విశాఖ : అగ్నిప్రమాదంలో మృతి చెందిన హెచ్‌పీసీఎల్ ఉద్యోగి కుటుంబానికి కేంద్రమంత్రి వీరప్ప మొయిలీ రూ.కోటి ఎక్స్గ్రేషియా ప్రకటించారు. ప్రమాదంలో మృతి చెందినవారిలో ఒకరు హెచ్పీసీఎల్ పర్మినెంట్ ఉద్యోగి కాగా, మిగతావారు కాంట్రాక్ట్ ఉద్యోగులని తెలిపారు. మృతి చెందిన మరో ఏడుగురు కాంట్రాక్ట్ కార్మికుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.20 లక్షలు చెల్లించనున్నట్లు ఆయన తెలిపారు.
శనివారం వీరప్ప మొయిలీ హెచ్‌పీసీఎల్ ప్రమాద స్థలాన్ని సందర్శించి క్షతగాత్రులను పరామర్శించారు. మరోవైపు క్షతగాత్రులకు మెరుగైన చికిత్స కోసం ముంబయి తరలించనున్నట్లు ఆయన తెలిపారు. ప్రమాద సంఘటనపై విచారణ జరుపుతున్నామని, 15 రోజుల్లో నివేదిక వస్తుందని మొయిలీ తెలిపారు. హెచ్‌పీసీఎల్ దత్తా ఆధ్వర్యంలో విచారణ జరగనుంది. ఇప్పటివరకూ ఎనిమిది మృతులను గుర్తించినట్లు తెలిపారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని మొయిలీ స్పష్టం చేశారు. మరోవైపు ఈ ప్రమాదంలో మృతి చెందినవారి సంఖ్య 13కి చేరినట్లు సమాచారం.