ఇది మన దేశానికి సంబంధించిన వార్త కాదు. అయినాసరే, ప్రస్తుత సందర్భంలో దృష్టిసారించాల్సిందే! భారత్‌లో పెట్రో ఉత్పత్తుల ధరలు మోతమోగుతుండటంతో రవాణా ఖర్చులూ విపరీతంగా పెరిగి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ప్రభుత్వం వైపు నుంచి ఎలాంటి ఊరట లభించకపోగా.. రేపో మాపో ఆయా రాష్ట్రాల ఆర్టీసీలు కూడా టికెట్ల ధరలు పెంచనున్నాయన్న వార్తలు మరింత ఆందోళనకరంగా మారాయి. ఇంత జరుగుతున్నా సగటు పౌరులు, సంబంధిత సంఘాలు ఆవేదన చెందడంతప్ప చేసేదేమీలేకుండాపోయింది. దాదాపు ఇలాంటి పరిస్థితే దక్షిణఅమెరికా దేశం బ్రెజిల్‌లో చోటుచేసుకోగా.. అక్కడివారు గట్టి పట్టుదలతో ప్రభుత్వం మెడలు వంచి ధరలు తగ్గేలా చేశారు! అంతేకాదు.. రాబోయే రెండు నెలలపాటు పెట్రో ఉత్పత్తుల ధరలు పెంచబోమని పాలకులచేత చెప్పించారు!! వివరాల్లోకి వెళితే..
బ్రెజిల్‌లో జనవరి నాటికి లీటరు డీజిల్ ధర 3.36 రియిస్ (మన కరెన్సీలో సుమారు రూ.61) ఉండేది. ఒక్కసారే ధరను 3.6 రియిస్ (రూ.65)కు పెంచేశారు. ఇంధనం ధరలు పెరగడంతో రవాణా ఖర్చులు తడిసిమోపెడయ్యే పరిస్థితి తలెత్తింది. దీంతో అక్కడి ట్రక్కు(లారీ) యజమానులు ఆందోళనబాట పట్టారు. నిరసనలో చివరి అంకమైన సమ్మెను కూడా చేపట్టారు. గడిచిన వారం రోజులుగా ఎక్కడి ట్రక్కులు అక్కడే నిలిపేశారు. దరిమిలా దేశంలో ఆహార, ఇధనాల కొరత ఏర్పడింది. మరికొద్ది రోజులు సమ్మె కొనసాగితే పరిస్థితి చేయిదాటిపోతుందని భావించిన ప్రభుత్వం ఎట్టకేలకు దిగొచ్చింది. లీటర్ డీజిల్‌పై 0.46 రియిస్ (రూ.8.36) మేర తగ్గిస్తున్నట్టు బ్రెజిల్ అధ్యక్షుడు మిఛెల్ టెమెర్ ప్రకటన చేశారు. వచ్చే రెండు నెలల్లో ఎట్టిపరిస్థితుల్లోనూ పెట్రో ఉత్పత్తుల ధరలు పెంచబోమని హామీ ఇచ్చారు. ఆ వెంటనే సమ్మె విరమిస్తున్నట్లు ట్రక్కు యజమానులు చెప్పారు.
ఆయిల్ ధరల నిర్ణయం ప్రభుత్వం చేతుల్లో ఉందికాబట్టి బ్రెజిల్ అధ్యక్షుడు తగిన నిర్ణయం తీసుకోగలిగారు. భారత్‌లో మాత్రం ఆ నిర్ణయాధికారం ఆయిల్ కంపెనీల చేతుల్లో ఉండటం, ప్రతిరోజూ సవరణ పేరుతో పైసలకు పైసలు ధరను పెంచుతూ పోవడం చూస్తున్నాం. ఇటీవల దేశ చరిత్రలోనే రికార్డుస్థాయికి పెట్రోల్, డీజల్ ధరలు పెరిగిపోవడం తెలిసిందే. అయితే, కర్ణాటక ఎన్నికల సందర్భంలో ఆయిల్ కంపెనీలు కొన్ని రోజుల పాటు ధరలను పెంచకపోవడం గమనార్హం.
(సమ్మె కారణంగా ఎక్కడిక్కడే నిలిచిపోయిన ట్రక్కులు, ఇతర వాహనాలు)
Comments
Please login to add a commentAdd a comment