HPCL fire accident
-
ఘోర విస్ఫోటనానికి 23 ఏళ్లు
సాక్షి, మల్కాపురం(విశాఖపట్టణం) : హెచ్పీసీఎల్లో ఘోర విస్ఫోటనం చోటుచేసుకుని నేటికి సరిగ్గా 23 ఏళ్లయింది. ఘోర ప్రమాదం జరిగి 23 ఏళ్లు గడుస్తున్నా నేటికీ ఆ క్షణాలు స్థానికులను వెంటాడుతూనే ఉన్నాయి. 1997 సెప్టెంబర్ 14(ఆదివారం)వ తేదీ ఉదయం.. పారిశ్రామిక ప్రాంతవాసులు ఇంకా నిద్రలేవలేదు. తెల్లవారుజాము 5.40 గంటల సమయంలో ఒక్కసారిగా పెద్ద భూకంపం వచ్చినట్టు ఆ ప్రాంతంలో భూమి కదిలింది. పెద్దగా శబ్ధం రావడంతో.. ఏం జరిగిందా? అనుకుంటూ కళ్లు నులుముతూ జనం ఇళ్ల నుంచి బయటకు వచ్చారు. ఇంతలో ఎదురుగా ఉన్న హెచ్‌పీసీఎల్ సంస్థ నుంచి పెద్ద ఎత్తున మంటలు, శబ్ధాలు రావడంతో జనం పరుగులు తీశారు. ఎవరికి వారు చెల్లాచెదురయ్యారు. భార్య ఒకచోట అయితే, భర్త మరో చోటుకు పరుగులు తీసి కొండలను లెక్కచేయక.. తెలియని ప్రాంతం అయినా ఎక్కిపోయారు. రెండు రోజులు గడిచినా వారు ఆ కొండల వద్దే కాలం గడపాల్సిన పరిస్థితి నెలకొంది. తిండి, నిద్రలేక అల్లాడి పోయారు. ప్రమాదం జరిగిందిలా.. పోర్టు జెట్టీ వద్ద నిలిపి ఉంచిన ఓ నౌక నుంచి హెచ్‌పీసీఎల్‌కు గ్యాస్‌ను పైపులైన్ల ద్వారా అన్లోడ్ చేస్తున్నారు. సంస్థలో ఓ చోట గ్యాస్ లీక్ కావడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ సంఘటనలో 61 మంది కార్మికులు మృతి చెందారు. నష్ట నివారణ చర్యలు 1997 ముందు ఎప్పుడూ ఇటువంటి సంఘటన జరగలేదు. దీనికి తోడు సంస్థలో ప్రమాదం చోటుచేసుకుంటే అదుపు చేసే పరికరాలు తక్కువే. నేడు టెక్నాలజీతో పోల్చి చూసుకుంటే నాడు తక్కువ. అప్పట్లో చాలా సేపటికి గానీ మంటలు అదుపులోకి రాలేదు. ఈ ప్రమాదంలో చాలా మంది మృతి చెందిన తర్వాత హెచ్‌పీసీఎల్ సంస్థ జాగ్రత్తలు చేపట్టింది. భవిష్యత్‌లో ఇటువంటి సంఘటనలు జరగకుండా ఎక్కడ గ్యాస్ లీకయినా ఆ వాల్వ్ కట్ అయిపోయేటట్టు.. ఆటోమెటిక్ వాల్వ్‌లను బిగించారు. అంతేకాకుండా ప్రమాదాలను ముందుగా గుర్తించేలా పరికరాలను అందుబాటులో ఉంచారు. పొరపాటున ప్రమాదం జరిగితే వెంటనే మంటలను ఆపేందుకు నీటి వాల్వ్‌లను ఏర్పాటు చేశారు. సంస్థలో ఏ చిన్న ప్రమాదం జరిగినా క్షణాల్లో సైరన్ మోగేలా చర్యలు తీసుకున్నారు. ఇలా నష్ట నివారణకు చర్యలు తీసుకున్నారు. హెచ్పీసీఎల్లో ఆ తర్వాత కొన్ని ప్రమాదాలు జరిగినా.. ఈ ఘోర ప్రమాదం తలచుకుంటే స్థానికులు ఇప్పటికీ గగుర్పాటుకు గురవుతున్నారు. -
హెచ్‌పీసీఎల్ యాజమాన్యానికి పనబాక క్లీన్చిట్
విశాఖ : విశాఖలోని హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్‌పీసీఎల్) లో పేలుడు ప్రమాద దుర్ఘటనపై యాజమాన్యానికి కేంద్రమంత్రి పనబాక లక్ష్మి క్లీన్చిట్ ఇచ్చారు. ఈ ప్రమాదంలో మృతి చెందినవారి కుటుంబాలకు మంత్రి పనబాక గురువారం 20 లక్షల నష్టపరిహారం అందచేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భద్రతపై జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కాగా హెచ్‌పీసీఎల్‌కు వ్యతిరేకంగా కేసు వేసిన విషయం తనకు తెలియదని పనబాక చెప్పుకొచ్చారు. కాగా గత ఏడాది ఆగస్ట్‌లో హెచ్పీసీఎల్లో జరిగిన పేలుడు ప్రమాదంలో 25మంది మృతి చెందారు. మృతులతో పాటు, క్షతగాత్రుల్లో చాలామంది కాంట్రాక్ట్ ఉద్యోగులే. మృతుల కుటుంబాలకు హెచ్‌పీసీఎల్ రూ.20 లక్షల ఆర్థిక సాయం ప్రకటించిన విషయం తెలిసిందే. -
25కు చేరిన హెచ్‌పీసీఎల్ మృతుల సంఖ్య
విశాఖ : విశాఖలోని హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్.పి.సి.ఎల్) లో జరిగిన భారీ అగ్నిప్రమాదం ఘటనలో మృతి చెందినవారి సంఖ్య 25కు చేరింది. ఓల్డ్ కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కాంట్రాక్ట్ కార్మికుడు అప్పల్రాజు శుక్రవారం మృతి చెందాడు. గత నెల 23వ తేదీన హెచ్పీసీఎల్లో ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఆ ప్రమాదంలో పదిమంది అక్కడికక్కడే చనిపోగా, చాలామంది తీవ్రంగా గాయపడ్డారు. 1997 తర్వాత హెచ్‌పిసిఎల్‌లో ఇంత భారీ స్థాయిలో ప్రమాదం జరగడం ఇదే మొదటిసారి. మృతులతో పాటు, క్షతగాత్రుల్లో చాలామాంది కాంట్రాక్ట్ ఉద్యోగులే. మృతుల కుటుంబాలకు హెచ్‌పీసీఎల్ రూ.20 లక్షల ఆర్థిక సాయం ప్రకటించింది. మరోవైపు తీవ్రంగా గాయపడినవారిని మెరుగైన చికిత్స నిమిత్తం ముంబయికి తరలించారు. -
సం..దేహాలు
విశాఖపట్నం-మెడికల్, న్యూస్‌లైన్: హెచ్‌పీసీఎల్ ప్రమాదంలో మృతదేహాల గుర్తింపు ప్రక్రియ గందరగోళంగా మారింది. కూలింగ్ టవర్ పేలిన ఘటనలో అక్కడ పని చేస్తున్న వారిలో కొంతమంది కార్మికులు గుర్తుపట్టలేని విధంగా కాలిపోయారు. దేహాలు పూర్తిగా మాడిపోవడంతో గుర్తించడం కష్టంగా మారింది. ఇటువంటి ఆరు మృతదేహాలు ప్రస్తుతం మెడికల్ కాలేజీ మార్చురీలో ఉన్నాయి. ఇవి ఎవరికి చెంది నవో తెలియని పరిస్థితి. ఈ పరిస్థితుల్లో డీఎన్ఏ పరీక్షలే గత్యంతరం. ఇదిలా ఉంటే ప్రమాద ఘటనలో మరి కొంతమంది గల్లంతైనట్లు వార్తలు వస్తున్నాయి. తమ వారి వివరాల కోసం పలువురు మార్చురీకి వస్తున్నారు. గుర్తుపట్టలేని విధంగా ఉన్న మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించేందుకు ఫోరెన్సిక్ వైద్యులపై పోలీసులు ఒత్తిడి తీసుకువస్తున్నట్లు సమాచారం. మృతుల కుటుంబాలకు హెచ్‌పీసీఎల్ యాజమాన్యం నష్టపరిహారాన్ని ప్రకటించింది. అది అందాలంటే డీఎన్ఏ నివేదిక తప్పనిసరి. పోలీసులు తొందరపడుతున్నప్పటికీ.. ఎవరి దేహాలను ఎవరు తీసుకువెళ్తామని, డీఎన్ఏ పరీక్షల్లో నిర్ధారణ అనంతరమే తీసుకువెళతామని కుటుంబ సభ్యులు పేర్కొంటున్నారు. పరీక్షలు జరగకుండా వేరే వారి దేహాలను తీసుకువెళ్లి దహన సంస్కారాలు చేయడం సంప్రదాయాన్ని విరుద్ధమంటున్నారు. మార్చురీలో ఆరు దేహాలలో ఒక దాని నుంచి డీఎన్ఏ పరీక్ష నిమిత్తం దంతాలతో పాటు తొడ, గుండె భాగాలలో అవశేషాలను సేకరించారు. దానిని ఒక కోల్డ్ చైన్ బాక్సులో భద్రపరచి డీఎన్ఏ పరీక్ష నిమిత్తం పోలీసులకు అప్పగించారు. ఆరు మృతదేహాల నుంచి డీఎన్ఏ శ్యాంపిల్స్ సేకరిస్తేనే కానీ మృతదేహాల గుర్తింపు ఒక కొలిక్కి వచ్చే అవకాశం లేదని వైద్యులు చెబుతున్నారు. కొద్దిరోజులు వేచి చూడడం ద్వారా గల్లంతైన వారి వివరాలు లభ్యమైతే అప్పుడు ఆరు దేహాలకు సంబంధించి ఆరు కుటుంబ సభ్యుల వివరాలు లభిస్తాయని, దీంతో వారందరికీ ఒకేసారి డీఎన్ఏ పరీక్షలు నిర్వహించవచ్చని వైద్యులు చెబుతున్నారు. ఏదేమైనా హెచ్‌పీసీఎల్ యాజమాన్యం నిర్లక్ష్యం, పోలీసులు అత్యుత్సాహంతో దేహాల గుర్తింపు గందరగోళంగా మారింది. సెవెన్‌హిల్స్ నుంచి ముంబయికి ఒకరి తరలింపు హెచ్‌పీసీఎల్ దుర్ఘటనలో తీవ్రం గా గాయపడి నగరంలో వివిధ కార్పొరేట్ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న 38 మందిలో ఒకర్ని ఆదివారం సాయంత్రం మెరుగైన చికిత్స కోసం ముంబయి తరలించారు. 45 నుంచి 50 శాతం కాలిన గాయాలకు గురై సెవెన్‌హిల్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నగరంలోని పెదగంట్యాడ దయాల్నగర్కు చెందిన పి.వెంకట్రావ్(44)ను ఆదివారం సాయంత్రం 7.15 గంటల సమయంలో ఎయిర్ అంబులెన్స్‌లో ముం బయిలోని నేషనల్ బర్న్స్ సెంటర్లకు తరలించారు. సెవెన్ హిల్స్ ఆస్పత్రిలో మృత్యువుతో పోరాడుతున్న 14 మందిలో ప్రత్యేక చికిత్సకు తట్టుకునే శక్తి వెంకట్రావుకు మాత్రమే ఉండడంతో అతన్ని ముంబయి పంపించాలని నిర్ణయించినట్టు హెచ్‌పీసీఎల్ అధికారి ఒకరు తెలిపారు. ఈ సంఘటనలో గాయపడి వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారిలో ఏడుగురిని మాత్రమే ముంబయిలోని నేషనల్ బర్న్స్ సెంటర్‌కు తరలించాలని ముంబయి నుంచి విశాఖ వచ్చిన వైద్యులు నిర్థారించారని జిల్లా ఇన్చార్జి కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ తెలిపారు. ముంబయి ప్రత్యేక చికిత్సకు ఎంపికచేసిన ఏడుగుర్ని ఒకేసారి విశాఖ నుంచి తరలించేందుకు తగిన సామర్థ్యం ఉన్న ఎయిర్ అంబులెన్స్‌ల సదుపాయం అందుబాటులో లేదు. నగరం నుంచి ఒకరిని మాత్రమే ముంబయి తరలించే ఎయిర్ అంబులెన్స్ అందుబాటులో ఉండడంతో ఆదివారం సాయంత్రం దానిలో వెంటరావును మాత్రమే ముంబయి తరలించారు. -
‘హెచ్‌పీసీఎల్’ దుర్ఘటనలో మరో ఆరుగురి మృతి
హెచ్‌పీసీఎల్ పేలుడు దుర్ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటివరకు 8 మంది మృతి చెందినట్టు ప్రభుత్వం, ప్లాంట్ వర్గాలు అధికారికంగా ప్రకటించాయి. ప్రమాదం జరిగిన శుక్రవారం నాడు ఇద్దరు మృతి చెందారని, శనివారం కూలింగ్ టవర్ శిథిలాల కింద మరో ఆరుగురి మృతదేహాలు లభ్యమైనట్టు హెచ్‌పీసీఎల్ ప్రకటించింది. మృతి చెందిన వారు పది మందికి పైగా ఉన్నారని బాధితుల బంధువులు, ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. మరోపక్క కూలింగ్ టవర్ శిథిలాల కింద చిక్కుకుని సజీవ సమాధైన వారు మరో 20 మంది వరకు ఉండొచ్చని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. టవర్‌లో భాగంగా 5 అడుగుల లోతున నిర్మించిన అయిదు సంప్‌లు కూలిపోయి ఆ మేర శిథిలాలు ఏర్పడ్డాయి. శనివారం రాత్రి వరకు మూడడుగుల మేర తొలగించారు. అత్యంత కష్టంగా సాగుతోన్న ఈ ప్రక్రియ పూర్తికావడానికి మరో రెండు రోజులు పట్టవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఈ దుర్ఘటనలో క్షతగాత్రులు 39 మందికి 40 నుంచి 70 శాతం వరకు కాలిన గాయాలైనట్లు వైద్యులు నిర్ధారించారు. 90 శాతానికిపైగా శరీరం కాలిపోయిన 9 మంది చికిత్సకు స్పందించని స్థితిలో ఉన్నారు. వారిని మెరుగైన వైద్యం కోసం ముంబైకి తరలించాలని యోచిస్తున్నారు. మరోవైపు మృతదేహాలు ఏమాత్రం గుర్తుపట్టడానికి వీల్లేని విధంగా కాలిపోయాయి. శనివారం వెలికితీసిన కార్మికుల మృతదేహాలైతే అగ్నికీలల ధాటికి మసైపోయాయి. గ్యాస్ లీకేజీ వల్లే ప్రమాదం... కూలింగ్ టవర్‌లోకి గ్యాస్ లీకేజీ వల్లే భారీ అగ్ని ప్రమాదం సంభవించినట్టు హెచ్‌పీసీఎల్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్(ఈడీ) వి.వి.ఆర్.నరసింహం వెల్లడించారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ, కూలింగ్ టవర్‌కు వెళ్లే పైపుల్లోకి గ్యాస్ (హైడ్రో కార్బన్, మీథేన్, ఈథేన్, ప్రొఫేన్) లీకేజీ కావడంతో పేలుడు సంభవించినట్టు ప్రాథమిక నిర్ధారణకొచ్చినట్లు చెప్పారు. గ్యాస్ భారీ స్థాయిలో రావడంతో అలారం పనిచేయలేదన్నారు. దీనిపై విచారణ జరపనున్నట్టు తెలిపారు. 2009లో నిర్మించిన రెండో కూలింగ్ టవర్‌ను యూరో-4 నాణ్యతాప్రమాణాల మేరకు ఆధునీకరిస్తుండగా ఈ ప్రమాదం సంభవించిందన్నారు. దుర్ఘటన సమయంలో కూలింగ్ టవర్ వద్ద సుమారు వంద మంది పనిచేస్తున్నారని చెప్పారు. శిథిలాల కింద ఆరుగురు ఉన్నట్టు గుర్తించామన్నారు. శిథిలాల తొలగింపులో పాల్గొన్న సిబ్బంది, ప్రమాదం నుంచి బయటపడిన ఇంజనీరింగ్ నిపుణులతో ‘సాక్షి’ మాట్లాడింది. పనులు పూర్తయిన టవర్‌లో నిర్వహించిన హైడ్రాలిక్ టెస్ట్, వెల్డింగ్ పనులే కొంప ముంచాయని వారు చెబుతున్నారు. హైడ్రాలిక్ టెస్ట్ సమయంలో ఒత్తిడి పెరిగిపోయి మంటలు చెలరేగాయి. అదే సమయంలో టవర్‌పైన వెల్డింగ్ పనులు కూడా ప్రమాదానికి దోహదం చేశాయి. టవర్‌లో ఉష్ణోగ్రత ఎక్కువై పేలుడు సంభవించింది. టవర్‌పై కూలింగ్ ఫ్యాన్ వద్ద పనిచేస్తున్న 12 మంది కార్మికులు నేరుగా సంప్‌లో పడిపోయారు. మరో ముగ్గురు ఎగిరి దూరంగా పడ్డారు. శిథిలాలన్నీ తొలగిస్తే మరిన్ని మృతదేహాలు బయటపడొచ్చని భావిస్తున్నారు. కాగా, తమ వారేమయ్యారో చెప్పాలంటూ కుటుంబసభ్యులు, బంధువులు హెచ్‌పీసీఎల్ విశాఖ రిఫైనరీ ప్రవేశద్వారం వద్ద శనివారం ఆందోళనకు దిగారు. మంత్రుల పరామర్శ... కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి వీరప్ప మొయిలీ శనివారం సాయంత్రం విశాఖ చేరుకుని హెచ్పీసీఎల్లో సంఘటన స్థలికి వెళ్లి పరిశీలించారు. ఆయన వెంట కేంద్ర మంత్రులు పనబాక లక్ష్మి, పురందేశ్వరి, ఎంపీ సుబ్బరామిరెడ్డి, మంత్రులు గంటా శ్రీనివాసరావు, బాలరాజు ఉన్నారు. అంతకుముందు టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీ నేత యనమల రామకృష్ణుడుతో కలసి హెచ్‌పీసీఎల్ ప్లాంట్‌కు వచ్చారు. తరువాత సెవెన్‌హిల్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు. ఈ సమయంలో బాధిత కుటుంబానికి చెందిన కొయ్యాన గౌరమ్మ అనే మహిళ చంద్రబాబును నిలదీశారు. అధికారులతో మాట్లాడి వెళ్లిపోవడంగాకుండా బాధితుల కష్టాలేమిటో తెలుసుకునే ప్రయత్నం చేయాలన్నారు. దర్యాపునకు ఆదేశం... పరిహారం ప్రకటన హెచ్పీసీఎల్లో పేలుడు ఘటనపై ప్రత్యేకంగా దర్యాప్తు జరిపి పక్షం రోజుల్లో నివేదిక ఇవ్వాలని దర్యాప్తు అధికారి వి.వి.ఆర్.నరసింహంను ఆదేశించినట్లు మొయిలీ చెప్పారు. హెచ్‌పీసీఎల్ అతిథిగృహంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. మృతి చెందిన కూలింగ్ టవర్ ఇన్చార్జి మురళి కుటుంబానికి రూ. కోటి నష్టపరిహారం ప్రకటించారు. కార్మికుల కుటుంబాలకు రూ. 20 లక్షల చొప్పున పరిహారం, వారి పిల్లల చదువుకయ్యే ఖర్చు మొత్తం భరిస్తామని ప్రకటించారు. సెవెన్‌హిల్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించిన కేంద్ర పెట్రోలియం శాఖ సహాయ మంత్రి పనబాక లక్ష్మి అనంతరం విలేకరులతో మాట్లాడారు. నివేదిక అందాక బాధ్యులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. సహాయక చర్యలను ముమ్మరం చేయాలని ప్రభుత్వ ఉన్నతాధికారులను సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ఆదేశించారు. -
హెచ్‌పీసీఎల్ కూలింగ్ టవర్ పేలుడు అసలు ఎలా జరిగింది?
వారి గుండెలన్నీ కన్నీటి సంద్రాలయ్యాయి. ఎవరిని కదిపినా పెను విషాదం. ఆస్పత్రుల ఎదుట గాయపడి చికిత్స పొందిన బాధితుల ఆర్తనాదాలు, ఆవేదనలు..శుక్రవారం జరిగినహెచ్పీసీఎల్ పేలుడు దుర్ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతోంది. ప్రమాద స్థలంలో ఇంకెన్ని మృతదేహాలు బయట పడతాయో తెలియని అయోమయం. శనివారం కూలింగ్ టవర్ శిథిలాల కింద ఆరు మృతదేహాలు లభ్యమైనట్టు హెచ్‌పీసీఎల్ ప్రకటించింది. దీంతో ఇప్పటివరకు మొత్తం ఎనిమిదిమంది మృతి చెందినట్టు ప్రభుత్వం, ప్లాంట్ వర్గాలు అధికారికంగా పేర్కొన్నాయి. సాక్షి, విశాఖపట్నం : హెచ్‌పీసీఎల్ కూలింగ్ టవర్ పేలుడు అసలు ఎలా జరిగింది? ఆసమయంలో ఎంతమంది సజీవ సమాధి అయ్యారు? టవర్ నిర్మాణంలో వాడే చెక్క,దానికి రక్షణగా వాడే రసాయన షీట్లు ఎందుకు మండాయి. టవర్ పక్కనే ఉన్న కొండ ఓ వైపు భాగంలో మంటలు ఎందుకు చెలరేగాయి... పనిచేస్తున్న కార్మికులు, ఉద్యోగులు ఎలా సజీవసమాధి అయ్యారు? ఇవన్నీ బయట ప్రపంచానికి తెలియని వాస్తవాలు. సాక్షి వీటిని సేకరించగలిగింది. ప్లాంట్‌లో ప్రమాదం జరిగిన ప్రాంతానికి చేరుకుంది. చుట్టూ బొగ్గుగా మారిన మృతదేహాలు, ముక్కలుముక్కలుగా విడిపోతున్న వీటిని బయటకు లాగుతున్న సిబ్బందిని పలకరించింది. ప్రమాదం నుంచి బతికి బయటపడిన ఇంజినీరింగ్ నిపుణులతో మాట్లాడగా నమ్మలేని నిజాలు వెల్లడయ్యాయి. వివరాల్లోకి వెళితే...పనులు పూర్తయిన టవర్‌లో జరిగిన హైడ్రాలిక్ టెస్ట్, వెల్డింగ్ పనులే కొంపముంచాయని ప్రాథమికంగా నిర్థారించారు. చమురుశుద్ధి ప్రక్రియలో నీరు అత్యంత ఉష్ణోగ్రతకు చేరుతుంది. ఈ నీటిని కూలింగ్ టవర్లకు పైపులైన్ల ద్వారా పంపి భారీ ఫ్యాన్లతో చల్లారుస్తారు. ఘటనా స్థలిలో ఇప్పటికే ఓ భారీ టవర్ ఉండగా దాని పక్కనే కొత్తదాన్ని నిర్మిస్తున్నారు. టవర్ నిర్మాణంలో ఇనుము వాడితే తప్పుపడుతుందన్న ఉద్దేశంతో దేవదారు చెక్కతోనే మొత్తం నిర్మిస్తారు. భూమికి సమాంతరంగా ఐదడుగుల లోతు, నాలుగు మీటర్ల వెడల్పున ఐదు గొయ్యిలు (సంప్‌లు) తీస్తారు. ఈ సంప్‌లు కప్పి ఉంచేలా 50 అడుగుల ఎత్తున టవర్ నిర్మిస్తారు. టవర్‌పైన భారీ కూలింగ్ ఫ్యాన్ ఏర్పాటు చేస్తారు. టవర్ ఉపరితలం మొత్తాన్ని రబ్బరు, రసాయనాలు కలిపిన షీట్లతో కప్పుతారు. ప్రమాదం జరిగిన టవర్ పనులన్నీ పూర్తయ్యాయి. సంపులకు పైపులు కూడా బిగించేశారు. కొద్దిరోజుల్లో ప్రారంభించనున్నందున పైపుల్లో లీకులు కనుగొనేందుకు శుక్రవారం ఇంజినీర్లు హైడ్రాలిక్ టెస్ట్ నిర్వహిస్తున్నారు. ఈ సమయంలో ఒత్తిడి పెరిగిపోయి మంటలు చెలరేగాయి. అదే సమయంలో టవర్‌పైన వెల్డింగ్ పనులు జరుగుతుండడంతో ఈ మంటలకు మరింత ఆజ్యం పోసినట్టయింది. మంటలు విస్తరించి కూలింగ్ ఫ్యాన్‌తోపాటు రబ్బరుతో కూడిన రసాయిన షీట్లకు అంటుకున్నాయి. టవర్‌లో ఉష్ణోగ్రత ఎక్కువై పేలుడు సంభవించింది. దీంతో పైన ఉన్న కూలింగ్ఫ్యాన్ ఎగిరి ముక్కలై పక్కనే ఉన్న కొండపై పడింది. దీంతో కొండప్రాంతంలో పలుచోట్ల మంటలు చెలరేగాయి. కొండభాగం కూడా ఈ కారణంగానే ధ్వంసమయింది. ఈ దెబ్బకు టవర్‌పైన కూలింగ్ ఫ్యాన్ వద్ద పనిచేస్తున్న 12 మంది కార్మికులు నేరుగా సం ప్లో పడిపోయారు. మరో ముగ్గురు ఎగిరి దూరం గా పడ్డారు. పేలుడు తరువాత రసాయన షీట్లు, దేవదారు చెక్క, ఫ్యాన్ శకలాలు వీరిపై పడి అయిదడుగుల లోతున్న సంప్పూర్తిగా శిథిలాలతో నిండిపోయింది. ఒకటి, ఐదో నంబర్ షంపుల్లో ఎక్కువ మంది చిక్కుకున్నారు. వీటిని తొలగించేకొద్ది మృతదేహాలు బయటపడుతున్నాయి. శనివారం ఒక్కరోజే గుర్తుపట్టలేని విధంగా ఉన్న ఆరు మృతదేహాలను బయటకు తీశారు. శిథిలాలన్నీ తొలగిస్తే మరిన్ని మృతదేహాలు బయటపడే అవకాశం ఉంది. -
రత్నాలా? రాళ్లా?!
బ్రహ్మాండమైన పనితీరును ప్రదర్శిస్తున్న తొమ్మిది ప్రభుత్వరంగ సంస్థలను ‘నవరత్నా’లుగా వర్గీకరించడం పదిహేనేళ్లక్రితం మొదలైంది. అటు తర్వాత ‘మినీ రత్న’లు, ‘మహారత్న’లు పుట్టుకొచ్చాయి. ఈ జాబితాలన్నీ నానాటికీ పెరుగుతూనే ఉన్నాయి. పేరుకు నవరత్నాలే అయినా ఆ జాబితాలో ఇప్పుడు 14 సంస్థలున్నాయి. ఎటుచూసినా రత్నాలే కనిపిస్తుండటాన్నిబట్టి అవన్నీ కార్మికులను, ఇతర సిబ్బందిని బాగా పట్టించుకుంటున్నాయని, వారి భద్రతకు గట్టి చర్యలు తీసుకుంటున్నాయని అనుకోవడానికి లేదు. నికర లాభార్జన, ఉత్పాదకత వంటివన్నీ పరిగణించి ఈ వర్గీకరణలు చేస్తున్నారు. వాటిని ప్రపంచస్థాయి మహాసంస్థలుగా రూపుదిద్దడానికి అవసరమైన నిర్ణయాలను సొంతంగా తీసుకోవడానికి ఆ సంస్థలకు అధికారాలివ్వడమే ఈ వర్గీకరణల అంతరార్థం. అయితే, ఈ రత్నాలను నిర్ధారించే కొలమానాల్లో భద్రతా ప్రమాణాలు మాత్రం లేవు. విశాఖపట్నంలోని హిందూస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్‌పీసీఎల్) రిఫైనరీలో శుక్రవారం చోటుచేసుకున్న భారీ అగ్ని ప్రమాదానికి ఇలాంటి నిర్లక్ష్యమే కారణమని వేరే చెప్పనవసరంలేదు. ఈ ప్రమాదంలో ఇప్పటికి 8 మంది మరణించగా, దాదాపు 90 మంది గాయపడ్డారు. వీరిలో 20 మంది పరిస్థితి విషమంగా ఉన్నదని చెబుతున్నారు. వీరంతా 50 నుంచి 80 శాతం ఒళ్లు కాలిపోయి నరకయాతన అనుభవిస్తున్నారు. అనేక మందికి కళ్లు కాలిపోయాయి. శ్వాస తీసుకోవడమే కష్టంగా మారిందని బాధితులు చెబుతున్నారు. ప్రమాదం జరిగిన అరగంట వరకూ ఆ సమీప ప్రాంతంలోకి ఎవరూ వెళ్లలేకపోయారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉన్నదో ఊహించుకోవచ్చు. పనిచేస్తున్నవారిలో ఎక్కువ మంది కాంట్రాక్టు కార్మికులైనందువల్ల గల్లంతయినవారెందరో తెలియడంలేదని సమాచారం. హెచ్పీసీఎల్లో ఇది మొదటి ప్రమాదం కాదు. అడపాదడపా అవి చోటు చేసుకుంటూనే ఉన్నాయి. 1997లో అయితే భారీ ప్రమాదం సంభవించి 62 మంది ఉద్యోగులు మృత్యువాతపడ్డారు. మూడేళ్లక్రితం ఒక ప్రమాదం జరిగి ముగ్గురు మరణించారు. మూడునెలల క్రితం కూడా అక్కడి ఒక ప్లాంట్‌లో హఠాత్తుగా మంటలు చెలరేగాయి. ఈ సందర్భాలన్నిటా ప్రమాద హెచ్చరికలు చేయడమనేదే జరగలేదని కార్మికులు చెబుతున్నారు. హెచ్‌పీసీఎల్ సంస్థ వార్షిక టర్నోవర్ లక్షా 90 వేల కోట్ల రూపాయలు. దీనికి ముంబై, విశాఖల్లో రిఫైనరీలుండగా విశాఖలోని యూనిట్ చాలా పెద్దది. ఇక్కడి రిఫైనరీ వార్షిక సామర్థ్యం 8.3 మిలియన్ టన్నులు. యూరో ప్రమాణాలకు అనుగుణంగా డీజిల్, పెట్రోల్ సరఫరా చేయడానికి కోట్లాది రూపాయలు వ్యయం చేస్తున్న సంస్థ సాధారణ కార్మికుల భద్రత విషయంలో ఏపాటి చర్యలు తీసుకుంటున్నదో చెప్పడానికి తరచు జరుగుతున్న ప్రమాదాలు, వాటిపై అది స్పందిస్తున్న తీరే నిదర్శనం. కూలింగ్ టవర్ పైభాగంలో వెల్డింగ్ పనులు నిర్వహిస్తుండగా వచ్చిన నిప్పురవ్వలు కిందనున్న రసాయన వ్యర్థాలపై పడటం వల్లే మంటలు వ్యాపించాయని అంటున్నారు. అత్యంత ప్రమాదకరమైన రసాయన వ్యర్థాలు ఎక్కడబడితే అక్కడ పడి ఉన్నాయంటేనే సంస్థలో భద్రతా చర్యలు ఎలా ఉన్నాయో అర్థమవుతుంది. బాధితుల్లో చాలామంది ఉద్యోగ భద్రతలేని కాంట్రాక్టు కార్మికులే. వారిలో తాము చేస్తున్న పనికి సంబంధించి, అందులో ఇమిడి ఉన్న ప్రమాదాల గురించి... అనుకోని ఘటనలు సంభవించినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఏమేరకు అవగాహన ఉంది? అందుకోసం యాజమాన్యం ఆ కాంట్రాక్టు కార్మికులకు ఇప్పించిన తర్ఫీదు ఏమిటి? నిజంగా అలాంటి అవగాహనే కల్పించినట్టయితే, పనులు జరుగుతున్న చోట ప్రమాదకర వ్యర్థాలు ఎందుకున్నట్టు? ఎలాంటి ప్రమాదాలు చోటుచేసుకో గల అవకాశాలున్నాయో, వాటికి వెనువెంటనే స్పందించాల్సిన తీరేమిటో తెలిసిన ప్రత్యేక బృందం ఏమైనా ఉన్నదా? ఇవన్నీ తేలవలసిన ప్రశ్నలు. అంతేకాదు, కూలింగ్ టవర్ కిందన ఉన్న నాఫ్తా పైప్‌లైన్ గత కొన్ని రోజులుగా లీకవుతున్నదని తెలిసినా దాన్ని చక్కదిద్దడంలో గానీ, వెల్డింగ్ పనులు ఆపడంలోగానీ అధికారులు శ్రద్ధ పెట్టలేదంటున్నారు. అక్కడ తరచు జరుగుతున్న ప్రమాదాల ధోరణి గమనిస్తే లాభార్జనపైనా, టర్నోవర్పైనా ఉండే దృష్టి భద్రతాపరమైన జాగ్రత్తలపై అసలే లేదని అర్ధమవుతుంది. ఒక్క హెచ్‌పీసీఎల్ మాత్రమే కాదు... విశాఖలో ఉండే ఇతర ప్రభుత్వ రంగ సంస్థల్లో కూడా భద్రత అంతంతమాత్రంగానే ఉంది. గత ఏడాది విశాఖ ఉక్కు కర్మాగారంలో సంభవించిన రెండు పేలుళ్లలో 22 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. వారిలో కూడా ఎక్కువ మంది కాంట్రాక్టు కార్మికులే. విశాఖ చుట్టు పట్ల 50 రసాయనిక, ఫార్మా కంపెనీలు, 40 ఇతరత్రా పరిశ్రమలు ఉన్నాయి. ఇందులో చాలా పరిశ్రమల్లో కనీసం ఫస్ట్ ఎయిడ్ కూడా లేదని చెబుతున్నారు. ఇవి నిర్వహణకే పనికిరావని అంటున్నారు. వీటన్నిటినుంచీ నిత్యమూ వెలువడే రసా యనిక వ్యర్థాలు ఆ నగర ప్రజలను ఊపిరాడనివ్వకుండా చేస్తున్నాయి. హఠాత్తుగా మంటలు కనబడితే, పీల్చేగాలి విషవాయువులు మోసుకొస్తే ప్రజలు ప్రాణ భయంతో సతమతమవుతున్నారు. లాభార్జన కోసం సాగించే వెంపర్లాటలో వెయ్యోవంతైనా భద్రతపై ఉన్నట్టయితే సాధారణ కార్మికులు, ఆ ప్రాంతంలోని లక్షలాది మంది ప్రజలు క్షేమంగా ఉండగలుగుతారు. నవరత్నంగా భుజకీర్తులు తగిలించుకున్న ప్రభుత్వరంగ సంస్థల్లోనే భద్రత ఇంత నాసిరకంగా ఉంటే, ఇక మిగిలిన సంస్థల పరిస్థితి చెప్పేదేముంది? ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం కళ్లు తెర వాలి. కార్మికుడి భద్రతకు అత్యంత ప్రాముఖ్యమిచ్చేలా పీఎస్‌యూలను తీర్చిదిద్ది, మిగిలిన సంస్థలకు అవి మార్గదర్శకంగా ఉండేలా చూడాలి. మనిషి ప్రాణానికి, క్షేమానికి విలువనివ్వని రత్నాలు గులకరాళ్లతో సమానమని గ్రహించాలి. -
చనిపోయిన హెచ్‌పీసీఎల్ ఉద్యోగికి రూ.కోటి ఎక్స్‌గ్రేషియా
విశాఖ : అగ్నిప్రమాదంలో మృతి చెందిన హెచ్‌పీసీఎల్ ఉద్యోగి కుటుంబానికి కేంద్రమంత్రి వీరప్ప మొయిలీ రూ.కోటి ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. ప్రమాదంలో మృతి చెందినవారిలో ఒకరు హెచ్‌పీసీఎల్ పర్మినెంట్ ఉద్యోగి కాగా, మిగతావారు కాంట్రాక్ట్ ఉద్యోగులని తెలిపారు. మృతి చెందిన మరో ఏడుగురు కాంట్రాక్ట్ కార్మికుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.20 లక్షలు చెల్లించనున్నట్లు ఆయన తెలిపారు. శనివారం వీరప్ప మొయిలీ హెచ్‌పీసీఎల్ ప్రమాద స్థలాన్ని సందర్శించి క్షతగాత్రులను పరామర్శించారు. మరోవైపు క్షతగాత్రులకు మెరుగైన చికిత్స కోసం ముంబయి తరలించనున్నట్లు ఆయన తెలిపారు. ప్రమాద సంఘటనపై విచారణ జరుపుతున్నామని, 15 రోజుల్లో నివేదిక వస్తుందని మొయిలీ తెలిపారు. హెచ్‌పీసీఎల్ దత్తా ఆధ్వర్యంలో విచారణ జరగనుంది. ఇప్పటివరకూ ఎనిమిది మృతులను గుర్తించినట్లు తెలిపారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని మొయిలీ స్పష్టం చేశారు. మరోవైపు ఈ ప్రమాదంలో మృతి చెందినవారి సంఖ్య 13కి చేరినట్లు సమాచారం. -
ప్రమాదానికి బాధ్యతారాహిత్యమే కారణం: బాబు
విశాఖ : విశాఖ హెచ్పీసీఎల్లో జరిగిన అగ్ని ప్రమాదానికి కంపెనీ అధికారులు బాధ్యతారాహిత్యమే కారణమని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు అన్నారు. ఆయన శనివారం ప్రమాద ఘటనలో మృతి చెందినవారి కుటుంబాలను పరామర్శించారు. అనంతరం చంద్రబాబు మీడియా సమావేశంలో మాట్లాడుతూ ప్రమాదం ఎలా జరిగిందో చెప్పలేని స్థితిలో అధికారులు ఉన్నారని మండిపడ్డారు. ఈ సంఘటనపై విచారణ జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. భవిష్యత్‌లో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. మృతుల కుటుంబాలకు రూ.25లక్షలు ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. అలాగే మృతి చెందినవారి కుటుంబంలోని ఒకరికి ఉద్యోం ఇవ్వాలన్నారు. కాగా హెచ్పీసీఎల్లో నిన్న సాయంత్రం అగ్ని ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. -
హెచ్‌పీసీఎల్ బాధితులకు మొయిలీ పరామర్శ
విశాఖ : కేంద్రమంత్రి వీరప్ప మొయిలీ శనివారం హెచ్‌పీసీఎల్ బాధితులను పరామర్శించారు. బాధితులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఘటనాస్థలాన్ని పరిశీలించిన మొయిలీ అనంతరం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితుల్ని పరామర్శించారు. వైద్య సహాయం గురించి అడిగి తెలుసుకున్నారు. మరోవైపు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు కూడా హెచ్‌పీసీఎల్ ప్రమాద బాధితుల్ని పరామర్శించారు. ప్రభుత్వం బాధితుల్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. తక్షణమే నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. -
హెచ్‌పీసీఎల్ దుర్ఘటనలో ఆరుగురే చనిపోయారు
విశాఖ : హెచ్‌పీసీఎల్ అగ్ని ప్రమాద ఘటనలో ప్రభుత్వ లెక్కల ప్రకారం ఆరుగురే చనిపోయారని కేంద్రమంత్రి పనబాక లక్ష్మి వెల్లడించారు. నష్టపరిహార విషయాన్ని వీరప్ప మొయిలీ నిర్ణయిస్తారని ఆమె తెలిపారు. ప్రమాద ఘటనపై విచారణ కమిటీ వేశామని, నివేదిక రాగానే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని పనబాక చెప్పారు. మరోవైపు హెచ్‌పీసీఎల్ అతిథిగృహంలో మంత్రి పనబాక లక్ష్మిని క్షతగాత్రుల బాధితులు ఘొరావ్ చేశారు. ప్రమాద ఘటనపై అధికారులు సరైన సమాచారం ఇవ్వటం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. హెచ్పీసీఎల్లో శుక్రవారం సాయంత్రం కూలింగ్ టవర్ పేలి భారీ అగ్ని ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. కాగా హెచ్‌పీసీఎల్ ప్రమాద ఘటనను పరిశీలించేందుకు కేంద్రమంత్రి వీరప్ప మొయిలీ ఈరోజు మధ్యాహ్నం విశాఖ రానున్నారు. -
హెచ్‌పీసీఎల్ ప్రమాదంలో 11కు చేరిన మృతుల సంఖ్య
విశాఖపట్నం: నగరంలోని హెచ్‌పీసీఎల్ సంస్థకు చెందిన రిఫైనరీలో నిన్న సాయంత్రం జరిగిన అగ్ని ప్రమాదఘటనలో మృతుల సంఖ్య 11కు చేరింది. ఈ ప్రమాదంలో గాయపడి నగరంలోని వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న 36 మంది పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. ప్రమాద ఘటనలో మరణించిన, గాయపడిన వారి వివరాలు కోసం 180042500002 నెంబర్‌కు ఫోన్ చేయాలని ఉన్నతాధికారులు చెప్పారు. ప్రమాదం వివరాలు తెలిపేందుకు హెచ్‌పీసీఎల్ అధికారులు మీడియా సమావేశం ఏర్పాటు చేయగా, దానిని మృతుల బంధువులు అడ్డుకున్నారు. ఆచూకీ తెలియని మృతదేహాల కోసం అధికారులను వారు నిలదీశారు. దాంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. ఇదిలా ఉండగా, కేంద్ర మంత్రి పనబాక లక్ష్మీ అగ్నిప్రమాద ఘటన స్థలాన్ని శనివారం సందర్శించారు. ప్రమాదానికి సంబంధించిన వివరాలను ఆ సంస్థ ఉన్నతాధికారులనడిగి తెలుసుకున్నారు. కేంద్ర మంత్రి వీరప్ప మొయిలీ కూడా ఈ మధ్యాహ్నం ప్రత్యేక విమానంలో ఇక్కడికి రానున్నారు. ప్రమాద ఘటనాస్థలాన్ని ఆయన పరిశీలిస్తారు. -
విశాఖ హెచ్పీసీఎల్లో అగ్ని ప్రమాదం
-
విశాఖ హెచ్పీసీఎల్లో అగ్ని ప్రమాదం: నలుగురు మృతి
* 20 మంది పరిస్థితి విషమం.. * 50 నుంచి 80 శాతం ఒళ్లు కాలిపోయి నరకయాతన * కూలింగ్ టవర్‌లో ఒక్కసారిగా ఎగసిపడ్డ మంటలు * 50 మీటర్ల ఎత్తుకు అగ్నికీలలు * ప్రమాదం సమయంలో నిర్మాణ పనుల్లో 200 మంది కార్మికులు సాక్షి, విశాఖపట్నం: విశాఖపట్నంలోని హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్‌పీసీఎల్) రిఫైనరీలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. పెద్దఎత్తున చెలరేగిన మంటల్లో చిక్కుకొని ఒకరు అక్కడికక్కడే చనిపోగా, మరో ముగ్గురు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారని హెచ్‌పీసీఎల్, ప్రభుత్వ వర్గాలు ప్రకటించాయి. వీరిలో ఒకరు హెచ్‌పీసీఎల్ ఉద్యోగి కాగా, ఇద్దరు కార్మికులు. ప్రమాద తీవ్రత చూస్తే మృతుల సంఖ్య 15కు పైనే ఉండవచ్చని బాధితుల బంధువులు, వైద్యులు చెబుతున్నారు. శుక్రవారం సాయంత్రం చోటుచేసుకున్న ఈ ఘటనలో మొత్తం 38 మంది గాయపడ్డారు. వీరిలో 20 మంది పరిస్థితి విషమంగా ఉంది. 50 నుంచి 80 శాతం ఒళ్లు కాలిపోయి వీరంతా నరకయాతన అనుభవిస్తున్నారు. బాధితుల్లో 16 మంది విశాఖలోని కేర్ ఆస్పత్రిలో, ఐదుగురు మణిపాల్ ఆస్పత్రిలో, 14 మంది సెవెన్‌హిల్స్ ఆస్పత్రిలో, కళ్యాణి ఆసుపత్రిలో ముగ్గురు చికిత్స పొందుతున్నారు. వీరిలో చాలామంది చికిత్సకు స్పందించడం లేదని వైద్యులు తెలిపారు. ప్రమాదం జరిగిందిలా.. హెచ్‌పీసీల్ సంస్థ ఆవరణలో కొన్నేళ్లుగా కూలింగ్ టవర్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. గోపాల్, జయలక్ష్మి ఇంజనీరింగ్, డ్రిజ్ అండ్ గూప్ సంస్థలు ఈ పనులు చేపడుతున్నాయి. ఇందుకు 200 మంది కార్మికులకుపైగా ఇక్కడ విధులు నిర్వహిస్తున్నారు. శుక్రవారం కూలింగ్ టవర్ పైభాగంలో వెల్డింగ్ పనులు నిర్వహిస్తుండగా నిప్పు రవ్వలు జారి కింద ఉన్న రసాయన వ్యర్థాలపై పడడంతో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. టవర్ చుట్టూ పనికి రాని చెక్కలు, స్టేజింగ్ కోసం ఏర్పాటు చేసిన కర్రలు, ఇతర వ్యర్థాలు ఉండడంతో మంటలు 50 మీటర్లు ఎత్తుకు వ్యాపించాయి. ఆ సమయంలో అక్కడే ఉన్న హెచ్‌పీసీఎల్ ఉద్యోగి, కూలింగ్ టవర్ ఇన్చార్జి మురళి అక్కడికక్కడే మృతి చెందారు. ఆస్పత్రిలో నక్కా వెంకటరమణ (ఫిట్టర్), మండల్ చనిపోయారు. టవర్ వద్ద పనిచేస్తున్న కార్మికుల్లో 50 మందికిపైగా గాయాలపాలైనట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ప్రమాదం చోటుచేసుకున్నప్పుడు ఆ ప్రాంగణమంతా దట్టమైన పొగలు, మంటలు అలముకోవడంతో గాయపడిన వారిని రక్షించేందుకు ఎవరూ సాహసించలేదు. అరగంట వరకు ఆ ప్రదేశానికి ఎవరూ వెళ్లలేని పరిస్థితి నెలకొంది. విషయం తెలుసుకున్న కంపెనీ అధికారులు క్షతగాత్రులను తొలుత నేవీ ఆసుపత్రికి త రలించారు. వివిధ కంపెనీలకు చెందిన అగ్నిమాపక వాహనాలకు సమాచారం అందించడంతో అక్కడకు చేరుకొన్న సిబ్బంది రెండు గంటల వ్యవధిలో మంటలను అదుపు చేశారు. ప్లాంట్ పనులు నిర్వహిస్తున్న కార్మికులకు గుర్తింపుకార్డులు లేకపోవడంతో అసలు ప్రమాదంలో చిక్కుకున్న వారెవరు? వారి వివరాలు పూర్తిగా తెలియడం లేదు. శ్వాస కూడా తీసుకోలేని స్థితిలో బాధితులు.. అగ్ని ప్రమాదంలో ముగ్గురు మృతి చెందినట్లు అధికారులు ధ్రువీకరిస్తున్నా వీరి సంఖ్య 15 మందికిపైనే ఉండొచ్చని తెలుస్తోంది. ప్రమాద తీవ్రతను తగ్గించి చూపుతున్నారని హెచ్‌పీసీఎల్ వద్ద కార్మికుల బంధువులు ఆందోళనలకు దిగారు. చికిత్స పొందుతున్న 38 మందిలో అధికశాతం స్థానికులే. వీరిలో చాలామందికి ప్రమాదంలో కళ్లు కాలిపోయాయి. రక్తం తీవ్రంగా పోయింది. శరీర అవయవాలు కాలిపోవడంతో శ్వాస తీసుకునే పరిస్థితిలో లేరు. దీంతో ప్రమాద ఘటనలో మృతుల సంఖ్య మరింత పెరగవచ్చని చెబుతున్నారు. హెచ్‌పీసీఎల్ ప్రమాద ఘటనపై విచారణ చేపట్టేందుకు నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎన్డీఆర్ఎఫ్) రంగంలోకి దిగింది. ప్రమాదంపై గుంటూరులో ఉన్న ఎన్డీఆర్ఎఫ్కి సమాచారమందించారు. శుక్రవారం రాత్రి ఒక బృందం విశాఖ చేరుకుంది. ప్రమాదానికి గల కారణాలతోపాటు ఘటనపై వీరు దర్యాప్తు చేపట్టనున్నారు. 50 నుంచి 80 శాతం కాలిన గాయాలతో బాధపడుతున్నవారి వివరాలు.. మామిడి శ్రీనివాస్, ఏడూరి వెంకట సత్యారావు, కృష్ణచంద్ర, ఎం.ప్రధాన్, జి.వరుణ్‌కుమార్, ఎ.అప్పలరాజు, ఎస్.సన్యాసిరావు, తోట రావు, శంకరరావు, బి.రమణ, సోమయ్య, అనంత్, ఎస్.మన్నా, అసిత్ ముండన్, మనోజిత్ ప్రధాన్, ఎన్.కొండయ్య, వై.సోములు, ఆర్.వెంకటరావు. కింద ఉన్నవారంతా మంటల బారిన పడ్డారు.. కూలింగ్ టవర్ కోసం 15 మీటర్ల ఎత్తులో ఇద్దరం పనిచేస్తున్నాం. కింద 40 మంది పనిచేస్తున్నారు. కిందన ఉన్నవారు ఒకవైపు వెల్డింగ్ పనులు చేస్తున్నారు. మరోవైపు సాల్ట్‌వాటర్ పట్టడానికి పైపింగ్ చేస్తున్నారు. సాయంత్రం 4.30 గంటల సమయంలో ఒక్కసారిగా పైపులో నుంచి మంటలొచ్చాయి. కింద ఉన్నవారంతా మంటల బారిన పడ్డారు. ప్రమాదమెందుకు జరిగిందో తెలియదు. నేను, మరో కార్మికుడు పది నిమిషాల తర్వాత కిందకి దిగాం. చుట్టుపక్కల వారి సాయంతో కాలిపోయిన వారిని బయటికి తీసుకొచ్చాం. - ఎ.వెంకటరమణ, ప్రత్యక్ష సాక్షి, మంగళపాలెం, గాజువాక అకస్మాత్తుగా మంటలొచ్చాయి నేను గోపాల్ ఇంజనీరింగ్ కంపెనీకి చెందిన వర్కర్‌ను. 30 నుంచి 40 మంది వరకు కూలింగ్ టవర్ పనుల్లో ఉన్నాం. పైపులో నుంచి ఒక్కసారిగా మంటలొచ్చాయి. పరుగెత్తలేక మంటల్లోనే చిక్కుకుపోయాం. చివరికి ఎలాగోలా బయటపడ్డా. -ఎ.అప్పారావు, క్షతగాత్రుడు, దువ్వాడ రైల్వే స్టేషన్ ఏరియా ఎందుకు జరిగిందో తెలియదు కూలింగ్ టవర్ కోసం స్ట్రక్చర్‌పై స్ట్రక్చర్ వేస్తున్నాం. ఇంతలోనే పైపులో నుంచి మంటలొచ్చాయి. క్షణాల్లోనే వ్యాపించాయి. అసలు మంటలెందుకొచ్చాయో తెలియదు. - పి.వెంకటరావు, క్షతగాత్రుడు, బీసీ రోడ్డు, గాజువాక నిర్లక్ష్యంతోనే ప్రమాదం.. కూలింగ్ టవర్ ట్రయల్స్‌లో ఉంది. టవర్ పనులు చేస్తుండగా ఆరు నెలల క్రితం ఒకసారి, రెండు నెలల క్రితం ఒకసారి పైప్‌లైన్ లీకయింది. హై రిస్క్, హై టెంపరేచర్ గల ప్రమాదకర పరిశ్రమ ఇది. ఇక్కడ అనేక జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది. ముఖ్యంగా నైపుణ్యం గల సిబ్బందితో పనిచేయించాలి. కానీ యాజమాన్యం కాంట్రాక్టర్‌కు అప్పగించేసింది. నిర్లక్ష్యంతోనే ఈ ప్రమాదం జరిగింది. మృతుల కుటుంబీకులకు రెగ్యులర్ ఉద్యోగమివ్వాలి. రూ.25 లక్షల నష్టపరిహారం చెల్లించాలి. గాయపడినవారికి రూ.5 లక్షల నష్టపరిహారం ఇవ్వాలి. - అజయ్‌శర్మ, సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, విశాఖపట్నం 1997 నాటి పీడకలను తలపిస్తూ.. గాజువాక, న్యూస్‌లైన్: విశాఖలోని హెచ్‌పీసీఎల్ రిఫైనరీలో శుక్రవారం చోటు చేసుకున్న ప్రమాదం పారిశ్రామిక ప్రాంత ప్రజలను భయభ్రాంతులకు గురి చేసింది. భీతిల్లిన జనం 1997 సెప్టెంబర్ 14న జరిగిన ఘోర విస్ఫోటనాన్ని గుర్తుకు తెచ్చుకున్నారు. నాడు హెచ్పీసీఎల్లో స్పియర్ ట్యాంకులు పేలిపోవడంతో 62 మంది ఉద్యోగులు మృత్యువాత పడ్డారు. ఆ మంటలు నాలుగు రోజులకుగానీ అదుపులోకి రాలేదు. ఈ ఘటన తర్వాత యాజమాన్యం భద్రతా ప్రమాణాల విషయంలో జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ అడపాదడపా ప్రమాదాలు చోటుచేసుకుంటూనే ఉన్నాయి. మూడేళ్ల క్రితం జరిగిన ప్రమాదంలో ముగ్గురు మరణించారు. చిన్నచిన్న ప్రమాదాలు చోటుచేసుకుంటున్నా వెలుగులోకి రావడం లేదు. ప్లాంట్‌లోని సీడీ-3 యూనిట్లో ఈ ఏడాది మేలో జరిగిన ప్రమాదాన్ని ఇంకా మర్చిపోకముందే మళ్లీ ఇప్పుడు భారీ పేలుడు సంభవించడంతో పారిశ్రామిక ప్రాంత ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బతుకుతున్నారు. ప్రమాదంపై విచారణకు సీఎం ఆదేశం సాక్షి, హైదరాబాద్: విశాఖపట్నం హెచ్‌పీసీఎల్ కాంప్లెక్స్‌లో చోటుచేసుకున్న అగ్నిప్రమాదంపై పూర్తిస్థాయి విచారణ జరిపి నివేదిక అందించాలని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఉన్నతాధికారులను ఆదేశించారు. ఈ ఘటనపై సీఎం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ప్రమాదంలో మృతిచెందిన వారి కుటుంబాలకు సంతాపం తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని జిల్లా ఇన్చార్జి కలెక్టర్, విశాఖ పోలీస్ కమిషనర్లను ఆదేశించారు. మృతులకు విజయమ్మ సంతాపం హెచ్‌పీసీఎల్ ప్రమాదంపై వైఎస్సార్ సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ తీవ్రదిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబునాయుడు కూడా మృతుల కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలిపారు. -
హెచ్పీసీఎల్లో ప్రమాద ఘటన దృశ్యాలు
విశాఖపట్టణంలోని హెచ్పీసీఎల్లో శుక్రవారం(23-08-13) భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో 39 మందికి పైగా తీవ్ర గాయాలైయ్యాయి. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం భారీగా ప్రాణ నష్టం జరిగి ఉండవచ్చనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు.