కాంగ్రెస్‌కు మొయిలీ చురకలు | congress sr leader veerappa moily slams his party for joining chorus against EVMs | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌కు మొయిలీ చురకలు

Published Wed, Apr 12 2017 11:03 AM | Last Updated on Thu, Jul 11 2019 8:26 PM

కాంగ్రెస్‌కు మొయిలీ చురకలు - Sakshi

కాంగ్రెస్‌కు మొయిలీ చురకలు

న్యూఢిల్లీ :ఈవీఎంల వ్యవహారంపై కాంగ్రెస్‌ పార్టీలో అంతర్గత విభేదాలు తలెత్తాయి. కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత వీరప్ప మొయిలీ ఈ అంశంపై  సొంతపార్టీ నిర్ణయంతో విభేదించారు. సీనియర్ల నుంచి అభిప్రాయం తీసుకోలేదని, ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారంటూ ఆయన మండిపడ్డారు. ఈవీఎంలపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆందోళనలో కాంగ్రెస్‌ జత కలవడాన్ని మొయిలీ తప్పుబట్టారు. తాను న్యాయశాఖ మంత్రిగా ఉన్న సమయంలో ఈవీఎంల విధానం ప్రవేశపెట్టడం జరిగిందన్నారు.

అలాగే ఫిర్యాదులు కూడా అందయని, వాటన్నిటిని  తాము సమీక్షించడం జరిగిందనే విషయాన్ని మర్చిపోకూడదన్నారు. భారత ఎన్నికల ప్రక్రియ అత్యున్నతమైనదని, ఈ ఘనత కాంగ్రెస్‌, యూపీఏలకు దక్కుతుందన్నారు. మళ్లీ బ్యాలెట్‌ పత్రాల ద్వారా ఎన్నికలు వెళ్లేది లేదని ఆయన అన్నారు. ఆయా పార్టీలు ఎన్నికల్లో ఓటమికి కేవలం ఈవీఎంలు మాత్రమే కారణం కాదని మొయిలీ వ్యాఖ్యానించారు.

అయితే ఓడినవాళ్లు తప్పంతా ఈవీఎంలదే అని ఆరోపించడం సరికాదని ఆయన చురకలు అంటించారు. మిగతా దేశాలతో పోల్చితే మన ఎన్నికల నిర్వహణా విధానం ఉత్తమమైనదని మొయిలీ అన్నారు. ఆ ఘటన యూపీఏతో పాటు కాంగ్రెస్‌ పార్టీకే దక్కుదుందన్నారు. ఈ నేపథ్యంలో మొయిలీ బుధవారం ఉదయం విపక్ష నేతలతో సమావేశం అయ్యారు.

కాగా ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల నేపథ్యంలో మళ్లీ ఈవీఎంల ట్యాంపరింగ్‌ అంశం తెరపైకి వచ్చింది. ఫలితాలు వచ్చిన రోజే బీఎస్పీ చీఫ్‌ మాయావతి, ఉత్తరాఖండ్‌ మాజీ సీఎం రావత్‌ ఈవీఎంలపై (ట్యాంపరింగ్‌ జరిగిందంటూ) తీవ్ర ఆరోపణలు చేయగా.. వీటిపై విచారణ జరపాలని అఖిలేశ్‌ డిమాండ్‌ చేశారు. పంజాబ్‌లో తమ ఓటమికి కూడా ట్యాంపరింగే కారణమని ఆప్‌ కన్వీనర్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ ఆరోపించారు. ట్యాంపరింగ్‌పై కోర్టుకు వెళ్లనున్నట్లు మాయావతి, కేజ్రీవాల్‌ తెలిపారు.

1982లోనే ఈవీఎంలను ప్రయోగాత్మకంగా భారత్‌లో వినియోగించినా.. 2004 సార్వత్రిక ఎన్నికల నుంచి పూర్తిస్థాయి వినియోగంలోకి వచ్చాయి. తాజా వివాదం నేపథ్యంలో ఈవీఎంను ట్యాంపరింగ్‌ చేయొచ్చా అనే అంశంపై సర్వత్రా చర్చ జరుగుతోంది.  దీంతో  ఈవీఎంల వినియోగంపై 13 పార్టీలు ఏకతాటి పైకి వచ్చాయి. ఈవీఎంల ట్యాంపరింగ్‌ జరుగుతోందని ఆరోపిస్తున్నాయి.  కాంగ్రెస్, తృణమూల్, బీఎస్పీ, ఎన్సీపీ, వామపక్షాలు, డీఎంకే సహా  పార్టీలకు చెందిన ప్రతినిధులు సోమవారం ఈసీని కలిశారు. రాబోయే ఎన్నికల్లో ఈవీఎంలకు బదులుగా బ్యాలెట్ పేపర్లు వాడాలని ఈసీని కోరాయి. ఈవీఎంలపై తమ అనుమానాల్ని సీరియస్‌గా తీసుకోవాల్సిందిగా పార్టీలు ఎన్నిక సంఘానికి విజ్ఞప్తి చేశాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement