డీజిల్ రేట్లపై ఆరు నెలల్లో... నియంత్రణ ఎత్తేస్తాం
న్యూఢిల్లీ: వచ్చే ఆరు నెలల్లో డీజిల్ ధరలను పూర్తిగా డీరెగ్యులేట్ చేస్తామని చమురు శాఖ మంత్రి ఎం వీరప్ప మొయిలీ తెలిపారు. ప్రస్తుతం డీజిల్ విక్రయాలపై ఆదాయ నష్టం లీటరుకు రూ. 9.28 మేర ఉంటోందని కేపీఎంజీ సదస్సులో పాల్గొన్న సందర్భంగా ఆయన చెప్పారు. ఒక్కసారిగా రేటును రూ.3 లేదా రూ.4 చొప్పున పెంచే యోచనేదీ లేదని, స్వల్ప పెరుగుదల క్రమంగానే కొనసాగుతుందని మొయిలీ వివరించారు. ప్రస్తుత పెరుగుదలను బట్టి చూస్తే డీజిల్‌పై చమురు కంపెనీల నష్టాలు భర్తీ కావాలంటే 19 నెలలు పడుతుందని అంచనా. అయితే, రూపాయి బలపడటం, అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గడం వంటి పరిణామాలు చోటుచేసుకుంటే ఆరు నెలల కాలం సరిపోవచ్చని భావిస్తున్నట్లు మొయిలీ చెప్పారు. ఎన్నికల వేళ అయినా కూడా డీజిల్ డీరెగ్యులేషన్ విషయంలో వెనక్కి పోబోమని, మూడోసారి కూడా యూపీఏ ప్రభుత్వం రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ సంస్థలు (ఓఎంసీ) ఉత్పత్తి వ్యయాల కన్నా తక్కువగా ప్రభుత్వం నిర్దేశించిన రేటుకే డీజిల్‌ని విక్రయిస్తున్నాయి. దీనివల్ల ఓఎంసీలు కోల్పోయే ఆదాయాన్ని తాను భర్తీ చేయడం వల్ల ప్రభుత్వంపై ఆర్థిక భారం పెరుగుతోంది. 2010లో పెట్రోల్ రేట్లపై నియంత్రణ తొలగించినప్పట్నించీ వాటి రేట్లు అంతర్జాతీయ సాయికి అనుగుణంగా మారుతున్నప్పటికీ డీజిల్‌పై మాత్రం నియంత్రణ పాక్షికంగా కొనసాగుతోంది. క్రమంగా దీన్ని తొలగించే దిశగా ప్రతి నెలా లీటరుపై 50 పైసల చొప్పున ధర పెంచేందుకు ప్రభుత్వం ఈ ఏడాది జనవరిలో అనుమతించింది. దీంతో ఒక దశలో డీజిల్‌పై ఓఎంసీల ఆదాయ నష్టాలు లీటరుకు రూ. 2.50కి దిగి వచ్చినప్పటికీ.. ఆ తర్వాత దేశీ కరెన్సీ మారకం విలువ బలహీనపడటంతో మళ్లీ రూ. 14కిఎగిశాయి. ప్రస్తుతం ఈ నష్టాలు లీటరుకు రూ. 9.28 స్థాయికి తగ్గాయి. ఒకవేళ నియంత్రణను ఎత్తివేస్తే ఈ స్థాయిలో డీజిల్ రేట్లు పెరుగుతాయి. ఆపై అంతర్జాతీయ రేట్లకు అనుగుణంగా పెట్రోల్ తరహాలోనే డీజిల్ రేట్లు కూడా హెచ్చుతగ్గులకు లోనవుతాయి.
బ్లాకుల వేలం..: నూతన అన్వేషణ లెసైన్సింగ్ విధానం(నెల్ప్) కింద పదో రౌండు చమురు, గ్యాస్ బ్లాకుల వేలాన్ని జనవరిలో నిర్వహించే అవకాశం ఉందని మొయిలీ పేర్కొన్నారు. జనవరిలో జరిగే పెట్రోటెక్ సదస్సులో తేదీలను ప్రకటించవచ్చన్నారు.