truckers strike
-
అమెజాన్ డెలివరీలు ఆలస్యం
న్యూఢిల్లీ : రవాణా వ్యవస్థలో అత్యంత కీలకమైన లారీలు దేశవ్యాప్తంగా బంద్ చేపడుతున్నాయి. జూలై 20 నుంచి ప్రారంభమైన ఈ బంద్ ఇంకా కొనసాగుతూనే ఉంది. డీజిల్ ధరలను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని.. దేశవ్యాప్తంగా ఒకే ధరను నిర్ణయించి, ప్రతి 3 నెలలకోసారి ధరలను సవరించాలన్న డిమాండ్ల సాధన కోసం లారీ యజమానులు ఈ బంద్ చేపడుతున్నాయి. ఈ బంద్‌తో దేశీయ ఈ-కామర్స్ కంపెనీలు అమెజాన్, స్నాప్‌డీల్‌కు భారీగా దెబ్బకొడుతోంది. కొన్ని నగరాల్లో సరుకుల డెలివరీ చేయడం కష్టతరంగా మారింది. దీంతో అమెజాన్, స్నాప్‌డీల్ డెలివరీలు కస్టమర్లకు ఆలస్యంగా చేరుకుంటున్నాయి. లారీలు బంద్ చేపట్టినప్పటి రోజే అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లు రెండూ తమ తమ వార్షిక విక్రయాలను ముగించాయి. ఈ విక్రయాల్లో ఆర్డర్లు ఇచ్చిన వారికి డెలివరీ ఆలస్యమవుతుందని అమెజాన్ అధికార ప్రతినిధి చెప్పారు. ఎలాగైనా కస్టమర్లకు ఉత్పత్తులు చేరుకునేలా పనిచేస్తున్నామని తెలిపారు. దేశీయ అతిపెద్ద రవాణా వ్యవస్థ స్తంభించడంతో, ఉత్తర, పశ్చిమ భారత్‌లో డెలివరీలపై ప్రభావం చూపుతుందని స్నాప్‌డీల్ కూడా తెలిపింది. ఈ విషయాలపై ఇప్పటికే కొనుగోలుదారులకు, విక్రయదారులకు సమాచారం అందించామని చెప్పింది. దేశీయ కమోడిటీ ట్రేడ్ కూడా దెబ్బతిన్నది. పత్తి సరుకు రవాణా ఆగిపోయింది. ముడి పదార్థం లేనందున పత్తి గైనింగ్ కర్మాగారాలు మూసివేత అంచున ఉన్నాయని భారతదేశ కాటన్ అసోసియేషన్ అధ్యక్షుడు అతుల్ గణట్రా చెప్పారు. పత్తి రవాణా ఆగిపోవడంతో, ఎగుమతిదారులు తమ తమ బాధ్యతలను నెరవేర్చలేకపోతున్నారని, దీంతో షిప్మెంట్లను రద్దు చేస్తున్నారని పేర్కొన్నారు. చైనా, బంగ్లాదేశ్, వియత్నాం, పాకిస్తాన్‌లు దేశీయ పత్తి కొనుగోలు చేయడంలో ప్రధానదారులు. ఉల్లిగడ్డలు, బంగాళదుంపలు వంటి కూరగాయలను పెద్ద పెద్ద నగరాలకు సరఫరా చేయడం కూడా పడిపోయింది. కొన్ని చోట్ల బంగాళదుంపలు ఖరీదైనవిగా మారాయి. ఈ వారంలోనే బంగాళదుంపల ధరలు 29 శాతం మేర పైకి ఎగిశాయి. -
పెట్రో ధరల తగ్గింపు; ప్రభుత్వం దిగొచ్చిన వైనం
ఇది మన దేశానికి సంబంధించిన వార్త కాదు. అయినాసరే, ప్రస్తుత సందర్భంలో దృష్టిసారించాల్సిందే! భారత్‌లో పెట్రో ఉత్పత్తుల ధరలు మోతమోగుతుండటంతో రవాణా ఖర్చులూ విపరీతంగా పెరిగి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ప్రభుత్వం వైపు నుంచి ఎలాంటి ఊరట లభించకపోగా.. రేపో మాపో ఆయా రాష్ట్రాల ఆర్టీసీలు కూడా టికెట్ల ధరలు పెంచనున్నాయన్న వార్తలు మరింత ఆందోళనకరంగా మారాయి. ఇంత జరుగుతున్నా సగటు పౌరులు, సంబంధిత సంఘాలు ఆవేదన చెందడంతప్ప చేసేదేమీలేకుండాపోయింది. దాదాపు ఇలాంటి పరిస్థితే దక్షిణఅమెరికా దేశం బ్రెజిల్లో చోటుచేసుకోగా.. అక్కడివారు గట్టి పట్టుదలతో ప్రభుత్వం మెడలు వంచి ధరలు తగ్గేలా చేశారు! అంతేకాదు.. రాబోయే రెండు నెలలపాటు పెట్రో ఉత్పత్తుల ధరలు పెంచబోమని పాలకులచేత చెప్పించారు!! వివరాల్లోకి వెళితే.. బ్రెజిల్లో జనవరి నాటికి లీటరు డీజిల్ ధర 3.36 రియిస్ (మన కరెన్సీలో సుమారు రూ.61) ఉండేది. ఒక్కసారే ధరను 3.6 రియిస్ (రూ.65)కు పెంచేశారు. ఇంధనం ధరలు పెరగడంతో రవాణా ఖర్చులు తడిసిమోపెడయ్యే పరిస్థితి తలెత్తింది. దీంతో అక్కడి ట్రక్కు(లారీ) యజమానులు ఆందోళనబాట పట్టారు. నిరసనలో చివరి అంకమైన సమ్మెను కూడా చేపట్టారు. గడిచిన వారం రోజులుగా ఎక్కడి ట్రక్కులు అక్కడే నిలిపేశారు. దరిమిలా దేశంలో ఆహార, ఇధనాల కొరత ఏర్పడింది. మరికొద్ది రోజులు సమ్మె కొనసాగితే పరిస్థితి చేయిదాటిపోతుందని భావించిన ప్రభుత్వం ఎట్టకేలకు దిగొచ్చింది. లీటర్ డీజిల్‌పై 0.46 రియిస్ (రూ.8.36) మేర తగ్గిస్తున్నట్టు బ్రెజిల్ అధ్యక్షుడు మిఛెల్ టెమెర్ ప్రకటన చేశారు. వచ్చే రెండు నెలల్లో ఎట్టిపరిస్థితుల్లోనూ పెట్రో ఉత్పత్తుల ధరలు పెంచబోమని హామీ ఇచ్చారు. ఆ వెంటనే సమ్మె విరమిస్తున్నట్లు ట్రక్కు యజమానులు చెప్పారు. ఆయిల్ ధరల నిర్ణయం ప్రభుత్వం చేతుల్లో ఉందికాబట్టి బ్రెజిల్ అధ్యక్షుడు తగిన నిర్ణయం తీసుకోగలిగారు. భారత్‌లో మాత్రం ఆ నిర్ణయాధికారం ఆయిల్ కంపెనీల చేతుల్లో ఉండటం, ప్రతిరోజూ సవరణ పేరుతో పైసలకు పైసలు ధరను పెంచుతూ పోవడం చూస్తున్నాం. ఇటీవల దేశ చరిత్రలోనే రికార్డుస్థాయికి పెట్రోల్, డీజల్ ధరలు పెరిగిపోవడం తెలిసిందే. అయితే, కర్ణాటక ఎన్నికల సందర్భంలో ఆయిల్ కంపెనీలు కొన్ని రోజుల పాటు ధరలను పెంచకపోవడం గమనార్హం. (సమ్మె కారణంగా ఎక్కడిక్కడే నిలిచిపోయిన ట్రక్కులు, ఇతర వాహనాలు) -
సమ్మెతో నిలిచిపోయిన లారీలు
ఆటోనగర్ (హైదరాబాద్): టోల్గేట్ల విధానాన్ని రద్ధుచేయాలని డిమాండ్ చేస్తూ ఆలిండియా మోటార్ ట్రాన్స్‌పోర్టు కాంగ్రెస్(ఏఎంటీసీ) ఇచ్చిన పిలుపు మేరకు నిరవధిక సమ్మె కొనసాగుతోంది. గత మూడు రోజులుగా ఆటోనగర్‌లోని పారిశ్రామిక వాడకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చే సరుకు రవాణాలు పూర్తిగా నిలిచిపోయాయి. ప్రతి రోజు నగరానికి 600నుంచి 700 వరకు సరకు రవాణా లారీలు తెలంగాణ నుంచే కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి వస్తుంటాయి. సమ్మె కారణంగా సదరు వాహనాలు ఎక్కడివక్కడే నిలిచిపోయాయి.