్తాన్ని తిరిగి చెల్లించాలని వాహనదారులు డిమాండ్ చేస్తున్నారు. ఈమేరకు కూటమి నేతల హామీలను సామాజిక మాధ్యమాల్లో రీ పోస్ట్ చేస్తున్నారు. ‘‘వచ్చారు సరే.. తగ్గించరేం..?’’ అంటూ కూటమి సర్కారును నిలదీస్తున్నారు.
సరిహద్దు జిల్లాల్లో బంకులు వెలవెల
ఇక్కడ ధరలు అధికంగా ఉండటంతో ఏపీ సరిహద్దు జిల్లాల్లో వాహనదారులంతా పక్క రాష్ట్రాలకు వెళ్లి పెట్రోలు, డీజిల్ కొనుగోలు చేస్తున్నారు. దీంతో తమిళనాడు, కర్నాటక సరిహద్దు జిల్లాల్లోని పెట్రోలు బంకుల యజమానాలు వ్యాపారాలు లేక లబోదిబోమంటున్నారు. తమిళనాడు కంటే మన రాష్ట్రంలో పెట్రోలు ధర లీటరుకు రూ.7.99 అధికంగా ఉండగా కర్నాటక కంటే రూ.5.89 ఎక్కువగా ఉంది. యానాం కంటే మన రాష్ట్రంలో పెట్రోలు లీటర్‌కు రూ.12.77 అధికంగా ఉంది. ఇవన్నీ రాష్ట్రంలో పెట్రోలు, డీజిల్ అమ్మకాలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి.

» ‘కేంద్ర ప్రభుత్వంతోపాటు 12 రాష్ట్రాలు పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాయి. మరి మీరెప్పుడు (నాటి సీఎం వైఎస్ జగన్‌ను ఉద్దేశించి) తగ్గిస్తారు? ఆంధ్రప్రదేశ్‌లో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించే వరకు టీడీపీ పోరాటం ఆగదు. దీనిపై అన్ని పెట్రోల్ బంక్‌ల వద్ద ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిస్తున్నాం. రాష్ట్రంలో పెట్రోల్ ధర రూ.16 తగ్గించి తీరాలి..’– 2021 నవంబర్ 5న మంగళగిరి టీడీపీ కార్యాలయంలో చంద్రబాబు డిమాండ్
» ‘డీజిల్ రేటు ఎంత..? కర్నాటకలో కొట్టించుకుంటున్నావా..? ఆంధ్రాలో అంత తక్కువ రేటు ఎక్కడుందబ్బా అనుకుంటున్నా..! వచ్చేది మేమే.. తగ్గించేది మేమే..!! దోచుకోవడంలో ఈ ప్రభుత్వం ఎవరినీ మినహాయించడంలేదు. మా ప్రభుత్వం రాగానే గ్రీన్ ట్యాక్స్ తగ్గిస్తాం. అడ్డగోలు చలానా విధానానికి స్వస్తి పలుకుతాం. ఆటో యూనియన్ బోర్డు ఏర్పాటు చేసి సంక్షేమాన్ని అందిస్తాం. ప్రమాదంలో చనిపోయిన వారికి చంద్రన్న బీమా ద్వారా రూ.10 లక్షలు ఇచ్చి ఆదుకుంటాం. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గిస్తాం..’– 2023 మార్చి 27న పుట్టపర్తి యువగళం పాదయాత్రలో నారా లోకేశ్
కర్ణాటక వెళ్లొస్తున్నాం..
పెట్రోల్, డీజిల్ ధరలపై గగ్గోలు పెట్టిన నారా లోకేష్ కూటమి సర్కారు అధికారంలోకి వచ్చి పది నెలలు అవుతున్నా ఎందుకు తగ్గించడం లేదు? మేం కర్ణాటక వెళ్లి పెట్రోల్, డీజిల్ కొనుగోలు చేయాల్సి వస్తోంది. అక్కడికి, ఇక్కడికి ధరలో చాలా వ్యత్యాసం ఉంది. – ఎస్ రామకృష్ణారెడ్డి, చిలమత్తూరు, కర్ణాటక సరిహద్దు మండలం
రూ.6 తక్కువకే..
ఏపీలో లీటర్ పెట్రోల్ సుమారు రూ.110 ఉంటే కర్ణాటకలో రూ.104 మాత్రమే ఉంది. ఏపీ కంటే కర్ణాటకలో రూ.6 తక్కువగా ఉంది. ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు కూటమి ప్రభుత్వం వెంటనే పెట్రోల్ ధరలు తగ్గించాలి. – ఇంతియాజ్ అహమ్మద్, బసవనపల్లి, అమరాపురం మండలం
రాష్ట్రంలో రోజుకు సగటు విక్రయాలు..
పెట్రోలు: 35,66,066.66 లీటర్లు
డీజిల్: 86,01,966 లీటర్లు
రోజుకు పెట్రోల్, డీజిల్ కలిపి 121.67 లక్షల లీటర్లు270 రోజులకు 328.50 కోట్ల లీటర్ల వినియోగం.. ఆ లెక్కన లీటరుకు రూ.16 చొప్పున తగ్గించకుండా చంద్రబాబు ప్రజల ముక్కుపిండి వసూలు చేసిన మొత్తం రూ.5,256 కోట్లు
Comments
Please login to add a commentAdd a comment